నవతెలంగాణ-హైదరాబాద్: రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు బయోడిగ్రేడబుల్ మెన్‌స్ట్రువల్ శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా అందించాలని అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల(యుటి)ను ఆదేశించింది. రాష్ట్రాలు, యుటిలు విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలను కల్పించాలని జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా లేదా నియంత్రణలో ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలలు విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యవంతమైన టాయిలెట్స్ ఉండేలా చూడాలని ఆదేశించింది.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కింద రుతుక్రమ ఆరోగ్యం కూడా జీవించే హక్కుతో సమానం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఈ సౌకర్యాలను అందించడంలో విఫలమైన ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆదేశించింది. ఒకవేళ విద్యార్థినులకు టాయిలెట్స్, ఉచిత శానిటరీ నాప్‌కిన్లను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా విఫలమైతే దానికి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలని హెచ్చరించింది.
2024 డిసెంబర్ 10న జయఠాకూర్ దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణలోని పాఠశాలల్లోని 6నుండి 12వ తరగతికి చెందిన కౌమార బాలికలకు కేంద్ర ప్రభుత్వ ‘రుతుక్రమ పరిశుభ్రత విధానం’ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పిల్‌లో కోరారు. ఈ పిల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించింది.



