Tuesday, November 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెటాకు మెండుగా స్కామ్‌ల ఆదాయం..

మెటాకు మెండుగా స్కామ్‌ల ఆదాయం..

- Advertisement -

మోసపు ప్రకటనలతో
రూ.1.40 లక్షల కోట్ల సంపద
నిషేధిత ఉత్పత్తులకు ప్రచారమూ
రోజుకు 15 బిలియన్ల స్కామ్‌ యాడ్స్‌
అంతర్గత పత్రాలు లీక్‌
వాషింగ్టన్‌ :
సోషల్‌ మీడియా, టెక్‌ దిగ్గజం మెటా ఆదాయంలో దండిగా మోసపూరిత ఆదాయం ఉంటుంది. మోసపూరిత, నిషేధిత ఉత్పత్తుల ప్రకటనల ద్వారా 2024 వార్షిక ఆదాయంలో 10 శాతానికి సమానమయ్యే 16 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.40 లక్షల కోట్లు) ఆదాయం వస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. దీనికి సంబంధించిన అంతర్గత పత్రాలు లీకు అయ్యాయని రాయిటర్స్‌ ఓ కథనంలో ధృవీకరించింది. మెటా నిర్వహిస్తోన్న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ప్రతిరోజూ వినియోగదారులకు 15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.33 లక్షల కోట్ల) విలువ చేసే అధిక రిస్క్‌ స్కామ్‌ ప్రకటనలను చూపుతున్నాయని మెటా 2024 డిసెంబర్‌ డాక్యూమెంట్స్‌ చూపుతున్నాయి. కేవలం అధిక రిస్కు ప్రకటనలతో ఆ సంస్థకు ఏడాదికి 7 బిలియన్ల (రూ.62వేల కోట్లు) ఆదాయం వస్తోందని అంచనా.
మెటా వేదికల్లో వచ్చే ప్రకటనల్లో మోసం 95 శాతం ఖచ్చితత్వం ఉందని నిర్దారణ అయితేనే ప్రకటనదారులను బ్లాక్‌ చేస్తుంది. అంతకంటే తక్కువ ఖచ్చితత్వం ఉన్న సందర్భాలలో కంపెనీ వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తుంది. ఇది ఆ సంస్థ లాభాలను మరింత పెంచుతుంది. మోసగాళ్లను నిరుత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో జరిమానాలు వేస్తున్నట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. వినియోగదారుడు ఒక స్కామ్‌ యాడ్‌పై క్లిక్‌ చేసిన యూజర్‌కు మరిన్ని మోసం ప్రకటనలు చూపిస్తుందని మెటా అడ్‌ పర్సనలైజేషన్‌ సిస్టమ్‌ ఆధారంగా తేలింది. 2024లో 10.1 శాతంగా ఉన్న స్కామ్‌ యాడ్స్‌ ఆదాయాన్ని 2025 చివరి నాటికి 7.3 శాతానికి, 2026 నాటికి 6 శాతానికి, 2027 నాటికి 5.8 శాతానికి తగ్గించుకోవాలని మెటా తన లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొన్ని దేశాల మార్కెట్లలో 50 శాతం వరకు ఉన్న స్కామ్‌ ప్రకటనలను తగ్గించాలని ప్లాన్‌ చేసుకుందంటే ఆ ప్రాంతాల్లో ప్రజలను ఎంత మోసానికి గురి చేస్తోందో స్పష్టం అవుతోంది.
ప్రతీ రోజు 220 కోట్ల మంది టార్గెట్‌
మెటాలోని మోసం ప్రకటనలపై అమెరికా ఎస్‌ఇసి దర్యాప్తు చేస్తోంది. బ్రిటన్‌లో 2023లో చెల్లింపు స్కామ్‌ నష్టాల్లో 54 శాతం మెటా వేదికలతోనే సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు ప్రకటనలు, సెలబ్రిటీ ఆకర్షణల ద్వారా ప్రతీ రోజు 220 కోట్ల మంది యూజర్లను మెటా వేదికలు టార్గెట్‌ చేస్తోన్నాయని అంచనా. సింగపూర్‌ పోలీసులు ఇచ్చిన 146 స్కామ్‌ ఫిర్యాదుల్లో కేవలం 23 మాత్రమే మెటా పాలసీ ఉల్లంఘనల కింద వస్తాయని పేర్కొంది. మిగితా 77 స్కామ్‌లు ఉల్లంఘన కింద రావని చెప్పడం ద్వారా ఆ స్కామర్లను కాపాడినట్లయ్యింది. 2023లో వారానికి లక్ష స్పామ్‌ మెసెజ్‌ రిపోర్టులు రాగా.. అందులో 96 శాతం ఫిర్యాదులను తిరస్కరించింది. గత అక్టోబర్‌లో రాయల్‌ కెనడియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ రిక్రూటర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది. అందులో స్కామర్లు ఫేక్‌ క్రిప్టో స్కామ్‌ పోస్టులు పెట్టారు. దీనిపై 100 పైగా రిపోర్టులు వచ్చినప్పటికీ మెటా స్పందన లేదు. ఫలితంగా వినియోగదారులు 40,000 పైగా కెనడియన్‌ డాలర్లు (రూ.25 లక్షలు) నష్టపోయినప్పటికీ మెటా ఈ కేసుపై కామెంట్‌ చేయడానికి నిరాకరించింది. వివిధ రూపాల్లో యూజర్లు భారీ ఎత్తున నష్టపోతునప్పటికీ మెటా నిర్లక్ష్యంగా వ్యవహారించడం గమనార్హం.
పక్షపాతంతో కూడుకున్నవి : మెటా
ఈ పత్రాలు పక్షపాతంతో కూడినవని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ పేర్కొన్నారు. గత 18 నెలల్లో స్కామ్‌ ప్రకటనలపై వినియోగదారుల ఫిర్యాదులను 58 శాతానికి తగ్గించామన్నారు. 13.4 కోట్ల పైగా మోసపూరిత ప్రకటనలను తీసివేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -