Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంఏఐని శాసించే గణితం

ఏఐని శాసించే గణితం

- Advertisement -

కృత్రిమ మేధస్సుకు పునాది మ్యాథ్స్‌
అది మన ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది
తరగతుల్లో బోధనా విధానం మారాలి
ఏఐని ఒక ప్రత్యామ్నాయంగా మార్చొద్దు
మేధావులు, నిపుణుల వెల్లడి


న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో మనుషులకు గణితం అవసరం తగ్గిపోతుందన్న భావన పెరిగిపోతున్నది. కానీ వాస్తవానికి ఏఐ ఎంత తెలివిగా మారుతున్నదో.. మనుషులు అంతకంటే లోతుగా గణితాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఏఐకి ప్రాణం పోసేది గణితమే కాబట్టి దాని ప్రాధాన్యతను గుర్తించాలని వారు చెప్తున్నారు.

ఏఐకి మూలం గణితమే
ఏఐ అనేది ఒక్కసారిగా పుట్టిన సాంకేతికత కాదని నిపుణులు చెప్తున్నారు. అది గణిత నమూనాలు, సమీకరణాలు, అల్గారిథమ్‌పై ఆధారపడి ఎదిగిందని అంటున్నారు. ”యంత్రాలు చూడటం, అనువదించడం, అంచనా వేయడం, నేర్చుకోవడం… ఇలా ఇవన్నీ గణిత సూత్రాల ద్వారానే సాధ్యమయ్యాయి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే.. గణితం లేకుండా ఏఐ అసలు ఉండదు” అని నిపుణులు గణితం ప్రాధాన్యతను వివరిస్తున్నారు.

ఆలోచనా శక్తిని పదును పెట్టే గణితం
ఏఐ.. గణితంతో తెలివిగా మారితే.. మనుషులు గణిత ఆలోచనలతో చురుకుగా మారుతారని నిపుణులు చెప్తున్నారు. పిల్లలు కేవలం ఫార్ములాలు గుర్తు పెట్టుకోవడం కాకుండా.. అసలు ఎందుకు ఆ ఫార్ములా పని చేస్తుందో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల తర్కశక్తి, నమూనాలను గుర్తించే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ఇవే నైపుణ్యాలు ఏఐ అల్గారిథంలను రూపొందించడానికి, విశ్లేషించడానికి అవసరమనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

బోధనా విధానం మారాలి
ప్రస్తుత ఏఐ యుగంలో తరగతి గదుల్లో సాగుతున్న గణిత బోధన పాత పద్దతుల్లో సాగితే సరిపోదని మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి అవసరం బట్టిపట్టడం కాదనీ, భావనాత్మక అవగాహన, వాస్తవ జీవితంతో గణితాన్ని అనుసంధానం చేయడం, సమస్యలను చిన్న దశలుగా విభజించి పరిష్కరించడం వంటివి చేయాలని వారు చెప్తున్నారు. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌, లీనియర్‌ ఆల్జీబ్రా, కాలుక్యులస్‌ వంటి అంశాలకు పాఠ్యాంశాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అడ్డంకులు కావనీ, ఏఐ వ్యవస్థలకు పునాది అని వారు చెప్తున్నారు.

ఏఐ అంటే షార్ట్‌కట్‌ కాకూడదు
ఏఐని విద్యలో ఉపయోగించాలి కానీ దాన్ని షార్ట్‌కట్‌గా మార్చకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ట్యూటర్లు సాధారణ అభ్యాసాన్ని చూసుకుంటే.. ఉపాధ్యాయులు తర్కం, చర్చ, సృజనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టగలరని వారు చెప్తున్నారు. సరైన ప్రశ్నలు అడగడం, సమస్యలను స్పష్టంగా నిర్వచించడమే భవిష్యత్తులో ముఖ్యమైన నైపుణ్యాలని అంటున్నారు. ఇది గణిత స్పష్టత, తార్కిక ఆలోచనల వల్లే సాధ్యమని వివరిస్తున్నారు.

గణితం అంటే ఆలోచించే ఒక భాష
పిల్లలు తమ ఆలోచనలను క్రమబద్ధంగా చెప్పడం, దశలవారీగా సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటే… వారు ఏఐతో మారిపోరనీ, ఏఐనే నడిపించే నాయకులవుతారని నిపుణులు చెప్తున్నారు. గణితం అంటే సంఖ్యలు కావనీ, అది ఆలోచించే ఒక భాష అని అంటున్నారు. ఏఐ మన సాధనాలను మార్చవచ్చు కానీ మన అవగాహనకు రూపం ఇచ్చేది గణితమేనని వారు చెప్తున్నారు. ఏఐ తెలివిగా మారుతున్న కొద్దీ.. మనుషులకు గణితంతో ఉన్న సంబంధం మరింత లోతుగా మారాలని సూచిస్తున్నారు. పిల్లలకు నమూనాలు చూడటం, ఫలితాలను ప్రశ్నించడం, అవకాశాలను అన్వేషించడం నేర్పితే.. వారు ఏఐని మించి భవిష్యత్తుకు ఒక చక్కని రూపాన్ని ఇవ్వగలరని మేధావులు, నిపుణులు చెప్తున్నారు.

అధునాతన గణితమే ఆధునిక ప్రపంచానికి పునాది
గ్రాఫ్‌ థియరీ, ఇన్ఫర్మేషన్‌ థియరీ లాంటి అంశాలు వినడానికి క్లిష్టంగా అనిపించినా.. వాటి వల్లే సెర్చ్‌ ఇంజిన్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధన, డేటా విశ్లేషణ సాధ్యమవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఏఐ లెక్కలు వేయగలుగుతుంది కానీ అవి ఎలా, ఎందుకు పని చేస్తున్నాయో అర్థం చేసుకునే సామర్థ్యం మనుషులదేనని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -