మనసు బలంగా ఉంటేనే మహిళ జీవితం వెలుగుతుం. యువతులు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన జీవన సత్యం. మనం మహిళల విజయాలు, వారి ప్రతిభ, వారి సాధనల గురించి గర్వంగా మాట్లాడుతుంటాం. కానీ ఈ రోజుల్లో యువతులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన అంశం గురించి కూడా మనం మాట్లాడాలి… అది మానసిక ఆరోగ్యం.
ఇప్పటి కాలంలో విద్య, ఉద్యోగం, కుటుంబ అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి ఎన్నో కారణాలు యువతుల మనసుపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అందుకే ఒక మహిళ నిజంగా బలంగా ఉండాలంటే ఆమెకు ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, మంచి మానసిక ఆరోగ్యం కూడా అవసరం.
మెంటల్ హెల్త్ అంటే ఏమిటి?
మన శరీరానికి అలసట వచ్చినట్లే మనసుకూ అలసట వస్తుంది. టెన్షన్, ఆందోళన, ఓవర్ థింకింగ్ ఇవన్నీ మనుషుల జీవితంలో సహజమైన భావాలు. మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కానీ మనసు బాధపడుతున్నప్పుడు మాత్రం చాలామంది మౌనంగా భరిస్తారు. నిజానికి మనసును కాపాడుకోవడం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. యువతులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడులు. 15 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలో ఉంటారు.
ఈ సమయంలో వారు ఎన్నో ఆలోచనలు, అనిశ్చితులు, ఒత్తిడులను ఎదుర్కొంటారు. కెరీర్ గురించి ఆందోళనలు కుటుంబ అంచనాలు,పెళ్లి గురించి వచ్చే ఒత్తిడి, స్నేహాలు, రిలేషన్‌షిప్ సమస్యలు, సోషల్ మీడియా పోలికలు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి మనల్ని మనమే పోల్చుకోవడం వల్ల self-doubt పెరుగుతుంది. ”నేను సరిపోతున్నానా?” అనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతుంది.
‘NO’ చెప్పే ధైర్యం :
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగు ‘NO’ చెప్పడం నేర్చుకోవడం. చాలాసార్లు మనం అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మనసుని బాధపెడుతుంటాం. కానీ మన భావాలను గౌరవించడం కూడా ఒక శక్తి. ఈ విషయంలో చాలా మంది మహిళలు మనకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఉదాహరణకు Mary Kom – తల్లి అయినప్పటికీ, ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే Deepika Padukone తన డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడి లక్షలాది మందికి ధైర్యం ఇచ్చింది. మనసు గురించి మాట్లాడటం బలహీనత కాదు. అది ధైర్యం.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చిన్న అలవాట్లు
మనసును ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిన్న అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయి.
-రోజుకు కనీసం పది నిమిషాలు మీకోసం కేటాయించండి
-సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకోండి
-మీ భావాలను రాయడం అలవాటు చేసుకోండి (జర్నలింగ్)
-మంచి స్నేహితులతో మాట్లాడండి
-అవసరమైతే కౌన్సెలర్‌ను కలవడానికి వెనుకాడకండి
సహాయం కోరడం బలహీనత కాదు. అది పరిపక్వతకు గుర్తు.
ఒక చిన్న కథ – ఒక పెద్ద పాఠం
ఒక అమ్మాయి పరీక్షల ముందు చాలా టెన్షన్ పడింది. ఆమె అమ్మ అడిగింది, ”ఎందుకింత టెన్షన్? ఆమె చెప్పింది, ”ఫెయిల్ అయితే?”
అమ్మ నవ్వుతూ చెప్పింది. ”పాస్ అయితే పండగ… ఫెయిల్ అయితే పాఠం!”
ఈ చిన్న మాటలోనే జీవితానికి సంబంధించిన గొప్ప సత్యం ఉంది.
జీవితంలో వచ్చే సమస్యలు శత్రువులు కావు. అవి మనకు నేర్పే గురువులు.
ప్రతి యువతి తనలో అపారమైన శక్తిని దాచుకొని ఉంటుంది. మార్కులు, ఫలితాలు, ఇతరుల అభిప్రాయాలు ఇవి మన విలువను నిర్ణయించవు.
నిజమైన విజయాన్ని నిర్ణయించేది మన ఆత్మవిశ్వాసం, మనసు బలం.
మీరు బలహీనులు కాదు. మీరు భావోద్వేగాలతో ఉన్న బలమైన మహిళలు. మీ మనసును కాపాడుకోండి.
మీ కలలను నమ్మండి. ఎందుకంటే… మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



