కేంద్రం నిధులు కేటాయించాలి
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు
పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ
ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : మేడారం పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
అభివృద్ధి పనులపై సమీక్ష
నవతెలంగాణ – ములుగు/గోవిందరావుపేట
మేడారం జాతరకు జాతీయ పండుగ హౌదా కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్రం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని , సమ్మక్క సారలమ్మ జాతర పోరాటానికి, పౌరుషానికి ప్రతీకలని చెప్పారు. మేడారం ఆలయ అభివృద్ధిలో ఖర్చుకు వెనకాడబోమన్నారు. ఆలయాన్ని రాతి కట్డడాలతో నిర్మిస్తామనీ, మహా జాతర నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో మధ్యాహ్నం 12.27 గంటలకు హెలికాప్టర్‌లో సీఎంతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేరుకోగా.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్‌పీ శబరిష్.. పుష్ప గుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూం ప్రాంగణంలో సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అక్కడ నుంచి గిరిజన కొమ్ము కోయ నృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు సీఎం చేరుకున్నారు. వనదేవతలను దర్శించుకుని, 68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం విస్తరణ, పున:నిర్మాణం చేయనున్న పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, సీనియర్ అధికారులు, పూజారులతో ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్, విస్తరణ డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఆదివాసీ సంఘాలు తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని తెలిపారు.
అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహా జాతర నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపట్టాలని, ప్రకృతికి దగ్గరగా ఆలయం ఉండేలా చూడాలని సూచించారు. జంపన్న వాగులో నీటి నిల్వలు ఉండేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధులు ”గ్రీన్ ఛానల్”లో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాము లైన వారి జన్మ ధన్యమవు తుందని, భక్తితో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం మేడారంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక అని సీఎం తెలిపారు. సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, గతంలో తాను ఈ గడ్డ నుంచే పాదయాత్ర ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు.
మేడారం జాతరకు జాతీయ పండుగ హౌదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాకు వేల కోట్లు కేటాయిస్తున్నప్పుడు మేడారం జాతరకు ఎందుకు కేటాయించరని, దీనిపై కిషన్‌రెడ్డి ప్రధానిని ఒప్పించి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేడారం మహా జాతరకు మళ్లీ వస్తానని.. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరను పునరుద్ధరించడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకటరావు, బాలునాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మా బొజ్జు, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్య, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ పొదెం వీరయ్య, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఈవో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.