Monday, March 2, 2026
E-PAPER
Homeజాతీయంభారతదేశ డిఎన్‌ఎలోనే 'మధ్యవర్తిత్వం' ఉంది !

భారతదేశ డిఎన్‌ఎలోనే ‘మధ్యవర్తిత్వం’ ఉంది !

- Advertisement -

– సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
విజయవాడ :
న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం అనేది ఒక ముఖ్యమైన సాధనమని, దీన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యత కలిగిన పద్ధతిగా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. విజయవాడ పటమటలోని అంత్రా లక్స్‌ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం జరిగిన స్టేట్‌ లెవెల్‌ సింపోసియం ఆన్‌ మీడియేషన్‌ డైలాగ్‌ యాస్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ జస్టిస్‌ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యాన ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా తాను భావిస్తున్నానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని పురాతన కాలం నుంచీ మన దేశంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్‌ఎలోనే ఉందని, వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉందని వివరించారు. శ్రీకృష్ణుడు పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నాన్ని మొదటి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు. మధ్యవర్తిత్వాన్ని కోర్టులు కచ్చితంగా అందరికీ తెలిసేలా చేయాలని, 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం వల్ల దీనికి ఒక చట్టబద్ధత లభించిందని, దీనిద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేయబడతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియేషన్‌ విషయంలో ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్‌ విజయవంతమైందన్నారు. ఎపి ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు ఫలితమే అమరావతి అని పేర్కొన్నారు. మీడియేషన్‌ను లీగల్‌, ప్రొఫెషనల్‌ కల్చర్‌లో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో జడ్జిగా ఉన్న సమయంలో అమెరికాలో సెటిల్‌ అయిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి తనను ఓ న్యాయవాదిగా సంప్రదించారని తెలిపారు. ఎందుకు మీరు మీ సోదరునితో మాట్లాడకూడదని తాను చెప్పానని, ఆరు నెలల తర్వాత ఆయన కనిపించి నా ఫ్యామిలినీ, నా సోదరుడిని నేను దూరం చేసుకోలేదని చెప్పారని వివరించారు. మీడియేషన్‌కు ఉన్న శక్తి అలాంటిదని అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరి మాట్లాడుతూ మధ్యవర్తిత్వ చట్టం-2023 న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుందన్నారు. న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ఒక సంస్కరణగా మారి, తక్కువ ఖర్చుతో త్వరగా న్యాయం అందించే మార్గంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎపి లీగల్‌ సెల్‌ అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ సిహెచ్‌ మానవేంద్రనాథ్‌ రారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వ చట్టం ద్వారా దాదాపు రెండు లక్షల కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పిఎస్‌.నరసింహ, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌. భట్టి, జస్టిస్‌ జోరుమాల్యా బాగ్చీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి.సాయి ప్రసాద్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, జిల్లా జడ్జిలు, జ్యుడీషియల్‌ అధికారులు, న్యాయవాదులు, బెజవాడ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడమీ
సిజెఐకి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి

అమరావతిలో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను కోరారు. ఇందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో జస్టిస్‌ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జ్యుడీషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌ అథార్టీ, మీడియేషన్‌ సెంటర్‌, ఇంటర్నేషనల్‌ లా యూనివర్సిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేట్‌ చేస్తూ బెస్ట్‌ జ్యుడీషియల్‌ సిటీని నిర్మిస్తామని, వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిలోని జస్టిస్‌ సిటీని దేశంలోనే బెస్ట్‌ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మధ్యవర్తిత్వంతో కేసు పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తామని, కేసు పరిష్కారం కాకున్నా రూ.3 వేలు ఇస్తామని, కేసు పరిష్కారమై సత్వర న్యాయం అందితే త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -