-130 క్వింటాళ్ల అక్రమ రవాణా…!
– అధికారుల మౌనం అనుమానాలకు తావు
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండల పరిధిలో సుమారు 130 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను సివిల్ సప్లై అధికారులు వెంబడించి పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టుకున్న డీసీఎం వ్యాను ను రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచినట్లు తెలిసింది.
శనివారం రాత్రి ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆదివారం రాత్రి వరకు కూడా అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం బయటకు రాకుండా ప్రయత్నాలు జరిగాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం వ్యాన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఇందులో ఎవరి పాత్ర ఉందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టణంలోని ఓ రేషన్ డీలర్ సంరక్షణలో డంప్ చేసినట్లు సమాచారం.ఈ విషయంపై సంబంధిత టాస్క్‌ఫోర్స్,సివిల్ సప్లై అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు.



