– ఓపీలో కనిపించని హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు
– ప్రయివేటు ప్రాక్టీస్‌కే ప్రాధాన్యత
– అసిస్టెంట్, పీజీల మీదనే ఓపీ భారం
– సరైన వైద్యం అందక రోగులఅవస్థలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బోధనాస్పత్రుల్లో వైద్య విద్య గాడి తప్పుతోంది. ఔట్ పేషెంట్ విభాగాల్లో ఆయా డిపార్టుమెంట్ల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు కనిపించడం లేదు. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దాదాపు ఓపీ మొత్తం పీజీ వైద్య విద్యార్థులే చూడాల్సి వస్తోంది.హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో కొందరు హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. కొందరు విభాగాలకే పరిమితమవుతుండగా.. మరికొంత మంది ప్రయివేటు ప్రాక్టీసుకు ప్రాధాన్యతనిస్తూ తీరిగ్గా మధ్యాహ్నం సమయంలో వస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు సొంత పనుల్లో నిమగమై తమకు ఇష్టమొచ్చిన సమయంలో చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరైతే ఓపీ విధులకు హాజరైనా.. గంట లేదా రెండు గంటలు ఉండి మ.మ అనిపించుకుని వెళ్తున్నారని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా ఓపీ భారమంతా పీజీలు, సీనియర్ రెసిడెన్స్‌లు, అసిస్టెంట్, అసోసియేట్లపైనే పడుతున్నట్టు కొందరు వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
భారమంతా పీజీలపైనే..!
ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో లేకపోవడంతో వందల సంఖ్యలో వచ్చే రోగులకు పీజీ విద్యార్థులు సమాధానం చెప్పలేకపోతున్నారు. కొన్ని దవాఖానాల్లో అయితే అసిస్టెంట్, అసోసియేట్ స్థాయి ప్రొఫెసర్లు కూడా ఓపీ విధుల్లో సరిగ్గా ఉండటం లేదని కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోటి ఈఎన్‌టీ, పేట్లబుర్జు ప్రసూతి దవాఖానాల్లో ప్రొఫెసర్లు తరగతుల పేరుతో మధ్యాహ్నం 2 గంటలకే బయటకు వెళ్లిపోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఓపీకి సైతం చాలా మంది ప్రొఫెసర్లు దూరంగా ఉంటున్నారనీ, కొంత మంది కేవలం డిపార్టుమెంట్ రూమ్‌లకే పరిమితమ వుతున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఇదే అంశంపై అప్పటి మంత్రి, ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లును హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రొఫెసర్లు కచ్చితంగా ఓపీలో ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా నాటి మంత్రి, అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత సర్కార్ మారడం, ప్రస్తుత వైద్య శాఖ మంత్రి, అధికారులు అంతగా దృష్టి పెట్టకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అరకొర వైద్యంతో అవస్థలు..!
అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీలో అందుబాటులో లేకపోవడంతో ఓపీ కోసం నిరీక్షించే రోగులకు వైద్య విద్యార్థులే దిక్కవుతున్నారు. దీంతో కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు ఓపీ విభాగాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
గాడి తప్పుతున్న వైద్యవిద్య..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES