‘మే’ ఒకటి 1913న ఆంధ్రదేశం నందలి నెల్లూరు జిల్లా విడవలూరు (మం) అలగానిపాడు గ్రామాన వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతుల కడుపున వెలిగిన ధవతార, అరుణతార పుచ్చలపల్లి సుందరయ్య. భారత కమ్యూనిస్టు పార్టీని అరుణకాంతులతో నడిపించిన ధృవతార కా||పి.యస్. అంటే కాదనేవారెవరు? జన్మతహా ‘రెడ్డి’ సామాజిక వర్గంలో జనియించిన సుందరరామిరెడ్డి, కుల ప్రస్థావన, ప్రస్థానం సమాజ హితం కాదని ఎంచి, కుటుంబ పెద్దలు గాని, బంధు వర్గం గాని, మిత్ర బృందం గాని ఊహించి ఎరుగని రీతిలో స్వచ్ఛంద నిర్ణయంతో తన పేరులోని ఆ కుల ప్రస్థావన తోకను తానే కత్తిరించుకుని కా||పుచ్చలపల్లి సుందరయ్య అందరయ్య అవుతారని ఎవరూ ఊహించలేదు.
సుందరయ్య తండ్రి వెంకట్రామిరెడ్డి మొదటి భార్య చనిపోగా రెండవ వివాహంలో ‘శేషమ్మ’ను పెండ్లి చేసుకున్నాడు. ఈ ఇరువురి దంపతులకే సంతానం కలిగింది. శేషమ్మ, వెంకట్రామిరెడ్డి దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. సుందరయ్య తమ్ముడు రామచంద్రారెడ్డి. ఈయన మంచి ప్రజావైద్యునిగా పేరు పొందారు. సుందరయ్య గారిది పెద్ద భూస్వామ్య కుటుంబం. పనివారు, పాలేర్లతో ఆ ఇల్లు జన సమూహాల సందళ్లు, చప్పుళ్లతో కళకళలాడే ఎస్టేట్ అనవచ్చు.
సుందరయ్య ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో కొనసాగుతుండగానే తన ఆరవ ఏట తండ్రి వెంకట్రామిరెడ్డి చనిపోయారు. తర్వాతి చదువు తన బావ గారి ఇంట కొనసాగింది. తదుపరి పాఠశాల విద్య తిరువళ్లూరు, ఏలూరు, రాజయండ్రిలో కొనసాగింది.
సుందరయ్య అల్లరి పిల్లవాడే. అయినా చదువులో చురుకుగా కొనసాగాడు. గణితం, ఆంగ్లంలో మంచి మార్కులు సాధించేవాడు. అలా ప్రాథమిక, పాఠశాల విద్యలను పూర్తి చేసి, కళాశాల విద్యను మద్రాస్‌లో కొనసాగించాడు. అయితే పి.యస్. ఖద్దరు ధరించడం, రాట్నం వడకడానికి అనుమతి అయితేనే చదువుతానని పట్టుబట్టి చదువును కొనసాగించాడు. ఆయన ఇంటర్ విద్యను మద్రాస్ లయోలా కాలేజిలో పూర్తి చేశాడు. ఇంటర్ లోనే యువకులతో ‘కౌన్సిల్ ఆఫ్ ఫెటర్నిటి’ని స్థాపించాడు. ఆదివారాలు గ్రామాలకు పోయి ఖద్దరు అమ్మడం, వ్యాయామాలు చేయడం, రైతులకు పాఠాలు నేర్పించడం చేసేవాడు.
ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమర్రాజు లక్ష్మణరావు వంటివారిని అభిమానించాడు. అందుకే వారి ప్రభావితుడై మద్రాస్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. తెలుగు శతకములను ఔపోసన పట్టినవాడు. వేమన జయంతి నాడు హరిజనులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. చివరికి 17 ఏండ్ల వయసులో (1930) చదువుకు స్వస్తి చెప్పి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. పశ్చిమ భీమవరం ఉద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి రాజయండ్రి బోస్టన్ స్కూల్లో వేసింది. 1933లో రిలీజ్ అయ్యాడు. కామ్రేడ్ హైదర్‌ఖాన్ ప్రోత్సాహంతో పార్టీ నాయకత్వం ఎంతో నమ్మకంతో సుందరయ్యకు దక్షిణ భారత కమ్యూనిష్టు పార్టీ బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఆంధ్ర, కేరళ, మద్రాస్‌లలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కొరకు కృషి చేశాడు పి.యస్. యస్.పి.ఘటే, ఎ.కె.గోపాలన్, ఇ.యం.ఎస్.నంబూద్రిపాద్, సి.కృష్ణ పిళ్లై వంటి మహామహులను పార్టీలోనికి తీసుకువచ్చాడు.
1936లో కమ్యూనిస్టు పార్టీ గ్రూపులను ఏకం చేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు కృషి చేశాడు. చివరికి ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో పార్టీ ఆలిండియా కిసాన్ సభ ఏర్పాటుతో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. అంతేకాదు కా||పి.యస్. ఇచ్ఛాపురం నుండి మద్రాస్‌కు 1500 మైళ్ల దూరం పాదయాత్ర చేసి, 1500 గ్రామాల రైతులను కలిసి వారితో మమేకమై పార్టీకి ఇబ్బడిముబ్బడిగా కార్యకర్తలను తయారు చేశాడు.
1939 నుండి 1942 వరకు బ్రిటీష్ ప్రభుత్వం పార్టీని నిషేధిస్తూ ఆంక్షలు విధించగా సుందరయ్య అజ్ఞాతవాసం గడపవలసివచ్చింది. 1943లో బ్రిటీష్ ప్రభుత్వం పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. మొదటి అఖిల భారత పార్టీ సమావేశం బొంబాయిలో 1943లోనే జరిగింది. పార్టీ మహాసభకు కా||సుందరయ్య ఎన్నిక కాబడ్డారు. ఇలా పార్టీ ప్రథమ మహాసభ అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం, పత్రికా ప్రచురణ విభాగం బాధ్యతలన్నీ పి.యస్. చూస్తున్నారు. అందుకే ఆయన మకాం బొంబాయిలో అయింది. దీనితో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, ఉద్యమ ప్రస్థానం అవిశ్రాంతంగా కొనసాగింది.
పార్టీ రాజకీయ ప్రచారం కొరకు సొంత పత్రిక తప్పనిసరిగా అవసరం. బొంబాయిలోనే మొదట ‘నవశక్తి’ పేరుతో పత్రిక నడుస్తూనే వుంది. రహస్య కాలంలో ‘స్వతంత్ర భారత్’ పేరిట పత్రిక వుండేది. పి.యస్. పార్టీ బాధ్యతల నిర్వహణలో భాగంగా సంస్కరించుకుంటూ ‘ప్రజాశక్తి’ పేరుతో శేషాచారి వీధిలో పత్రికను నెలకొల్పారు. 1945 చివరి నాటికి ‘ప్రజాశక్తి దినపత్రిక’గా మారింది. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక ‘ప్రజాశక్తి’.
అంతేకాదు పార్టీ నిర్మాణం, సంస్థాగత ఏర్పాట్లు, ఉద్యమ ప్రస్థానాలు పత్రికారంగ బాధ్యతలు, ఎన్నికలలో తలమునకలుగా ఉన్న ‘గెరిల్లా దళాల’ నాయకుడు సుందరయ్య అంటే యంత్రమా? విరామమెరుగక సాగడానికి అన్న అనుమానం కలగక మానదు. ఆ రోజుల్లో అంత సమర్ధంగా పనిచేశాడు కాబట్టే పుచ్చలపల్లి కమ్యూనిస్టు పార్టీ మేరునధీరుడు అయ్యాడు.
ఆయన దక్షత ఇంకెన్ని అంశాలలో కొనసాగిందో చెప్పుకోవాలంటే ఒక్క గ్రంథం చాలదు. రోజులు, నెలలు, సంవత్సరాలు చాలవంటే అతిశయోక్తి కాదు మిత్రులారా! అయినా ఓ చిన్న ఉదాహరణతో చెప్తాను చూడండి..
ఏ పార్టీకైనా నిర్మాణం, మనుగడ, ప్రజాదరణలకు ఆ పార్టీ రహస్య యంత్రాంగం అత్యంతావశ్యకం. దుర్భేధ్యమైన గూఢచర్య విభాగం అవసరం. అందులోనూ అభ్యుదయ భావాలే లక్ష్యం గల వామపక్షపార్టీ, ఉక్కు క్రమశిక్షణ గల కార్యకర్తలు, మొత్తం యంత్రాంగాన్ని ఎంత దక్షత, దీక్షలతో నడపాలో లోతుగా ఆలోచించే వారికే తెలుస్తుంది. అందులోనూ బిట్రీష్ స్వదేశీ పాలక ప్రభుత్వాల నిషేధాలు, దమననీతి, నీతిమాలిన రాజకీయ రచ్చలు, గోబెల్ ప్రచారాల నడుమ పార్టీని నడపడానికి ఎంతటి శక్తియుక్తులు, సమర్థతలు కావాలో, వాటన్నింటినీ క్రియారూపంలో చూపాడు పి.యస్.
రహస్య స్థావరాలు, కొరియర్లు, వారి మధ్య సమన్వయం ఉత్తరాలు పంపుకునేందుకు మారు అడ్రస్‌లు, పక్కాగా ఏర్పాట్లన్నింటినీ నిర్వర్తించేవారు. అయితే ఆయన రహస్య స్థావరానికి బాధ్యుడు కా||యన్.వి. భాస్కరరావు. ఇతని వయసు 1949 ప్రారంభం నాటికి 18 ఏండ్లు. చూశారుగా… ఏ అంశంలోనూ అసంబద్ధత, అర్థ నైపుణ్యం, అనాలోచన, అలసట, అశ్రద్ధలకు తావు లేదు పి.యస్. ఉద్యమ ప్రస్థానంలో.
1943 నాటికి సుందరయ్య మాంచి కోడెవయసు చిన్నోడు. 30 సంవత్సరాల యువశక్తి చిందులు వేసే పెళ్లికాని కుర్రవాడు. మనలాంటి వాళ్లకైతే ఎటువంటి వెర్రిమొర్రి ఆలోచనలో విశ్లేషించుకోలేం. కానీ మన పి.యస్. విజ్ఞత, విలక్షణ, సాహసోపేత త్యాగధన ఆలోచన చూడండి.. ఎలా విశ్లేషిస్తారో, ఏమని శ్లాఘిస్తారో, ఏ భావోద్వేకాలకు లోనవుతారో మీమీ అంతరంగాలకే సమాధానం ఇచ్చుకోండి.
సృష్టిలో జన్మించిన ప్రతి స్త్రీ, పురుషునికీ యుక్తవయసు రాగానే వివాహం తప్పనిసరి. వివాహం కేవలం సుఖభోగాల కోసమో, సంతానోత్పత్తి కోసమోకాదు. జీవితం అనగానే కష్టం, సుఖం, దుఖం, సంతోషం, బాధ, నొప్పి, ప్రేమ, వియోగం, సమస్య, పరిష్కారం లాంటి ఎన్నో అంశాల సమ్మిళితమే కదా! వీటన్నింటి సమన్వయం కోసం, ఆగిపోని ముందడుగుల కోసమే జంట. కాని ఏ ఒక్కరి ఆలోచనా శక్తి సమతూకంలోనికి రాదు. ఒకరికొకరి సమన్వయమే జీవిత పురోగమనం. అందుకు జన్మించిన ప్రతి స్త్రీ, పురుషునికి వివాహం అవసరం.
ఇంతటి నైతిక విలువ గల వివాహ వ్యవస్థపై సుందరయ్య వైఖరి ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో చూడండి.. 1943లో బొంబాయిలో పార్టీలోనే పనిచేస్తున్న లైలా అనే యువతితో సుందరయ్య వివాహం జరిగింది. వారిరువురూ ఉద్యమం కోసం పరితపించేవారే. బాధితుల కోసం మార్గనిర్దేశకులం కావాలనుకునే వారే. మరి సంతానం కలిగితే అటు ఉద్యమాలకు, పార్టీకి, ఇటు కని పెంచాల్సిన సంతానానికి సమన్వయం చేయలేమేమో అని ఇరు మనసులు కలిసిన నిర్ణయంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని వివాహం చేసుకున్నారు. చూడండి! మిత్రులారా… ఏ యువజంట అంతటి త్యాగం, ఆదర్శం ఇవ్వగలరు సమాజానికి. పైగా సుందరయ్య కార్యకర్తలకు ఒక్కటే దిశానిర్దేశం చేశారు. అదేమిటంటే… కార్యకర్తలు పెండ్లిండ్లు చేసుకోండి. కానీ ముగ్గురికంటే ఎక్కువ సంతానం కనకండి అని అప్పట్లో పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు, అదే సంవత్సరంలో (1943లోనే) భారత కమ్యూనిస్టు పార్టీ విధాన నిర్ణయంగా సర్క్యులర్ జారీ చేశారు పి.యస్. ఇదీ భారత కమ్యూనిస్టు పార్టీకి గల దేశభక్తి, జనాభా నియంత్రణ పట్ల గల ఆసక్తి.
1944లో విజయవాడలో అఖిల భారతకిసాన్ మహాసభ పి.యస్. పర్యవేక్షణలో సాగింది. ఈ మహాసభకు ఆ రోజుల్లోనే లక్షమందికి పైగా సామాన్య రైతులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభకు స్వామి సహజానంద, యన్.జి.రంగా, కార్యానందశర్మ వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు.
19944లోనే పార్టీ 2వ ఆలిండియా మహాసభలు కలకత్తాలో జరిగాయి. ఈ మహాసభకూ పి.యస్. ఎన్నికయ్యారు. ఈ మహాసభలోనే సాయుధ దళాల కోసం తీర్మానం అయింది. ఈ తీర్మానాన్నే ‘కలకత్తా థీసిస్’ అంటారు. ఫలితంగా త్రిపుర, కేరళ, తెలంగాణలలో సాయుధ పోరాటాలు ప్రారంభమయినాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకుడు పి.యస్. ఆ పోరాటాంశాలను తరువాత రికార్డు చేశారు. 1972లో స్వయంగా ఆయన మాటలలో రికార్డు చేసినట్లు తెలుస్తుంది. సి.పి.ఐ(యం). తెలంగాణ పీపుల్స్ ఫెడరేషన్ అండ్ లెసన్స్ పేరిట మైకుల ద్వారా ప్రచారం చేశారు. అలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకుడైన పి.యస్. భుజస్కందాలపైనే ఆ పోరాటం సాగింది.
1948 నుండి 1952 వరకు నూతన స్వతంత్ర ప్రభుత్వం సహితం భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో పి.యస్. అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే 1952లో ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసింది. 1952లో ప్రత్యేకంగా పార్టీ సమావేశం జరిగింది. ఈ పార్టీ ప్రత్యేక సమావేశానికీ ఆయన ఎన్నికయ్యారు. 1952లోనే పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. ఇక ఇక్కడి నుండి పార్టీ అంతర్గత వ్యవహారాలపై నిర్మాణాత్మక పాత్ర పోషించారు.
అలా పి.యస్. ప్రస్థానం కమ్యూనిస్టు పార్టీతోనూ, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతిష్ట ఆయన దీక్షాదక్షతలతోనూ అప్రతిహతంగా సాగిపోతున్నాయి. 1952లోనే విజయవాడలో 3వ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశం జరగడం, ఆ సమావేశాలన్నింటికీ ఆయనే ఎన్నిక కావడం జరుగుతూ వచ్చింది.
1962లో చైనా యుద్ధ ఫలితంగా పార్టీలో అగ్ర నాయకత్వంలోనే విభేదాలు పొడచూపాయి. రెండు వర్గాలైనాయి. మొదటిది డాంగే వర్గం, చైనా యుద్ధాన్ని వ్యతిరేకించింది. రెండో వర్గం, రణదివే, పి.సి.జోషిలను రిరీజనిస్టు వర్గం అన్నారు. డాంగే వర్గంలోని సుందరయ్య మొదలగు వారిని లెఫ్టిస్టులు అన్నారు. రణదివే వర్గాన్ని రైటిస్టులు అన్నారు. చివరికి పదవులకు రాజీనామాలు చేయడం, పార్టీ అంతర్గత బలహీనతలు రచ్చకెక్కడంతో భారతకేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ఆ బలహీనతలను సొమ్ము చేసుకుని, ముఖ్య నాయకులను అరెస్టు చేసింది. దీనితో పార్టీ చిన్నాభిన్నం అయింది. చివరికి పార్టీ చీలింది.
1964 అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు ఏడవ పార్టీ సెంట్రల్ కమిటి సమావేశం జరిగి సి.పి.ఐ (యం) పార్టీగా 39 మంది నాయకులు బయటికి వచ్చి పార్టీ కేంద్ర కమిటి నాయకులుగా కా||పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు. ఈ సమావేశం, పరిణామం తెనాలిలో జరిగింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం సి.పి.ఐ.(యం) నేతలను అరెస్టులు చేసింది. 1966 మే నెలలో కా|| సుందరయ్య అరెస్టు చేయబడ్డారు.
కా||సుందరయ్య విడుదల అనంతరం 1975 జూన్ నుండి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించగా 21 నెలల పాటు కా||పి.యస్. అజ్ఞాతవాసం గడిపారు. పార్టీలోని అంతర్గత కారణాలతో ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన 1976లో రాజీనామా చేశారు.
1952లో మద్రాస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కా|| పి.యస్ అయితే భారత పార్లమెంట్ చరిత్రలో నాటి నుండి నేటికీ ఏ పార్లమెంటేరియన్ గడపలేని నిరాడంబర జీవితాన్ని గడిపారాయన. ప్రజాసమస్యలపై గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీసి ఇందిరాగాంధీని సైతం ఇరుకున పెట్టి ప్రభుత్వాన్ని గడగడలాడించిన నేత పుచ్చలపల్లి. నదుల అనుసంధానంపై సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాడు పి.యస్. తెలుగు, తమిళ, మళయాలం, ఇంగ్లీషు, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన, సాహిత్యం రాయగలిగిన దిట్ట.
1955- 67 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం నియోజక వర్గం నుండి మొదటి యం.ఎల్.ఎ గా కొనసాగారు కా||పుచ్చపల్లి 1978- 83లోనూ ఎన్నికల్లో గెలిచి ఎం.ఎల్.ఎ. గా కొనసాగారు. అసెంబ్లీ వ్యవహారాల్లో సలహాల కొరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సుందరయ్య గారిని అడిగి అనుసరించేవారు. నాటి అసెంబ్లీ కార్యదర్శి ఎ.బి.చౌదరి స్వయంగా శాసనసభ మొత్తంలో ఏ అంశంలోనైనా లోతుగా అధ్యయనం చేసేది కా||సుందరయ్య గారేనని అనేవారు.
1946లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కోరిన అంశం ప్రాతిపదికన కా||సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’, భవానీసేన్ బెంగాల్‌లో ‘నూతన బెంగాల్’, కేరళలో ఇ.యం.యస్ నంబూద్రిపాద్ పుస్తకాలను రాశారు. 1946 శాసనసభ ఎన్నికల తరువాత పోరాటాలు జరిగాయి. అలా భారత కమ్యూనిస్టు పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలు చేసి చరిత్రను సృష్టించింది.
సుందరయ్య గారి వ్యక్తిగత అంశాలు
సుందరయ్య బాల్యంలోనే పాలేర్లు, పనివాళ్లను కుటుంబ పెద్దలు హీనంగా చూడడం, అరే ఒరే అంటూ అగౌరవంగా మాట్లాడడం సహించేవాడు కాదు. వారితో కలిసి కూర్చుని భోజనం చేసేవాడు.
చిన్నతనం నుండి సైకిల్ తొక్కడమంటే మహాసరదా. మద్రాస్‌లో చదువుకునే రోజుల్ల కొత్త సైకిల్ కొని సెలవు రోజుల్లో మద్రాస్ నుండి అలగానిపాడు, అలగానిపాడు నుండి మద్రాస్‌కు మధ్య గల 100 మైళ్ల దూరాన్ని సైకిల్ పైనే ముమ్మారు ప్రయాణించాడు. మంచి శరీర దారుఢ్యం, ఆరోగ్యం, ధైర్యసాహసాలు గలవాడు సుందరయ్య. 1932 – 34 నాటి రోజుల్లో రోజుకు 50- 60 మైళ్లు సైకిల్ పైనే ప్రయాణించేవాడు.
చైనా పార్టీ మహాసభ (8వ పార్టీ మహాసభ) 1954 సెప్టెంబర్‌లో ‘బీజింగ్’లో జరిగింది. ఆ మహాసభకు భారత కమ్యూనిస్టు పార్టీ ముగ్గురు ప్రతినిధుల బృందాన్ని చైనాకు పంపింది. ఆ బృందంలోని సభ్యులు 1. కా|| ఇ.యం.యస్. నంబూద్రిపాద్, 2. పి.సి.జోషి, 3. కా||పి.సుందరయ్య. ఆ బృందానికి గైడ్ కా||వియావో (చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి). బృందంతో పాటు చైనాకు వ్యక్తిగత హోదాలో శ్రీమతి లీలా కూడా చైనాను సందర్శించారు.
కార్యకర్తల పట్ల ప్రేమ, ఆదరణ, మానవతా దృక్పథం కా||.పి.సుందరయ్యకు గల కొలమానాన్ని లెక్కగట్ట తరమా! ఈ అంశానికి ప్రత్యక్ష సాక్షి చూడండి.
భగత్‌సింగ్ ముఖ్య అనుచరుడు కా||శివవర్మ, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లను ఉరి తీయడానికి ముందు జైలులో వుంచినప్పుడు వారితో పాటు బేరక్‌లోని వారు డా||శివవర్మ. జైలు జీవితానికి ముందు కూడా భగత్‌సింగ్‌ను దగ్గరినుండి అనుసరించినవారు. కావున కా||శివవర్మ భగత్‌సింగ్ రచనలను సేకరించడం, అనువదించడం చేస్తున్నారు. కాగా 1981 డిసెంబర్‌లో శివవర్మ కంటిచూపును కోల్పోయారు. తన లక్ష్యం నెరవేరదనే నిరాశ, నిస్ఫృహలతో కొట్టుమిట్టాడుతూ అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న కా||సుందరయ్య ప్రత్యేకంగా కాన్పూర్ వెళ్లి కా||శివవర్మను పరామర్శించి సంభాషించాడు. శివవర్మ తన ప్రణాళిక, తన అంధత్వ ప్రాప్తితో విఫలమౌతుందని ఆవేదనా భరితంగా వివరించారు. సుందరయ్యగారు శివవర్మకు ధైర్యం చెప్పి మీ ప్రయత్నం మానుకోవద్దు. భగత్‌సింగ్ రచనలను సేకరించడం, కూర్చి ప్రచురించ గల అర్హత గల వాడవు నీవొక్కడివే. అందుకు ముమ్మాటికీ సమర్థులు మీరేనంటూ అనునయంతో సముదాయించి, ఉత్తేజపరచి శివవర్మకు ఓ స్టెనోను నియమించి, ఇతర ఏర్పాట్లన్నీ చేసి, స్టెనోతో పాటు భగత్‌సింగ్ తమ్ముడు మరికొంత మంది సహచరులను విదేశాలకు పంపి రచనలను సేకరించి ‘సెలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ షాహిద్ భగత్‌సింగ్’ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రచురింపచేశారు.
అలా పార్టీ కర్తవ్యాన్ని, కార్యకర్తల ఆదరణను సమదృష్టితో ఆశించి హిమ శిఖరాగ్రాన్ని మించిన మానవతార్థ్రతను చాటిన మహోన్నతుడు పుచ్చలపల్లి సుందరయ్య.
ముగింపు : జనం ఓట్లు వేస్తే గెలిచే వారిని కేంద్ర, రాష్ట్ర చట్టసభల సభ్యులు అంటారు. జనం కోసం పోరాడే నాయకులను ప్రజానాయకులు అంటారు.
మరి మన కా||పి.యస్.ను మాత్రం కమ్యూనిస్టు గాంధీ అంటారు. ఊహ తెలిసింది మొదలు ఊపిరి ఉన్నంత వరకూ జనసమూహాల ప్రగతి స్వప్నాల కొరకే కా||పి.యస్. ఎదిగారు.
దేశాన్ని కుటుంబంగా అశేష జనవాహినికి ఆత్మ బంధువుగా శ్రామిక జన సమూహాలకు ప్రాణంగా ముందుముందుకు సాగారు సుందరయ్య.
దేశమే తన ఇల్లై, కష్టజీవుల ఉద్ధరణే స్వప్నమై సమసమాజ స్థాపనే లక్ష్యమై ‘జనం కోసమే ధ్యాస, జనం కోసమే రణం’. ఆయన ఎటు కదిలినా, ఎటు ఒదిగినా జనం కోసమే బతికాడు.
అందుకే ‘సుందరయ్య – అందరయ్య’. అయినా 1985 మే 19వ తేదీన నింగికేగింది అరుణ తార.
మన ఈ సుందరయ్య నింగి, నేల ఉన్నంత కాలం తారలు ప్రకాశించినంత కాలం ఎరుపెక్కిన కమ్యూనిస్టుల గుండెల్లో గూడు కట్టుకుని ఎర్రమల్లెలు, మందారాల నడుమ నీరాజనాలందుకుంటూనే వుంటాడు.
- బోడపాటి అప్పారావు, 9381509814