సినీగీత రచయితగా, కవిగా, జర్నలిస్ట్‌గా తెలుగు ప్రజలకు చిరపరిచితులు మౌనశ్రీ మల్లిక్. దిగంబర/ గరళం/ తప్తస్పృహ; మంటలస్నానం లాంటి కవితా సంపుటులను వెలువరించారు. పలు సాహిత్య పుస్తకాలకు పీఠికలు, సమీక్షలు రాశారు. అనేక చిత్రాలకు పాటలు, పలు సీరియళ్లకు (టీవీ) పాటలురాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ఈ పుస్తకం ముద్రించారు కవి. తన మిత్రుడు జి.శ్రీనివాసరాజుకు ఈ కవిత్వ సంపుటి అంకితమిచ్చారు. డా||ఎన్.గోపి ముందుమాటరాశారు. 80కి పైగా కవితలు వున్నాయి. కవిత్వ శీర్షికలే కొత్తదనం అనిపిస్తాయి. ఊపిరి లిపి, చూడు వియోగ మజిలీ క్షాన్తి:, శ్రమచక్రం, స్వప్నలోకాల స్వర లహరి, దేవభాష, విప్లవించినమౌనం, ఇందాకే, హృద్గ్రహణం, జూన్ 2, ఒక కౌగిలి కావాలి, పాత అద్దె ఇల్లు, హేమంతరాగం, రేపటి జన్యుభేదం, రాత్రి జావళి లాంటి ఎన్నో. డా|| గోపి గారు అన్నట్లు తాజాదనం పోని వీరి కవితలు కొన్ని మచ్చుకు చూద్దాం. చాలా కవితల్లో తాత్విక చింతన క(వి)నిపిస్తుంది. ‘ఈ జవన గమనంలో క్రింది లైన్లుతో పుడమి నా పుస్తకం/ మనిషి నా మస్తికం/ రుషిత్వం నా జీవన తత్వం’ అంటారు.
కవి తన ప్రాపంచిక దృక్పథాన్ని స్పష్టపరచడం బాగుంది.
తండ్రిని గురించి రాస్తూ… ‘జీవలక్షణం’లో ఒక చోట ఇలా అంటారు కవి. ”మా ఆకలి మంటలపై వర్షరుతువై మెరిసేవాడు/ ఏ ఉషస్సును మా భవిష్యత్తుగా కలగనేవాడో/ మా పాదరక్షలుగా మారాడు”
కవికి అంతర్జాతీయ దృక్పథం వుండాలి. ఆ భావనకు అర్థం చెప్పే మంచి కవిత ‘యుద్ధం జరగాల్సిందే’. హిరోషిమా, నాగసాకి చిత్రపటాలపై మనిషి కన్నీరు కార్చాలి/ పాలస్తీనా, ఇజ్రాయిల్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో రగిలే మంటలపై/ మనిషి పన్నీరు చల్లాలి”
అలాగే శీర్షికగా పెట్టిన ‘మంటల స్నానం’ కవితలో పాఠకుల్ని చైతన్యపరిచే భావసాంద్రత చూస్తాం. రోజులో ఒక్కసారైనా/ ఎండలో మాడి స్వేదమై రాలాలి/ జీవితంలో ఒక్కసారైనా/ చెడుపై దావానలమై ఎగబడి దాడి చేయాలి’ అంటారు కవి. జూన్ 2 కవితలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగిన పోరాటంపై రాసింది చాలా బాగుంది. దు:ఖ భాషను కవిత్వంగా మార్చడం గొప్ప విషయం.
ఒక ఒడ్డుకు చేరనీకి/ ఎన్ని దినాలు ఈ దినం/ ఒక యుద్ధం గెలవనీకి/ ఎన్ని తరాలు పోరాడినం/ ఒక్క పొద్దు చూడనీకి/ ఎంత సీకటిలో మగ్గినం/ ఇయ్యాల్టి పండుగ మామూలు పండుగ కాదు అంటూ త్యాగాల్ని గుర్తు చేశారు.
కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు రంగరించి రాసిన ఓ మంచి కవిత ‘మనసులో దీపం’. ఒకచోట చక్కటి భావుకతతో, ప్రేమాలయం లాంటి మమతల కోవెల ఇంటి వాతావరణాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఇలా రాశారు కవి. ”నవ్వుతూ దీపం వెలిగించే అమ్మ/ ఎదపై చెల్లిని ఆడిస్తూ నాన్న/ పొయ్యి దగ్గర వంట చేస్తూ అక్క/ రేడియోలో పాటలు వింటూ అన్న, మధు అంబట్ ఫొటోగ్రఫీలా సుందర దృశ్యాలు కదలాడుతాయి” అంటారు కవి. 1970ల్లో ప్రతి ఇంట్లో ఇలాగే వుండేది. టీవీలు, ఫోన్లు, ఖరీదైన వస్తు సముదాయం లాంటివి లేని మధ్యతరగతి ఇళ్లు అనురాగ హరివిల్లులే. ‘కవిత్వ అంతస్సారం బతుకు పోరుకావాలి’ అన్నారు రాబర్ట్ ఫ్రాస్ట్. వివేచన ప్రాధాన్యతను గుర్తించి, ఆచరించాలని చెప్పే కవితే వివేచన. ఒక చోట ఇలా అంటారు కవి.. ‘పగిలితే శిల్పం శకలాలుగా మిగులుతుంది/ విరిగితే తల్పం కల వికలమవుతుంది./ కాపాడుకోకపోతే శీలం వేలం వేయబడుతుంది/ తర్కించకపోతే మెదడు అడుసుగా మారుతుంది”. వివేచన కావాలంటే ప్రశ్నించే తత్వం అలవడాలనేదే పై కవిత ఉద్దేశం.
రైతు ప్రాధాన్యను, విలువను చెప్పే ‘అభాగ్యుడు’ కవితలో ఆర్థ్రతతో కూడిన ఈ వాక్యాలు ఆలోచింపజేస్తాయి. ”మూడు పూటలా నాలుగు మెతుకులు/ గొంతులో జారుతున్నప్పుడు కంచంలో కన్నీళ్లు రాలి/ మన్నును అన్నం చేసినోడి కాళ్లకు మనసులోనే దండం పెడతాను” అతడు రాయడానికి ‘కవిత కాదు.. నా దేశం భవిత’ అంటూ జై కిసాన్‌కు సెల్యూట్ చెప్పడం దేశభక్తే.
అమలిన శృంగార తత్వం తెలిసిన కవికి పదాల పుష్పాలు భావాలతో గొప్పగా గుబాలిస్తాయి. హేమంతరాగం కవితలో ఒక చోట అద్భుత భావంతో ఇలా అన్నారు… ‘ఈ వేళ నా దేహానికి/ మంటలస్నానం చేయించడం/ నీకు మాత్రమే తెలుసు. వస్తున్నా!/ గుమ్మానికి చూపుల తోరణాలు కట్టి దీపాలు వెలిగిస్తున్నావని తెలుసు’. ఇలాంటి భావస్పోరక కవితలెన్నో రాయాలని ఆశిస్తూ.. అభినందిస్తూ…
– తంగిరాల చక్రవర్తి, 9393804472