నవతెలంగాణ-రాయికల్: అంతా మా ఇష్టం…! మమ్మల్ని అడిగే వారే లేరు అన్న చందంగా పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు. సమయపాలన పాటించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సరైన సమయానికి రాకపోవడంతో అనరోగ్యంతో బాధపడుతున్న రోగులు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద గంటల తరబడి వైద్య సిబ్బంది కోసం ఎదురుచూపులు చూడడం తప్పడం లేదు. దీంతో ఆరోగ్య కేంద్రం వద్ద రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు పరచడంలో ఆసుపత్రి సిబ్బంది నీరుగారుస్తున్నారు. ఉదయం 9 గంటల వరకే సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవలసిన సిబ్బంది బుధవారం ఉదయం 10 గంటలవుతున్నా వైద్య సిబ్బంది ఎవరు లేకపోవడంతో రోగులు ఆసుపత్రి ముందు కూర్చుని వైద్య సిబ్బంది కోసం పడిగాపులు కాస్తున్నారు.
వైద్యులు,మెడికల్ ఆఫీసర్,ల్యాబ్ టెక్నీషియన్లు,సామాజిక ఆరోగ్య కేంద్రానికి రావడానికి సమయపాలన పాటించడం లేదని ఓపి గది ఎదుట ఉన్న రోగులు వాపోయారు.స్టాఫ్ నర్సులు మాత్రం వైద్యులు వచ్చే వరకు రిసెప్షన్ వద్ద అందరూ ఒకే చోట గుమి గూడి కాలయాపన చేస్తున్నారు.
వైద్యులు,మెడికల్ ఆఫీసర్ సమయపాలన పై నవతెలంగాణ జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ రాములు ను వివరణ కోరగా….. ప్రస్తుతం డాక్టర్ అనిల్,మరోవైద్యుడు అందుబాటులో ఉన్నారని నేడు ఓ శస్త్ర చికిత్స కూడా ఉందని,ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్ ఆస్పత్రిలో అందుబాటులోనే ఉన్నారని కావాలంటే వెళ్లి కలవండని తెలుపుతూ సమయపాలన పై మాత్రం వివరణ ఇవ్వలేకపోయారు