Monday, September 29, 2025
E-PAPER
Homeక్రైమ్ముధోల్ లో పట్టపగలే భారీ చోరీ..

ముధోల్ లో పట్టపగలే భారీ చోరీ..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
 నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ని ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చొరబడి సోమవారం మధ్యాహ్నం దొంగతనానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… బాధిత కుటుంబ సభ్యుల కధనం ప్రకారం…. మహారాష్ట్రకు చెందిన గంగాసాగర అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ముధోల్ లో  ఎల్లమ్మ కాలనీ సమీపంలో ఓ ఇల్లును కొనుగోలు చేసి అందులో సంవత్సరన్నరం నుండి ఉంటున్నారు. అయితే షాపింగ్ కోసం ఇంటికి తాళం వేసి సోమవారం నిజామాబాద్ కు వెళ్లారు. అయితే నిజామాబాద్ కి వెళ్లి తిరిగి సాయంత్రం సమయంలో తమ ఇంటికి చేరుకున్నారు. దీంతో దొంగతనం జరిగిన విషయం బయట పడింది.

ఇంటి తాళం పగల కొట్టి గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న ఐదు లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, 15తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టపగలు చోరి జరగటం గమనార్హం. అయితే ముధోల్ లో మరో వ్యాపారం పెట్టుకోవడానికి నగదును ఇంట్లో పెట్టుకున్నామని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే చోరీ కి గురైన ఆభరణాలు, నగదు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులు ఈ ఘటనపై 100 సమాచారం అందించారు.

ఈ విషయం తెలుసుకున్న బాసరలో నవరాత్రి ఉత్సవాల భద్రతలో ఉన్న ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తన సిబ్బందితో సంఘటన  స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును ఎస్సై పరిశీలించారు. పలు వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంఘటన స్థలంలో వేలిముద్రల సేకరణ కోసం నిర్మల్ పోలిస్ క్లూస్ టీం వారికి సమాచారం అందించారు. ఈ విషయం పై ఎస్ఐ బిట్ల పెర్సిస్ ను నవతెలంగాణ వివరణ కోరగా  దొంగతనం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే చోరీకి గురైన ఆభరణాలు, నగదు పై పూర్తి సమాచారం తమ విచారణ తర్వాత బయటపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -