రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో..
త్వరలో కేంద్రానికి ..
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
మేడ్చల్, శామీర్‌పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్ రెడీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్, శామీర్‌పేట్, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ డీపీఆర్‌లు పూర్తిస్థాయిలో సిద్ధం చేశామని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించినట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మెట్రో రెండో దశ(బి)కు సంబంధించిన డీపీఆర్‌లు పూర్తి స్థాయిలో తయారయ్యాయని, వీటిని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఈనెల 8న ఆమోదించిందని స్పష్టం చేశారు. ఆ డీపీఆర్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించే వరకు వీటికి సంబంధించి గోప్యత పాటించాల్సి ఉంటుందని, అందువల్ల పూర్తి వివరాలు అందించలేకపోతున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు జేబీఎస్ మెట్రో జంక్షన్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు డీపీఆర్‌లో పలు అంశాలను పొందుపరిచామని చెప్పారు. రూ.19,579 కోట్ల అంచనాతో 86.1 కి.మీ పొడవు గల జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట్, ఎయిర్ పోర్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రో ఫేజ్-2(బి) కారిడార్ల ప్రతిపాదనలతో డీపీఆర్‌లను పూర్తి చేశామని పేర్కొన్నారు. జేబీఎస్ స్టేషన్-మేడ్చల్ మార్గం 24.5 కిలోమీటర్లు, 18 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుందని తెలిపారు. జేబీఎస్ స్టేషన్- శామీర్‌పేట్ మార్గం 22 కిలోమీటర్ల కారిడార్ 14 స్టేషన్లతో నిర్మాణం అవుతుందని, ఈ మార్గం 20.35 కిలోమీటర్ల ఎలివేటెడ్‌గాను, 1.65 కిలోమీటర్లు భూగర్భ మార్గంగా ఉంటుందని అన్నారు. హకీంపేట విమానాశ్రయం సమీపంలో ఈ భూగర్భ మార్గం ఉంటుందని మెట్రో ఎండీ తెలిపారు. ఆర్జీఐఏ-ఫ్యూచర్‌సిటీ(స్కిల్ యూని వర్సిటీ) 39.6 కిలోమీటర్లుండగా దీనిలో ఎయిర్‌పోర్ట్ నుంచి 1.5 కిలోమీటర్ల భూగర్భ మార్గంగాను 21కిలోమీటర్ల ఎలివేటెడ్‌గాను, 17 కిలోమీటర్లు ఎట్ గ్రేడ్ గాను ఉంటుందని చెప్పారు. ఇది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద గోల్కొండ, రావిర్యాల్ మీదుగా స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైల్ నిర్మాణ అంచనాలు, హైదరాబాద్‌లో ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండో దశ(బి) డీపీఆర్‌లను సమగ్రంగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డీపీఆర్‌లను ఆమోదించి, కేంద్రానికి సమర్పించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ పరిశీలనలో మెట్రో సెకండ్ ఫేజ్ డీపీఆర్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES