రుతుస్రావ సమయంలో పరిశుభ్రతను పాటించలేక అమ్మాయిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలో సరైన సదుపాయాలు లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ప్యాడ్లు, మరుగుదొడ్లు అందుబాటులో లేక, అవి ఉన్నా నీటి సౌకర్యం లేక చదువుకు దూరమవుతున్నారు. రాజ్యాంగం అందించిన జీవించే హక్కుకు అమ్మాయిలు దూరమవుతున్నారు ఇది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రుతు ఆరోగ్యంపై కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వివరాలు నేటి మానవిలో…
రుతు ఆరోగ్యం సైతం జీవించే హక్కులో ఓ భాగమంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో ఉచిత శానిటరీ ప్యాడ్‌లు, టాయిలెట్‌లను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు న్యాయమూర్తులు జె బి పార్దివాలా, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉచిత శానిటరీ ప్యాడ్‌లు అందించడంతో పాటు టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలను జారీ చేసింది. నిజంగా ఈ తీర్పు ఓ మైలురాయి. అమ్మాయిల జీవితంలో కొత్త వెలుగులు నింపే ఈ తీర్పును అందరూ సాదరంగా ఆహ్వానించాలి. ‘పాఠశాలకు వెళ్లే బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత విధానాన్ని’ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ జయ ఠాకూర్ డిసెంబర్ 10, 2024న దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ తీర్పును రిజర్వ్ చేసింది.
విద్యా సమానత్వానికై…
రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కులో భాగంగా రుతు ఆరోగ్య హక్కును ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బాలికలకు ఉచితంగా ఆక్సో-బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్‌లు, టాయిలెట్‌లను అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లింగ న్యాయం, విద్యా సమానత్వాన్ని నిర్ధారించడానికి ఈ తీర్పు ఎంతో ఉపకరిస్తుంది. ఈ తీర్పును ఎవరైనా పాటించకపోతే కఠినమైన పరిణామాలు ఉంటాయని కూడా ధర్మాసనం హెచ్చరించింది. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ సంస్థలలో వైఫల్యాలకు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా జవాబుదారీగా ఉంటాయి.
ఉచిత న్యాప్‌కిన్‌లు
‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతు ఆరోగ్యం హక్కు కూడా ఉంది. సురక్షితమైన, ప్రభావవంతమైన రుతు పరిశుభ్రత వల్ల ఒక బాలిక అత్యున్నత స్థాయి లైంగిక, పునరు త్పత్తి ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి హక్కు, లైంగిక ఆరోగ్యం, విద్య, సమాచారాన్ని పొందే హక్కును బాలికకు ఉంటుంది. కనుక పట్టణ, గ్రామీణ ప్రాంతాల లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఆక్సో-బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉచితంగా అందించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ధారించాలని మేము నిర్దేశిస్తున్నాము’ అని ధర్మాసనం పేర్కొంది.
మరుగుదొడ్ల విషయంలో
ప్రతి పాఠశాలలో పరిశుభ్రమైన, నీటి సౌకర్యం కలిగిన మరుగుదొడ్లు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా కోర్పు ఆదేశించింది. పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించిన అన్ని మరుగుదొడ్లను అమ్మాయిలు ఉపయోగించుకునేందుకు అనుకూలంగా ఉండాలని చెప్పింది. వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చడం గురించి కూడా ప్రస్తా వించింది. ఆర్టికల్ 14 కింద సమానత్వానికి సంబంధించిన ముఖ్యమైన విధానం. దీనిప్రకారం హక్కుల వాస్తవిక అనువాదానికి ఆటంకం కలిగించే వ్యక్తిగత, సంస్థాగత, వ్యవస్థాగత, సందర్భోచిత అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయాలని కోరుతుంది. ‘అదే సమయంలో ప్రతి రాష్ట్రం అటువంటి నిర్మాణాత్మక ప్రతికూలతలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. రుతు పరిశుభ్రత నిర్వహణ చర్యలను అందుబాటులో ఉంచలేక పోవడం వల్ల ఆడపిల్లల గౌరవం దెబ్బతింటుంది. అవమానాలకు గురవ్వడం, పాఠశాల నుండి బయటకు వెళ్లిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది’ అని కోర్టు ప్రకటించింది.
సమాన అవకాశాలు కల్పించాలి
‘గోప్యత గౌరవంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఫలితంగా ఈ గోప్యతా హక్కు అమ్మాయిల గోప్యతను ఉల్లంఘించకుండా ఉండటమే కాకుండా ఒక వ్యక్తి గోప్యతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవడం రాష్ట్రాల బాధ్యత’ అని కోర్టు జోడించింది. అదే సమయంలో సమానత్వ హక్కు ద్వారా ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రయోజ నాలు పొందే విధంగా ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని కూడా ధర్మాసనం వివరించింది. ‘రుతు పరిశుభ్రత నిర్వహణ చర్యలను అందుబాటులో ఉంచలేకపోవడం పాఠశాలలో అమ్మాయిలు తమ సమాన హక్కులను ఉపయోగించుకోలేరు. సమాన విద్య అందక పోవడం వల్ల తర్వాత కాలంలో అమ్మాయిలు అన్ని రంగాలలో పాల్గొనలేకపోతారు’ అని అది పేర్కొంది. ఇది ఆర్టికల్ 21, ఆర్‌టీఏ చట్టం ప్రకారం తప్పనిసరిగా అనుసరించాలి. ఈ విధంగా నాణ్యమైన విద్యను పొందడం కూడా అమ్మాయిల ప్రాథమిక హక్కు అని కూడా కోర్టు గుర్తుచేసింది. కనుక అమ్మాయిల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు రుతు పరిశుభ్రత అత్యంత కీలకమైనదని ధర్మాసనం గుర్తు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆర్‌టీఏలోని సెక్షన్ 19లో పేర్కొన్న నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా అన్ని పాఠశాలలు నడుచుకోవాలని తీర్పులో పేర్కొంది.
నిబంధనలు పాటించాల్సిందే
కోర్టు తీర్పు ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఆర్‌టీఏ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నట్లు తేలితే దాని గుర్తింపు రద్దు చేయబడుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి పాఠశాలలో రుతు పరిశుభ్రత నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది. అలాగే రుతు ఆరోగ్యం, యుక్తవయసు గురించి అవగాహన కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్యాడ్‌లు, టాయిలెట్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల కౌమారదశలోని బాలికలు అబ్బాయిలతో సమానంగా విద్యలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. ఇదొక నిరోధక వ్యవస్థగా అనేక అడ్డంకులు కల్పిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.



