Wednesday, May 21, 2025
Homeప్రధాన వార్తలుమెట్రో రైల్‌ సంస్థ కీలక నిర్ణయం

మెట్రో రైల్‌ సంస్థ కీలక నిర్ణయం

- Advertisement -

పెంచిన మెట్రో చార్జీలపై పది శాతం డిస్కౌంట్‌
– ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటన
– 24 నుంచి అమల్లోకి..
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఇటీవల పెంచిన మెట్రో రైలు చార్జీలపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వర్గాల ప్రజలు, సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీల ఆందోళన లతో పాటు ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో పెంచిన చార్జీలపై 10శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని జోన్లలో కొత్తగా సవరించిన చార్జీలపై ఈ డిస్కౌంట్‌ వర్తించనుంది. ఈ డిస్కౌంట్‌ చార్జీలు ఈనెల 24 నుంచి అమల్లోకి రానున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) సిఫారసుల మేరకే చార్జీలను పెంచినట్టు తెలిపింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ సీఎండీ కేవీబీ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. దీర్ఘకాలంలో మెట్రో కార్యకలాపాలను సుస్థిరంగా నిర్వహించుకోగలిగేందుకు ఉద్దేశించిన సమగ్ర వ్యూహంలో భాగంగా చార్జీలు సవరించినట్టు తెలిపారు. ఆర్థికంగా దూరదృష్టితో వ్యవహరిస్తూ, ప్రయాణికులకు అందుబాటు స్థాయిలో సేవలు అందించాలన్న సంస్థ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మెట్రో కార్యకలాపాలను నిలకడగా కొనసాగించేందుకు చార్జీలను సవరించక తప్పలేదని, అయినప్పటికీ ప్రయాణికులపై ఆర్థిక భారం పడనివ్వకుండా చూడడానికే అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌, వారి వెసులుబాటు మేరకు కొత్తగా సవరించిన చార్జీలపై పది శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని, అందుబాటు చార్జీల్లో రోజువారీ ప్రయాణాలకు వీలు కల్పించాలన్న తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని కేవీబీ రెడ్డి వివరించారు. ఈనెల 24 నుంచి మూడు మెట్రో కారిడార్లలోని అన్ని జోన్‌లో పెంచిన చార్జీలపై ఈ డిస్కౌంట్‌ అమల్లోకి వస్తుందన్నారు. సవరించిన చార్జీలు, ఇతర అప్‌డేట్‌ల సమగ్ర సమాచారం కోసం ప్రయాణికులు తమ అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎల్‌టీమెట్రో.కామ్‌ను సందర్శించగలరని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ కనీస చార్జి రూ.10 నుంచి 12కు, గరిష్ట చార్జి రూ.60 నుంచి 75కు పెంచిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -