కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
సీఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు
త్వరలో అధికారికంగా ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడిన గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా ఈ విలీనాన్ని అధికారులు చేపడుతున్నారు. దానికోసం పలు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విలీన ప్రక్రియపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయనుంది. ఒకే రకమైన సేవలు అందిస్తున్న ఈ రెండు సంస్థలు ఒకటి మున్సిపల్ శాఖ పర్యవేక్షణలో ఉండగా, మరొకటి పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తున్నది. పట్టణ పేదల కోసం మెప్మా, గ్రామీణ పేద మహిళల కోసం సెర్ప్ కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్నాయి.
మెప్మా పరిధిలో 1.74 లక్షల స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఉండగా, అందులో 63 నుంచి 65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. సెర్ప్‌్‌లో 4.37 లక్షల స్వయం సహాయ సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. వీటిలో దాదాపు 46.61 లక్షల మంది మహిళా సభ్యులు కొనసాగుతున్నారు. మొత్తంగా కోటి మంది మహిళలు ఈ రెండు సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. అలాగే వికలాంగ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం 4,800 పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. అందులో 50వేల మంది సభ్యులను చేర్చింది. గ్రామానికి ఒకటి చొప్పున వికలాంగుల మహిళల సంఘం ఉండేలా చర్యలు తీసుకుంది. మరిన్ని కొత్త సంఘాలను పెట్టించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఒకే పనితీరు
ఎస్‌హెచ్‌జీలను పొదుపు సంఘాలనీ, స్వయం సహాయ సంఘాలు అని పిలుస్తారు. ఈ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంక్ లింకేజీ ద్వారా అప్పులిస్తారు. ఆ డబ్బుతో ఆయా సంఘాలు సామూహిక వ్యాపారాలు, కుటీర పరిశ్రమలను నిర్వహిస్తాయి. కొన్ని సంఘాలు మాత్రం ఎక్కువ మొత్తంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకుని వ్యాపారపరంగా పురోగతి సాధిస్తున్నాయి. వ్యాపారాలతో వచ్చిన డబ్బులను బ్యాంకులకు అప్పులు చెల్లించడం, లాభాలను పొదుపు చేసుకోవడం ద్వారా మహిళల్లో ఆర్థిక పురోగతి కనిపిస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
పొదుపు సంఘాల్లో ఉన్న సభ్యులతో అధికారులు నేరుగా సమావేశాలు నిర్వహించి, పొదుపుపై అవగాహన కల్పిస్తున్నాయి. సంఘాల్లో ఉన్న మహిళలను గుర్తించి, వారి అభిరుచికి అనుగుణంగా వివిధ రంగాల్లో తగిన శిక్షణ కూడా ఇస్తారు. మెప్మా, సెర్ప్ కృషి ఫలితంగా రాష్ట్రంలోని మహిళల్లో పొదుపు అవగాహన పెరిగింది. ఆయా సంఘాలు వివిధ స్థాయిల్లో గ్రామీణ స్వయం సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లాల సమాఖ్యలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రసమాఖ్యగా ఏర్పడ్డాయి. పట్టణాల్లో కూడా ఇదే విధంగా ఉంటాయి. ఈ సంఘాలన్నీ ఒక సమూహంగా ఉండటంతో రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వీరిని లక్ష్యం చేసుకొని అనేక హామీలు ఇస్తున్నాయి.
విలీనంపై అధ్యయనం చేయాలి
పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సంఘాలపై అధ్యయనం జరగాలి. సెర్ప్, మెప్మా విలీనంతో కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణ, గ్రామీణ మహిళల్లో అవగాహన, ఆలోచనల్లో తేడా ఉంటుంది. పరస్పర విరుద్ధమైన ఆలోచనలను ఒకే చోట చేర్చితే, ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక, సామాజిక అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామాలకు, పట్టణాలకు పేదరికంలో తేడాలుంటాయి. దాన్ని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి.
దొంతి నర్సింహరెడ్డి, ప్రభుత్వ విధాన నిర్ణయ విశ్లేషకులు
విలీనానికి కారణాలివే..
సెర్ప్, మెప్మా ఈ రెండు సంస్థలతో పరిపాలనాపరంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. స్వయం సహాయ బృందాలకు ఆర్థిక, శిక్షణ, పర్యవేక్షణ తదితరాంశాల్లో గ్రామాల్లో ఒక విధానం, పట్టణాల్లో మరో విధానం ఉంది. ఈ రెండింటికీ ఏకరూపత ఇస్తూ, సరికొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది. మరోవైపు ఈ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్‌ను కూడా వేర్వేరుగా పంపిణీ చేస్తున్నది. దీంతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడుతున్నది. వేర్వేరు కార్యాలయాలు, ఉద్యోగులకు వేతన వ్యత్యాసాలు వంటి అనేక అంశాలను ప్రభుత్వం గమనించింది. రెండు సంస్థలు ఉండటంతో నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. రుణాలకు ప్లాన్ ఒకేరకంగా ఉన్నప్పుడు రెండు సంస్థలు ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. రెండు విభాగాలను ఒకే శాఖ పరిధిలోకి తీసుకరావడం వల్ల సేవలు సులభతరమౌతాయనీ, అలాగే డిజిటల్ ప్లాట్‌పామ్‌లోకి తీసుకరావడం మరింత సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.



