ప్రమాదకర కేటగిరీ-1 కింద కేంద్రం హెచ్చరిక జారీ
ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో జలశక్తి శాఖ సమాధానం
ఆయా రాష్ట్రాలే మరమ్మతులు చేపట్టాలని సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 కింద ప్రమాదకరమైన డ్యామ్‌గా గుర్తించింది. గురువారం లోక్‌సభలో ఏపీ టీడీపీ ఎంపీలు జి.లక్ష్మినారాయణ, భైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానం చెప్పింది. దేశంలో ఉన్న మొత్తం ఆనకట్టలెన్ని, యాభై సంవత్సరాలకు పైగా ఉన్న వాటి సంఖ్య, ప్రమాదంలో ఎన్ని ఉన్నాయి? వాటి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) 2025 ప్రకారం ప్రీ-మాన్‌సూన్, పోస్ట్-మాన్‌సూన్ తనిఖీల సందర్భంగా గుర్తించిన మరమ్మతులు, నిర్వహణ ప్రాతిపదికన దేశంలోని ఆనకట్టలను మూడు వర్గాలుగా (కేటగిరీ 1,2,3) విభజించామన్నారు.
కేటగిరీ-3 కింద చిన్న మరమ్మతులు, సత్వర పరిష్కార చర్యలు అవసరమయ్యే ఆనకట్టలను కేటగిరీ-2 కింద చేర్చామని తెలిపారు. కేటగిరీ-3 కింద దేశంలోని మూడు ప్రాజెక్ట్‌లను గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ, ఉత్తర ప్రదేశ్‌లోని దిగువ ఖజురి డ్యామ్, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీ ఉన్నాయని తెలిపారు. కాగా మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆనకట్టల నిర్వహణతో పాటు మరమ్మతులు ఆయా రాష్ట్రాలే చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేటగిరీ 2,3 కింద ఉన్న ఆనకట్టల్లో తాము గుర్తించిన వాటికి మాత్రమే నిధులు సమకూరుస్తామని అన్నారు. మేడిగడ్డ మరమ్మతులను త్వరలో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం గమనార్హం.
రెండేండ్లుగా..
రెండేండ్ల క్రితం… 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ హెచ్చరించింది. బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తేల్చింది. సీకెంట్ పైల్స్ వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాంను తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్టు గుర్తించారు. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్ ఆరోపించింది. రూ.4,613 కోట్లకు అంచనాలను సవరించి, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్టు ధ్రువీకరణ పత్రం కోరడంపై కూడా గతంలో విచారణ జరిపారు.



