Monday, February 9, 2026
E-PAPER
Homeమానవినెల‌స‌రి అవ‌రోధం కాకూడదు

నెల‌స‌రి అవ‌రోధం కాకూడదు

- Advertisement -

ఇటీవల పేపర్‌లో మొదటి పేజీ న్యూస్‌ హెడ్లైన్స్‌గా ప్రచురింపబడిన సుప్రీమ్‌ కోర్ట్‌ ఇచ్చిన ఒక మహత్తర తీర్పు అందరి దృష్టినీ ఆకట్టుకున్నది. ‘మెన్స్ట్రుల్‌ హెల్త్‌ ఇన్‌ స్కూల్స్‌ ఈస్‌ ఇంటెగ్రల్‌ టు రైట్‌ టు లైఫ్‌.’ ఆ రోజు జనవరి ముప్ఫయి, నేషనల్‌ మర్టర్స్‌ డే నాడు ఈ విషయం ప్రకటించిడం ఎందరినో, ముఖ్యంగా సిటీల్లో, కార్పొరేట్‌ స్కూళ్లలో చదివే వారి ఊహక్కూడా అందనటువంటి విధంగా, ప్రత్యేకించి ఊళ్లలోని బడుల్లో ఆడపిల్లలు పడే అగచాట్ల పట్ల అవగాహన ఉన్న ఎందరో మహిళలకి ‘ఎంత మంచి తీర్పు! ఆలస్యమైనా వచ్చింది కదా’ అని ఒక దీర్ఘ నిట్టూర్పు తీసుకొనేలా చేసింది. సామజిక స్పృహ కలిగిన మరింకెందరికో సంతోషాన్ని కలిగించింది. దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అత్యావశ్యకమైన రెండు సౌకర్యాలను పిల్లలకు అందుబాటులో ఉంచవల్సిందిగా కోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో మొదటిది అన్ని స్కూళ్లలో, అవసరమున్న బాలికలందరికీ ఉచిత, బయోడిగ్రేడబుల్‌ సానిటరీ నాప్కిన్స్‌ను, అవి కూడా అవసరానికి వెంటనే లభించే విధంగా, మరుగుదొడ్డిలోనే సరఫరా మెషిన్‌లను ఏర్పాటు చేసి, మహిళా టీచర్‌ అధికారి ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచవల్సిందిగా ఆదేశించింది. అలాగే సౌకర్యంగా ఉన్నటువంటి, లింగ ఆధారితంగా వేరు చేయబడినటువంటి, నీటి సదుపాయం, గోప్యత, పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కొగలిగేట్టుగా వాష్‌ బేసిన్లు, సబ్బు, ఫ్లష్‌ వగైరా అన్ని సదుపాయాలతో మరుగుదొడ్ల నియామకం. భారత రాజ్యాంగంలోని రైట్‌ టు ఎడ్యుకేషన్‌, లైఫ్‌, డిగ్నిటీ, ఈక్వాలిటీ వంటి అతి కీలకమైన ప్రాథమిక హక్కులను వక్కాణిస్తూ సుప్రీమ్‌ కోర్ట్‌ ఈ తీర్పునిచ్చింది.

దీని అర్థమేమిటి?
ఇంతవరకు ఈ ప్రాథమిక సదుపాయాలు స్కూళ్లలో తగు స్థాయిలో లేవనే కదా! ఒక్క నిముషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ పిల్లలు ముఖ్యంగా నెలసరి మొదలైన ఆడపిల్లలు, ఆ రోజుల్లో ఇబ్బందుల పాలౌతున్నారా? సాధారణంగా
ఆరు-ఏడూ తరగతుల్లో ఉన్నప్పుడు ఆడపిల్లలికి నెలసరి మొదలౌతుంది. అది ఎంతో సున్నిత వయసు. నెలసరి ఇబ్బందుల పట్ల వారికి ఎంతో భయం, సిగ్గు, అయోమయం, ఇబ్బంది, విముఖత ఉంటుంది. ఆడా-మగ పిల్లలు కలిసి చదువుకొనే
స్కూళ్లలో వారికి అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. పేరుకే బాత్రూములు, అప్పుడప్పుడు తలుపు కూడా సరిగా ఉండదు. ఉన్నా గొళ్ళెం, గోప్యత ఉండదు. రక్త స్రావం అధికంగా అయ్యింది, వాడిన బట్టంతా తడిసిపోయింది. పరిస్థితి అగమ్యగోచరం. నీళ్లు లేవు. ఇక బాత్రూములు లేని స్కూళ్లలో ప్రకృతి దయాదాక్షిణ్యాలే దిక్కు.

వసతులే కరువైన చోట
ఆడపిల్లల్ని ఇటువంటి పరిస్థితుల్లో చదువు మీద శ్రద్ధ పెట్టమంటే ఎలా పెట్ట గల్గు తారు? ప్రతి నెలా మూడు నుంచి ఐదు రోజులు ఈ విధంగా గడపవలసి వస్తుంది. అయినా కూడా అన్నిటికీ ఓర్చుకొని శ్రమిస్తూనే ఉంటారు మన ఆడపిల్లలు. స్కూల్‌ ఆబ్సెంటీయిజంకి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఆడపిల్లల పురోగతికి ఆ దశలోనే పెద్ద ఆటంకం పడిపోతుంది. తెలివి ఎంత ఉన్నా దానిని విజ్ఞాన పరంగా సాన పెట్టకపోతే అది వృథా! ఏ వసతులు లేకపోయినప్పటికీ కూడా ఆడపిల్లలు చదువులో ముందంజ వేస్తున్నారంటే అది వారి పట్టుదలకి, సామర్థ్యానికి నిదర్శనం! పూర్వం నెలసరి రోజుల్లో ఆడవారి ఇబ్బందుల్ని గమనించే కావచ్చు మన పెద్దవారు సామాన్యులకు అర్థమ య్యేలా ‘అంటూ’ అని నియమం పెట్టి ఆ రోజుల్లో వారికి పరిపూర్ణ విశ్రాంతిని కలుగ జేసే వారు. కాలాం తరంలో ఆడవారి సదుపాయం కొరకు పెట్టిన నియమం వెర్రితలలు తొడిగేసరికి, వారే పాటించకుండా అయిపోయారు. కనీస వసతులే కరువైన చోట పారిశుభ్రత గురించి మాట్లాడే అవకాశమే లేదు!

నెలసరి అంటే ఏమిటి?
క్లుప్తంగా.. నెలసరి మొదలైందంటే అమ్మాయిలో అండాశయాలు (ఓవరీస్‌) చురుకుగా పనిచేస్తున్నాయని, దాదాపుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకొక సారి అండాన్ని విడుదల చేస్తున్నాయని, అవి గర్భసంచి లోపలి పొరలోకి వచ్చి చేరతాయని, ఆ పొర తరువాత గర్భసంచి నుండి విడిపడి యోని ద్వారం ద్వారా బయటికి విసర్జింప బడతాయని, ఆ ప్రక్రియలో రక్తస్రావం జరుగుతుందని అర్థం. ఆ విధంగా రోజంతా రక్తస్రావమౌతూ ఉండేటటు వంటి యోని ద్వారం, చుట్టూ ఉన్న చర్మం అపరిశుభ్రంగా ఉన్నట్టయితే ఎన్నెన్నో సమస్యలు వచ్చి పడతాయి. అలా కాకుండా ఉండాలంటే మొట్టమొదలుగా రుతుస్రావం జరుగుతున్న సమయంలో ఎటువంటి శోషక పదార్థాలు వాడడం జరుగుతుంది, ఎంత తరచుగా మార్చడం జరుగుతుంది అన్నవి చాల ముఖ్యంగా పట్టించుకోవాల్సిన అంశాలు. వీటితో బాటు కడుక్కోడానికి శుభ్రమైన నీరు, సబ్బు అందుబాటులో ఉన్నాయా, వీటన్నిటికంటే ముందు వాడుకలో ఉన్న, సురక్షితమైన, గోప్యతను ఇచ్చేటటువంటి, ఆడపిల్లల వాడుకకు మాత్రమే పరిమితమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా.. ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

స్వల్పకాలిక జబ్బులు
రుతు స్రావం జరుగుతున్న సమయంలో శుభ్రత లోపిస్తే, ఆడపిల్లల ఆరోగ్యపరమైన పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. రక్తస్రావం జరుగుతునన్ని రోజులు శుభ్రత పాటించకపోతే వ్యాధికారక క్రిములు యోని ద్వారా పునరుత్పత్తి అవయవాలకు సులభంగా చేరుకోగల్గుతాయి. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను వ్యాపింపజేసి, తీవ్ర అస్వస్థతకు గురి చేయవచ్చు. నెలసరి సమయంలో రక్తస్రావం మొదలైన రెండు మూడు రోజులు ప్రతి రెండు మూడు గంటల వ్యవధిలో/అవసరాన్ని బట్టి రక్తస్రావాన్ని పీల్చుకొనే పాడ్‌/బట్ట మార్చకపోతే అంటుక్రిములు లోనికి చొచ్చుకొని పోతాయి. మూత్రవ్యవస్థను కూడా కబళిస్తాయి. యోని స్థలంలో నిరంతరంగా తడి ఉండడంతో చర్మవ్యాధులు రావచ్చు. శరీరం నుండి దుర్గంధము రావడం వంటివి వారిని అనారోగ్యులుగా చేయడమే కాకుండా నీరసం, ఒత్తిడి, కదలడానికి

ఇబ్బందికరమైన స్థితి, సాంఘికంగా వెలివేయపడినట్టుగా, ఆత్మన్యూనత, డిప్రెషన్‌ వంటి మానసిక రుగ్మతలకు లోనవడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఇవే పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగితే ఆడపిల్లలు దీర్ఘ ఆరోగ్య సమస్యలకు గురౌతారు. వారి పునరుత్పత్తి వ్యవస్థ బలహీనపడి పోవడమే కాకుండా భవిష్యత్తులో సంతానలేమి, దానితో కూడిన సామజిక, మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఎంతో ఉంది.

ప్రభుత్వ బాధ్యత
పై సమస్యల దృష్ట్యా, ఆడపిల్లలు చదువుకొనే విద్యాసంస్థల్లో ఎం హెచ్‌ ఎం (మెన్స్ట్రుల్‌ హెల్త్‌ మేనేజ్మెంట్‌) పాలిసీల ఆచరణ అనివార్యం చేయాలి. ఆలా చేసిన వాటికే పర్మిషన్‌ మంజూరు చెయ్యాలి. మెన్స్ట్రుల్‌ హెల్త్‌ వసతులు బడికి వెళ్లి చదువుకొనే ప్రతి ఆడపిల్ల హక్కు. వసతులు ఉంటేనే విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అతిత్వరలో డా. జయ ఠాకూర్‌ దాఖలు చేసిన పిఐఎల్‌కి సుప్రీమ్‌ కోర్ట్‌ ఇచ్చిన ఈ తీర్పు ద్వారా సకారాత్మక మార్పులు జరుగుతాయని, మన ఆడపిల్లల సామర్థ్యాలకు, జీవితాశయాల సాధింపుకు, ఆరోగ్యకరమైన జీవితానికి ‘నెలసరి’ అనేది అవరోధకంగా అవకుండా ఉంటుందని ఆశిద్దాం.

– డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -