కార్పోరేట్, ప్రయివేట్ సంస్థల పుణ్యమా అని చదువుకోవాల్సిన రోజులు పోయి, చదువుకొనాల్సిన రోజులు వచ్చాయి. ”విలువలతో కూడిన విద్య” కు తిలోదకాలిచ్చి ”ధరలతో కూడిన విద్య”ను అమలుపరుస్తున్నాయి. విద్య-వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజలందరికి సమానంగా దక్కాలి. కానీ కార్పోరేట్ శక్తులు, ప్రభుత్వం కలిసి విద్య-వైద్యాన్ని ”అంగడి సరుకు”గా,”అందని ద్రాక్ష”గా మార్చాయి. ”విద్య అంగట్లో సరుకు”గా మారిన నేపథ్యంలో మార్కెట్లో తమ ”సరుకులకు” గుర్తింపు రావడానికి, విద్యాసంస్థలకు అనుమతులు సాధించడానికి యాజమాన్యాలు చేసే అక్రమాలకు అంతేలేదు. ఏ స్థాయి విద్యాసంస్థలకు ఆ స్థాయిలో అవినీతితో ప్రభుత్వాల గుర్తింపు తెచ్చుకోవడం పరి పాటయింది. మొన్న పాఠశాల విద్యలో పాఠశాలలకు అనుమతుల విషయంలో విద్యాశాఖ అధికారులతో సహా ప్రజాప్రతినిధులు ముడుపులు తీసుకోవడం, జిల్లా విద్యాశాఖ అధికారులే అవినీతి నిరోధక అధికారులకు (ఏసిబి) పట్టుబడటం చూశాం. ఇటీవల నాక్ అక్రిడేషన్ పొందడానికి నానా గడ్డి కరచిన విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, నాక్ అధికారుల బాగోతాన్ని సిబిఐ బట్టబయలు చేసింది. నేడు ప్రయివేటు వైద్య కళాశాలల గుర్తింపు కోసం దేశవ్యాప్తంగా పలు ప్రయివేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు, ప్రయివేటు సంస్థల యాజమాన్యాలు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) సీనియర్ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), యూజీసీ మాజీ చైర్మెన్‌గా పనిచేసిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్) ఛాన్సలర్ డి.పి.సింగ్‌లకు సంబంధముందని సీనియర్ అధికారులపై సిబిఐ కేసులు నమోదు చేసింది. కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందుకు హవాలా మార్గాన్ని కూడా ఉపయోగించారని సిబిఐ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు, పారిశ్రామికాధిపతులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ కనీస ప్రమాణాలను అందుకోవడం కోసం ప్రాక్సీ అధ్యాపకులను, శాశ్వత ఉద్యోగ చూపించడం, పూర్తిస్థాయి ఫ్యాకల్టీ హాజరవుతుందని చెప్పడానికిగాను క్లోనింగ్ చేసిన వేలిముద్రలు ఉపయోగించడం, బయోమెట్రిక్ వ్యవస్థను తారుమారు చేస్తున్నారు. అలాగే దొంగ డిగ్రీ సర్టిఫికెట్లను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను జారీ చేయడం కూడా చేస్తున్నారు. ప్రయివేటు వైద్య కళాశాల యాజమాన్యాలు తమ కళాశాలలకు గుర్తింపు కోసం జాతీయ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు కాలేజీల ఇనస్పెక్షన్ షెడ్యూళ్ల వివరాలు, తనిఖీలకు వచ్చేవారి సమాచారం ఈ బృందం ముందుగానే ప్రయివేటు కాలేజీల ప్రతినిధులకు వెల్లడించేవారు. దీంతో ఆయా వైద్య సంస్థలు అధికారిక ఇన్‌స్పెక్షన్‌ల సందర్భంగా మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు వీలుండేది. అంటే కాలేజీల్లో ఘోస్ట్ ఫ్యాకల్టీని మోహరించడం, బూటకపు రోగులను అడ్మిట్ చేసుకోవడం, బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థలో అవకతవకలకు పాల్పడడం, తమ సంస్థలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేలా తనిఖీలు చేసే బృందాలకు ముడుపులివ్వడం వంటివి జరిగేవని సిబిఐ బయటపెట్టింది.
సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పౌరుల ఊపిరి నిలిపే వైద్య విద్య (మెడిసన్ చదువు)కు సమాజంలో గౌరవం ఉంది. అంతేకాదు డబ్బు సంపాదనలో అగ్రభాగంలో ఉన్నందున సీట్లకు భారీ డిమాండ్ కూడా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు కళాశాలలు కోట్ల రూపాయలకు ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటున్నాయి. వారి వ్యాపారం సులువుగా సాగాలంటే వారి కళాశాలలకు గుర్తింపు ఉండాలి. గుర్తింపునిచ్చే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జాతీయ వైద్య మండలి సంస్థలు నిర్దేశించిన షరతులను పూర్తి చేయాలి. కళాశాలలను ఆ మార్గదర్శకాలతో తీర్చిదిద్దితే అనుమతులు వస్తాయి. అవన్నీ చేయాలంటే యాజమాన్యాలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. వారికి మిగిలేది ఏమీ ఉండదు. కనుక దొడ్డిదారే శరణ్యం. జాతీయ వైద్య మండలి గుర్తింపు కొరకు మౌలిక వసతులు లేకుండా, ఘోస్ట్ ఫ్యాకల్టీ తో కొద్దిఫ్యాకల్టీ కూడా సరిగ్గా క్లాసులు తీసుకోకుండా కళాశాలలు నడపడం పరిపాటైంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులు మిథ్య! రోగులు మిథ్య! వసతులు, అధ్యాపకుల విషయాల్లో సినిమా సెట్టింగుల వలె వసతులు చూపడం, నటుల్లా ఒకరోజు అధ్యాపకులను ప్రదర్శించడం వంటి ఎత్తుగడలతో పర్యవేక్షణ అధికారులను ప్రయివేటు వైద్య కళాశాలలో బురిడీ కొట్టించడం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నట్లుగా చూపుతూ కళాశాలలకు అనుమతులు పొందడానికి దేశవ్యాప్తంగా 36 వైద్య కళాశాలలు కుమ్మక్కైన ఉదంతాన్ని సిబిఐ బయటపెట్టింది. అందులో హైదరాబాద్, వరంగల్‌తో సహా తెలుగు రాష్ట్రాలలోని ఐదు ప్రయివేటు మెడికల్ కాలేజీలు ఈ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారు.
డీమ్డ్ యూనివర్సిటీల పేరుతో కొన్ని మెడికల్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు కేటా యిస్తున్నాయి. స్వతంత్ర నిర్వహణకు అవకాశం ఉండడం, ప్రశ్నించేవారు లేకపోవడంతో వైద్యవిద్యాపమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అంతేకాకుండా కన్వీనర్ కోటా రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో స్థానిక పేద విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా 59 డీమ్డ్ యూనివర్సిటీలుండగా తెలుగు రాష్ట్రాల్లో మూడు వైద్య యూనివర్సిటీలు వైద్య విద్యనందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజుల నియంత్రణ కమిటీ వసతులను బట్టి కేటగిరీల వారీగా మెడికల్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తుంది. అయితే కమిటీలతో సంబంధం లేకుండా డీమ్డ్ యూనివర్సిటీకు సొంతంగానే ఫీజులు నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. దేశంలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు సగటున ప్రయివేటు మేనేజెమెంట్ కోటా సీట్లకు వార్షికంగా రూ.20లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
1100కు పైగా విశ్వవిద్యాలయాలు 43 వేలకు పైగా కళాశాలలతో అలరారుతున్న అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ మనది. వాటిలో ప్రమాణాలను పెంచి, నేటి మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం న్యాక్ గుర్తింపు ప్రక్రియను ప్రవేశపెట్టింది. మెరుగైన గ్రేడ్ దక్కాల ంటే మంచి విద్యాబోధన వనరులు, మౌలిక వసతులు, విశ్వసనీయత వంటివి ఉండాలి. ఇవేవీ లేకుండా గొప్ప గ్రేడ్లు సాధించడానికి తనిఖీ బృందాలకు కాలేజీలు లంచాలు మేపిన బాగోతాలను గతంలో సిబిఐ బయటపెట్టింది. డబ్బులు వెదజల్లి ఎ, ఎ ప్లస్ గ్రేడ్లు తెచ్చుకుంటున్న కాలేజీలు ప్రచారాన్ని హోరెత్తిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. దండిగా ఫీజులు గుంజుతున్నాయి. తీరా ”పైన పటారం లోన లొటారం” అని తెలిశాక విద్యార్థులు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. అవినీతిపై విమర్శల నేపథ్యంలో మొత్తం గ్రేడింగ్ విధానాన్ని ప్రక్షాళన చేస్తామని నాక్ చెప్తోంది. బాగా పుచ్చిపోయిన వ్యవస్థను సంస్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. అది మన కేంద్ర ప్రభుత్వంలో గాని రాష్ట్ర సర్కార్‌లోగానీ ఉందా అనేది ప్రశ్న.
మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యారంగ బాధ్యతలు నుండి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ప్రయివేటు రంగంలో విద్యాసంస్థలకు అనుమతులిస్తోంది. అందుకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలలు, వైద్య కళాశాలలు అని తేడా లేకుండా గతంలోని నిబంధనలను సరళీకరించి ప్రయివేటు రంగంలో విద్యాసంస్థల స్థాపనకు ఊతమిస్తోంది. విద్యా వ్యాపారీకరణ ఎదుగుతున్న క్రమంలో యాజమాన్యాల ప్రతినిధులుగా రాజకీయ నాయకులు అవతారమెత్తారు. కొన్ని ప్రభుత్వాలలో వీరు అమాత్యులుగా కూడా ఉన్నారు. వీరంతా తమ పలుకుబడిని ఉపయోగించి వారి సంస్థలకు అనుమతులు తెచ్చు కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి అసెంబ్లీ పార్లమెంటు సభ్యుల వరకు ఈ వ్యాపారంలో భాగస్వామ్యులేనని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక సందర్భంలో లోక్‌సభలోని 544 మంది సభ్యులలో 300 మందికి ఏదో రూపంలో ప్రయివేటు విశ్వ విద్యాలయాలు,ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల యాజమాన్యాలతో సంబంధం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వీరు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తారని, అందుకు కావలసిన విధానాలను రూపొందిస్తారని, చట్టాలు చేస్తారని ఆశించడం ”నేతి బీరకాయలో నెయ్యి”ని ఆశించడమే అవుతుంది. తాజాగా వైద్య కళాశాలలోని బోధకుల అర్హతలను సడలిస్తూ జాతీయ వైద్య మండలి నిబంధనలను సవరించింది. 220 పడకలు ఉంటే బోధనాసుపత్రులుగా మార్చవచ్చని, ఇకనుంచి ఎంబీబీఎస్, పీజీ కోర్సులను ఒకేసారి ప్రారంభించుకోవచ్చని కూడా నిబంధనలను మార్చింది. ఇవన్నీ ఎటువంటి వైద్యవిద్యా ప్రమాణాలకు సంకేతాలు ఇస్తాయో పాలకులకే తెలియాలి? దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త వైద్య విద్యా సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో ప్రభుత్వ రంగంలో వైద్య విద్యా కళాశాలలో ప్రారంభించడానికి బదులుగా, ప్రయివేటు రంగంలో వైద్య విద్యను ప్రోత్సహిస్తుంది. కుంభకోణాల వలన వైద్య విద్యా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీనివల్ల 150 కోట్ల మంది దేశ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశముంది!
కె.వేణుగోపాల్
9866514577
అంగట్లో వైద్యవిద్య – గాల్లో ప్రజారోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES