మెట్రో రైల్ ప్లానింగ్‌లో సామాన్యుడు ఎక్కడ..? : హెచ్‌సీఎఫ్ చర్చా గోష్టిలో ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్
మెట్రో రైల్ ప్రాజెక్టు.. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అనీ, మెట్రో రైల్ ప్లానింగ్‌లో సామాన్యుని ఊసే లేదనీ రిటైర్డ్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ”మెట్రో రైల్ నష్టాలకు కారణమెవరు..? భవిష్యత్ సవాళ్లు ఏమిటి..?” అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో హెచ్‌సీఎఫ్ అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల ప్రయోజనాల కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యంగా కొనసాగిన మెట్రో రైల్ ప్రాజెక్టు ఒప్పందం విఫలమైందనీ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందన్నారు. ప్రాజెక్టు ప్రారంభంలో అనేక వాగ్దానాలు చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థ వాటిని నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని వేసిన అంచనా ఎల్‌అండ్‌టీ సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. కామన్ టికెట్ తెస్తామని చెబుతూనే ఉన్నా, అమలుపై చిత్తశుద్ధిని ఏ ప్రభుత్వమూ పాటించలేదన్నారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు పేరుతో బస్ రవాణా, ఎంఎంటీఎస్, ఫుట్‌పాత్‌ల వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించినా, ఒక్క ఫుట్ పాత్ కూడా నిర్మించలేదన్నారు. తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నష్టాల పేరుతో మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోవడం ఒప్పంద ఉల్లంఘనే అవుతుందన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా విఫలమైందనీ, నష్టాలకు పూర్తి బాధ్యత ఎల్‌అండ్‌టీ సంస్థనే వహించాలన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో రైల్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్య ప్రయాణికులపై భారం మోపి ప్రయాణికుల సౌకర్యాలపై ఏ మాత్రం శ్రద్ధ వహించలేదన్నారు. రైల్ కోచ్‌ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ను కనీసం పట్టించుకోలేదన్నారు. మెట్రో రైల్ రెండో దశకు అనుమతి ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుందనీ, కొర్రీలు వేయడం మానుకుని మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక వేత రాజీవ్‌కుమార్, పర్యావరణవేత్త డాక్టర్ జయసూర్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, కోశాధికారి రాజమౌళి, నాయకులు పి.శ్రీనివాసరావు, మోహన్, సంగీత, కె.లలిత, హస్మిత, జె.నర్సింగరావు, కె.రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.