Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంవైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి

వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి

- Advertisement -

– ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ పెంచాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
– మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన, ప్రజావాణిలో వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చి, ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణ పెంచాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆ పార్టీ నాయకులు నిరసన చేపట్టి.. ప్రజావాణిలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) హరిప్రియకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. అల్వాల్‌ ప్రభుత్వ సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడ్చల్‌ ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షెడ్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మేడ్చల్‌, శామీుర్‌పేట, ఘట్‌కేసర్‌ ఆస్పత్రులను వంద పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని, అందుకు తగినట్టుగా సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఆరోగ్యశ్రీ రూ.1100 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని, ప్రమాణాలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వినోద మాట్లాడుతూ.. పీహెచ్‌సీ, ఏరియా, బస్తీ దవాఖానాల్లో సరిపడా నర్సులు లేరన్నారు. డెలివరీల కోసం ఆయా ఆస్పత్రుల్లో స్కానింగ్‌, బెడ్లు లేవన్నారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. లేకపోతే జిల్లా మొత్తం సర్వే చేసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అశోక్‌, రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు నరేష్‌, శంకర్‌, సంతోష్‌, నాయకులు మంగ, పూజ, నర్సింగ్‌ రావు, కొమురయ్య, ధర్మారెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -