నవతెలంగాణ – ఉప్పునుంతల
స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ స్థానిక సంస్థల ప్రాతినిధ్య సాధన కమిటీ ప్రతినిధులు గురువారం ఉప్పునుంతల మండల ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పరుశు నాయక్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
వికలాంగులకు రాబోయే స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో నామినేటెడ్ సభ్యులుగా వికలాంగులను నియమించాలని వినతిపత్రంలో కోరారు. పాలన వ్యవస్థలో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వికలాంగుల అభివృద్ధికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అవుతాయని, రాజీవ్ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, వికలాంగుల పెన్షన్లు వంటి పథకాలు కోటా ప్రకారం పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరతాయని ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నందున, తక్షణమే నిర్ణయం తీసుకొని వికలాంగులకు నామినేటెడ్ సభ్యులుగా అవకాశం కల్పించే విధంగా సిఫార్సు చేయాలని కమిటీ ఎమ్మార్వో, సీనియర్ అసిస్టెంట్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజశేఖర్, మండల కన్వీనర్ పాతుకుల నిరంజన్, మండల కో-కన్వీనర్ నాగరాజు గౌడ్, దివ్యాంగ నాయకులు లింగం గౌడ్, శీను, గెలవయ్య తదితరులు పాల్గొన్నారు.