డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా అమ్మకాలు..
జనరిక్ మందులకు బ్రాందెడ్ ధరలు వసూలు..
నిద్రావేవస్త లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు..
మెడికల్ షాపుల సంఘాల గుప్పెట్లో అధికారులు..
తూతూమంత్రంగా పర్యవేక్షణ..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది.రోగుల ఆరోగ్యాన్ని తక్కువ చేస్తూ లాభాల కోసం పరుగులు పెడుతున్న మెడికల్ మాఫియా మితిమీరుతోంది. అసలు ధర కంటే తక్కువగా ఉండే జనరిక్ మందులను బ్రాండెడ్ ఔషదాల ధరలతో పాటు వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నది.పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలగా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు ఇచ్చేస్తున్నారు. హెూల్ సేల్ డ్రగ్ వ్యాపారులు, మెడికల్ దుకాణాల నిర్వాహకులు ధనార్దనే వేయ్యంగా నిబంధనలకు తిలోదకాలిస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. డాక్టర్ మందుల చీటి లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడడంతో వారు ఆడింది అటా..పాడించే పాటగా మారింది.
జ్వరం వచ్చిందనో, జలుబు చేసిందనో డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే నేరుగా మెడికల్ దుకాణానికి వెళుతుంటారు. డాక్టర్ వద్దకి వెలితే రూ.300 నుంచి రూ.500 వరకూ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. స్పెషలిస్టు డాక్టర్ అయితే రూ.600 వరకు ఫీజు తీసుకుంటున్నారు. అంత పీజులు చెల్లించలేని పేదప్రజలు ఏదైనా మెడికల్ షాపుకు వెళ్లి మందులు అడిగితే ఓ గోలి లేదా టానిక్ ఇచ్చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అయితే మెడికల్ షాపుల వాళ్లు ఇచ్చే మందులు అన్ని సరైనవేనా.! లేఖ నకిలీ మందులు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తే మంచిది.
ఎందుకంటారా హెూల్ సేల్ డ్రగ్ వ్యాపారులు మెడికల్ దుకాణాల నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. హెూల్ సేల్ వ్యాపారులు మెడికల్ దుకాణాలకు ఇచ్చే ప్రతీ డ్రగ్ పై బ్యాచ్ నంబర్ ఉంటుంది. ఇలా రిటైల్ దుకాణాలకు ఇచ్చే సమయంలో బిల్లుపై పొందుపర్చిన బ్యాచ్ నంబర్, కొనుగోలుదారునికి ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబరు కూడా ఒక్కటే విధంగా ఉంటేనే సరైనవేనని నమ్మొచ్చు కానీ, రెండు బిల్లుల పై వేర్వేరు నంబర్లు ఉండడంతో నకిలీ మందుల దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లా లో ఔషధ అధికారుల నియంత్రణ కరువు…
వైద్యం పేరుతో వ్యాపారం చేసే కొన్ని హెూల్ సెల్ ఏజెన్సీలతోపాటు, మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. జిల్లాలో ఎన్ని షాపులకు అనుమతి ఉంది.ఎవరు నిబంధనలు అతిక్రమిస్తూ మందులు విక్రయిస్తున్నారనే విషయం పై తనిఖీలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది.అయితే ప్రస్తుతం మందుల పాపుల యజమానులు మాత్రం జనరిక్ ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారు.బ్రాండెడ్ మందులు విక్రయిస్తే రిటైర్లకు సుమారు 18 నుంచి 20 శాతం లాభాలు వస్తుండగా,వాటి పేరుతో జనరిక్ మందులు అమ్మితే 70 నుంచి 200ల శాతం లాబాలు గడిస్తున్నారు.
జనరిక్, బ్రాండెడ్ మందుల నాణ్యతలో ఎలాంటి వ్యత్యాసం లేదని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ వైద్యులు జనరిక్ సిఫార్చు చేయడం లేదు.ఒకే కరమైన మందుల్ని తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు జనరిక్ పై ఒక ధర బ్రాండెడ్ మందులపై మరో ధర ముద్రిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రెండు ధరలను ముద్రించడంతో గందరగోళం నెలకొంది. దీంతో రెండు రకాల మందుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది.ఉదాహరణకు ఓ కంపెనీ తయారు చేసిన పెంటోప్రాజోల్ పది మాత్రలకు బ్రాండెడ్ కంపెనీలో రూ.120 లభిస్తుండగా జనరిక్ లో రూ.20 కే లభిస్తుంది.
నిబంధనలు గాలికి వదిలి…యజమానులకు వత్తాసు
డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించొద్దనే నిబంధనను మెడికల్ షాపుల యజమానులు తుంగలో తొక్కుతున్నారు. కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.మెడికల్ షాపును నిర్వహించే ఫార్మాసిస్టు డ్రెస్ కోడ్ తో పాటు మందులు అందించే సమయంలో గ్లౌజులు వేసుకోవాలి. కొన్ని మందులను ప్రిజ్ లో మాత్రమే భద్రపరచాలి. డాక్టర్ చీటి ప్రిస్కిప్షన్) లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. వినియోగదారుడికి కచ్చితంగా మందుల వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలి.
కానీ ఏదో ఒకటి రెండు మెడికల్ షాపుల్లో తప్పా మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదనేది నగ్నసత్యం పేదలకు అందుబాటులోకి రావాల్సిన జనరిక్ మందులను అధికారులు ఎందుకు ప్రోత్సహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా మెడికల్ దుకాణాల యూనియన్ కనుసన్నల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు నడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ల నుంచి ఇచ్చే మామూళ్లు తీసుకుని మెడికల్ షాపులపై నిఘా ఉంచడం లేదని విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాలో ఇప్పటి వరకు ఏ మెడికల్ షాప్ ను కూడా జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేసిన పాపాన పోలేదు.
కమీషన్ పేరు తో ఒప్పందాలు…
జిల్లాలో మందుల విక్రయం వ్యాపారంగా మారింది. మా కంపెనీకి చెందిన రూ.కోటి విలువ చేసే మందులు సేల్ చేస్తే అందులో రూ.40 శాతం కమీషన్ ఇస్తామని నిర్వాహకులు డాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.దీంతో వైద్యులు ఆ కంపెనీ మందులు సేల్ చేసేందుకు అవసరం ఉన్నా లేకున్నా రోగుల నెత్తిన రుద్దుతున్నారు.కంపెనీ విధించిన టార్గెట్ ను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు.తప్ప సేవ చేయాలనే ఆలోషణ ఏ మాత్రం వారిలో కనిపించడం లేదు. ప్రొటీన్ పౌడర్ బ్రాండెడ్ రూ.150కి లభిస్తుండగా జనరిక్ లో రూ.25లకు లభిస్తుంది. ఎన్జైమ్ సిరప్ రూ.60లకు లభిస్తే జనరిక్ లో రూ.26 కి లభిస్తుంది, ట్యాబ్లెట్ ఎసినిక్ ఫ్లస్ బ్రాండెడ్ లో రూ.50లకు లభిస్తుండగా, జనరిక్ షాపుల్లో రూ.10 కె లభిస్తుండడం గమనార్హం. అయితే ఏజెన్సీ ప్రాంతాలలో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయని కారణంగా రోగులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని దష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందులు ఏర్పాటు చేస్తే రోగులకు ప్రయోజనం చేకూరుతుంది.



