విద్యార్థులకు ఉపాధ్యాయులు మనసు పెట్టి విద్యా బోధన చేయాలి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి
ఉపాధ్యాయులను దేవునితో సమానంగా పోలిక : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
విద్యార్థులలో ఙ్ఞాన తపస్సును రగలించండి: జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
63 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ – వనపర్తి
ప్రతి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి గొప్పగా ఎదగాలని, విద్యార్థులకు ఉపాధ్యాయులు మనసు పెట్టి విద్యా బోధన చేయాడం ద్వారా వనపర్తి జిల్లాను విద్యాపరంగా ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలని ప్రణాళికా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను శనివారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఒక అధ్యయనమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి… మొదటగా ఆయన ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలై.. అంచలంచెలుగా ఎదిగి దేశానికి ప్రథమ పౌరుడిగా సేవలందించారన్నారు.
తన పుట్టినరోజును “”టీచర్స్ డే గా”” జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అంటే ఉపాధ్యాయులకు ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను అభ్యసించే సమయంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని.. ఆయనకు క్షేత్రస్థాయిలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నతంగా ఎదిగారన్నారు. విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం అన్నారు. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ( అంతర్జాతీయ ప్రమాణాలతో) ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లా ఉత్తీర్ణత శాతం పెంచాలనీ.అందుకు ప్రతి ఉపాధ్యాయుడు మనసు పెట్టి బోధించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న ఏ ఒక్క ఉద్యోగి అయిన ఎంత చేసిన అప్పటి వరకే సంతృప్తి ఉంటుంది కానీ ఉపాధ్యాయుడి వృత్తి చాలా పవిత్రమైనదన్నారు. నిజాయితీగా విలువలతో కూడుకున్న ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదన్నారు. జనాభా సర్వే అయిన.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించిన అందులో ఉపాధ్యాయులు పనిచేస్తేనే అందరికీ ఒక నమ్మకం ఉంటుందన్నారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రెండు జిల్లాలను విద్యా పరంగా ఉత్తమ జిల్లాలుగా గుర్తించారని అందులో వనపర్తి జిల్లా లేకపోవడం బాధ కలిగించిందన్నారు. విద్యాపర్తిగా ఉన్న వనపర్తి.. రానున్న రోజుల్లో చదువులో ఉత్తమ జిల్లాగా తీర్చిదిదిద్దేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను సూచించారు. విద్యార్థుల్లో భట్టి విధానం కాకుండా లాజిక్ అర్థం చేసుకునే విధంగా బోధించాలని సూచించారు. సృజనాత్మకత , నైతిక విలువలను నేర్పిస్తూ సమాజానికి మేలు చేసే వారిగా తీర్చిదిద్దాలన్నారు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులలో తపస్సును రగిలించి.. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి అన్నారు. విద్యార్థులకు బోధనతో పాటు… శాస్త్రవేత్తల గురించి మంచి కథలు చెప్పి వారి మనసును ఆకర్షించాలని అప్పుడే విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారన్నారు. ఉపాధ్యాయులు, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేసిన విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఎదుగుతుందన్నారు. పోలీస్ శాఖ నుంచి విద్యార్థులకు టైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అంతకుముందు కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేక గా నిలిచిన బోనాల పండుగ సంబంధించిన వేషధారణలతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపికైన 63 మంది ఉపాధ్యాయులకు మెమెంటో, ప్రశంస పత్రంతో పాటు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిఈఓ మహమ్మద్ గని , ACGE గణేష్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.