Tuesday, January 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేడారం కిటకిట

మేడారం కిటకిట

- Advertisement -

పగిడిద్దరాజు రాక కోసం ముస్తాబవుతున్న లక్ష్మీపురం
రేపటి నుంచి జాతర ప్రారంభం
గద్ద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన
ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావు : మంత్రి సీతక్క

నవతెలంగాణ – ములుగు/తాడ్వాయి/గోవిందరావుపేట
వనదేవతల మహా జాతర సందడి రోజురోజుకూ పెరుగుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28నుంచి ప్రారంభం కానుండటంతో ముందుగానే భక్తులు మేడారం బాట పడుతున్నారు. ఆదివారం వేలల్లో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోగా, సోమవారం మేడారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దాంతో మేడారంతో పాటు పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి.

బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా, మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగోండ్ల గ్రామం నుంచి మంగళవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామం నందు గద్దె వద్ద బస చేయడానికి తీసుకురానున్నారు. పగిడిద్దరాజు రాక కోసం లక్ష్మీపురంలోని పెనక వంశీయులు, వడ్డెలు, గ్రామ పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పగిడిద్దరాజు వంశస్థులను సమ్మక్క సారలమ్మ ట్రస్ట్‌ బోర్డు చైర్మెన్‌ ఇర్ప సుకన్య సునీల్‌ దొర, మాజీ ట్రస్ట్‌ బోర్డు చైర్మెన్‌ అర్రెం లచ్చుపటేల్‌, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, పలువురు ఆహ్వానిస్తూ స్వాగతం పలకనున్నారు.

న్యూజిలాండ్‌ నుంచి మావోరి తెగ ప్రతినిధుల సందర్శన
సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. గద్దెల ప్రాంగణంలో మావోరి తెగ సంప్రదాయ నృత్యం ‘హాకా’ను ప్రదర్శించారు. ఇది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే నృత్యంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ-న్యూజిలాండ్‌ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని తెలిపారు. వారి జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. సమ్మక్క-సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌., ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కోయదొరలకు భలే గిరాకీ
జాతర సందర్శకులు కోయ దొరల తాయొత్తులు, వనమూలికలను తీసుకోవడం పలుచోట్ల కనిపించింది. మేడారం జాతర అంటేనే కోయల జాతర కాబట్టి ఇక్కడ కోయ దొరలకు భలే గిరాకీ ఉంటుంది. వారి వనమూలికలపై సందర్శకులకు నమ్మకం ఉన్నందున ప్రతి జాతరలో వారిని నమ్మి సమస్యలు చెప్పి పరిష్కారం కోసం వనమూలికలను తీసుకుంటూ ఉంటారు. కాగా, మేడారం జాతరలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్‌ బస్సులను విస్తృతంగా ఏర్పాటు చేసింది. సోమవారం జాతరలోని బస్టాండ్‌ ప్రాంతంలో సందర్శకులు పెద్దగా లేకపోవడంతో బస్సులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తిరుగు ప్రయాణంలో కొద్దిమంది ప్రయాణికులతోనే బస్సులు బయలుదేరుతున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో విస్తృతంగా సందర్శకులు జాతరను సందర్శించే అవకాశాలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -