పెద్దలంటే గౌరవం లేదు, భయమూ భక్తీ సరేసరి. వాటికి అర్థమే తెలీదు అని విసుక్కున్నాడు లావుపాటి పెద్దమనిషి. పెద్దలనగానెవరు? మందంగా వున్నవాళ్లంతా పెద్దలేనా పాతవాసన వచ్చేవాళ్లంతా పెద్దలేనా? ఓ చోట పడుండక నీతులు బోధించడానికి నోరు పారేసుకోడానికి వచ్చేస్తారు అని విసుక్కున్నాడు సన్నటివాడు, చిన్నోడు. ఈ కాలం కుర్రవాళ్లంతా ఇంతే! సభ్యత సంస్కారమూ వీళ్లకు నిల్లే అన్న మాటలు వినపడి చిరాకు పడ్డాడు చిన్నోడు. ఓ సినియర్‌కి ఇంకో సీనియర్ వత్తాసు. మర్యాదకోసం, భయమూ భక్తికోసం వెతుకులాట వెంపర్లాట. అసలు ఈ పాతవాళ్ల మధ్య, ఈ లావుపాటి శాల్తీల మధ్య నన్ను పడెయ్యడమే తప్పు అనరిచాడు చిన్నోడు.
అరచి సాధించే ప్రయత్నం చెయ్యకు. మా స్టాండర్డు వేరు. మాకున్న పేరు ప్రఖ్యాతీ వేరు. క్లాసిక్స్ అంటారు మమ్మల్ని. ఎపిక్స్ అనీ, మహా గ్రంథాలనీ మహాకావ్యాలనీ అంటారు. మా ఖర్మకాలి అక్కడ షాపుల్లో పై అరలో, మీలాంటి బచ్చాగాళ్ల గాలి సోకకుండా వుండేవాళ్లం. ఈ బుక్‌ఫెయిర్ కోసమని డబ్బాల్లో పాతోళ్లనీ, కొత్తోళ్లనీ చూడకుండా పడేసి తెచ్చారు. పది రోజుల పుస్తకాల జాతర కదా! హడావిడిగా ఇలా సర్దేసి, మీలాంటి చిన్న సన్నోళ్లని మా మద్య ఇరికించి మాటలు పడేట్టు చేశారు అన్నాడో వెయ్యిన్నర పేజీల పెద్దమనిషి. మంచిపనే చేశాడు మన షాపు యజమాని. లేకపోతే ఈ మూల ఇన్నిన్ని కేజీల పేజీల పుస్తకాల వౌపు ఎవడైనా వస్తాడా? కన్నెత్తిచూస్తాడా? మా లాంటి ‘న్యూ జనరేషన్’ వాల్లను ఇక్కడ పెట్టారు గనక వస్తున్నారు ‘బుక్ లవర్స్’ మాకోసం అన్నాడు సన్నగా వున్నవాడు.
పట్టుమని రెండొందల పేజీలు కూడా లేవు నువ్వు. కేజీల బరువుండి వందల పేజీల్లో జ్ఞానాన్ని పంచి పెడుతున్న మాకు చెప్పేదేమిట్రా? బుక్ లవర్స్ మీకోసం వస్తారా? చూడు.. చూడు.. వచ్చిన వాళ్లంతా మమ్మల్ని చేతుల్లోకి తీసుకుని, పేజీలు తిప్పి కళ్లకదుకుంటున్నారు తెలుసా?అన్నదో పురాణగ్రంథం. కళ్లకద్దుకుని, ఇన్ని పేజీలు చదివితే కంటి చూపుకు కరువవుతామని, ఇంత గొప్ప జ్ఞానం ఇరికిస్తే మెదడులో మెడుల్లా అబ్లాంగెటా చిరిగి పీలికవుతుందని, తీసిన చోటే పెట్టి, బరువు తక్కువా, ఈజీగా అర్థమయ్యే ఈ కాలపు పుస్తకాలనే ఏరికోరి, కొనుక్కుంటున్నారు తెలుసా? అన్నాడు సన్నోడు.
ఇదే టైంలో అదే షాపులో వున్న మరో అరలో వున్న కవితాసంపుటి పక్కనున్న ఫ్రెండ్‌తో మైడియర్ కవీ, ఇక్కదంతా చీకటి చీకటిగా వుంది. గాలి ఆడ్డం లేదు. నీకెలాగుందో అంది. అవును కళారవీ కవీ! నాకూ ఆక్సిజన్ అందడం లేదు. జనరల్ నాలెడ్జి పుస్తకాలు ఎదురుగ్గా పెట్టారు. కథలూ నవలలూ కొంచెం నయమే కనిపించేట్టు అరేంజ్ చేశారు. కానీ కవితా కుసుమాలయమయిన మనల్ని ఈ చీకటి మూలకు తోశారు ఎందుకో? అన్నది సరికొత్త కవితా సంపుటి. ఎందుకేమిటి? మన డిమాండ్ పడిపోయింది మరి. శ్రీరంగం శ్రీనివాసరావూ, దాశరథీ, సినారెల కాలం కాదిది. కవిత్వం చదివే టైమేది జనాలకు. వాట్సప్పుల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ కవిత్వం విరివిగా, వేలం వెర్రిగా, వెయ్యి కాళ్ల జెర్రిలా వస్తూనే వుంది. కవితాసంపుటులు ఆవిష్కరించబడుతూనే వున్నాయి. కానేటి లాభం? కొనిచదివే వాళ్లేరి? ఉచితంగా ఇచ్చినా చదివేవాళ్లు కనిపించరు అని నిట్టూర్చాడు అన్నాడు మైడియర్ కవి, కవితా సంపుటిలో నుంచి తల బటయకు పెట్టి.
ఇదేటైంలో, బుక్ ఫెయిర్‌లో ఓ పుస్తకాల షాపులో ఓ నవల పక్క నవలతో చాటింగ్ మొదలు పెట్టింది. ఏంటో మనల్ని ఇటుతిప్పి అటు తిప్పి రేటు చూసి పోయేవారే తప్ప కొంటున్నట్టు లేరు. పక్క అరలో కథలు కొంచెం కదుల్తున్నట్టున్నాయి అన్నది ఓ నవల. అవును గురూ యద్దనపూడి, యండమూరి జమానా కాదిది. చలమూ, కొడవటిగంటీ, గోపీచంద్, బాపిరాజులు పాతబడ్డారు. ఇప్పుడు నవలలు రాసే ఓపిక తక్కువయింది రాసేవాళ్లకి. చదివేవాళ్లకు టైమెక్కడుంది అన్నది చాలా రోజుల్నుంచి షాపులోనే వుండిపోయిన మరో నవల.
కథలు కదుల్తున్నయంటున్నారు నవలసారూ! మా పనీ అంతంత మాత్రంగానే వుంది. కరంటఫయిర్సూ, సైన్సూ, జనరల్ స్టడీస్ ఇలాగ ఉద్యోగాలకు పనికివచ్చే పుస్తకాల దగ్గర చూడండి జనం ఎలా గుంపులుగా వున్నారో! మా కింద కొన్ని శృంగారానికీ, హారర్‌కి సంబంధించిన పుస్తకాలున్నాయి అవేమయినా అమ్ముడుపోతవేమో ఈ బుక్‌ఫెయిర్ ముగిసేలోగా అన్నది ఓ కథా సంపుటి.
మమ్మలి ఎవడడిగాడు అరచేతిలో పట్టే ఫోన్‌లో కావలసినంత శృంగారం చూస్తున్నారు. టీవీ ఓటీటీల్లో హారర్ చూసి తరిస్తునాఉ. పుస్తకాలు చదివి నేర్చుకునేదేం లేదు. హంతకుడెవడో అని వందల పేజీలు ఓపిగ్గా చదివే వాళ్లూ లేరు అన్న మాటలు వినిపించాయి ఆ పుస్తకాల అరలోనుంచి.
పుస్తకాల మధ్య నిలబడి వున్న మహిళ ‘మీ మాటలు అన్నీ విన్నాను. రామాయణం, మహాభారతం వటి మహాకావ్యాల్ని, సస్పెన్స్, థ్రిల్, శృంగారం, హారర్, ప్రేమ, జీవితం వంటి వాటిఇన చదివే పని లేకుండా ఎలక్ట్రానిక్స్ పుణ్యమా అని చూస్తున్నారు. కాలానుగుణంగా ట్రెండ్స్ మారతాయి. నిన్న నేటికి గతం అయిప్పుడు, నేడు రేపటికి గతం అవుతుంది కదా! చూసి చూసి విసుగెత్తి జనం దృష్టి మళ్లీ పుస్తకాలు చదవడం మీదికి మరలుతుందేమో చూడండి! బుక్‌ఫెయిర్‌కి ఎంత మంది వచ్చారో!మళ్లీ పుస్తకం వర్థిల్లుతుంది! పుస్తకానికి వయసూ లేదు, మరణమూ లేదు. పుస్తకం వర్థిల్లుతుంది’ అంటూ ఆమె కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని కౌంటర్‌కు వెళ్లింది.
బాగా చెప్పింది! భవిష్యత్తు మీద ఆశ కల్పించింది అన్నది ఓ పుస్తకం. ఆమె పేరు సర్వతి అయి వుంటుంది అని నవ్వింది మరో పుస్తకం!
– చింతపట్ల సుదర్శన్
9299809212



