ఆంగ్లంలో Micro Prose, Microfiction అని పిలువబడే వచన రచనకు 20వ శతాబ్దపు ఆరంభంలో బీజం పడి, దానికి సంబంధించిన భావన అదే దశాబ్దపు చివరి భాగంలో బలపడింది. దీని నిడివిని 300 లేక 400 కన్న తక్కువ పదాలుగా నిర్ణయించారు. కొందరు 100 లేక అంతకంటె తక్కువ పదాలు ఉండే భిన్నమైన రూపంతో రాస్తున్నారు. కానీ ప్రాచీన సాహిత్యంలోనే దీనికి పూర్వగామి (precursor) అనతగిన రూపాలు లేదా మూలాలు ఉన్నాయి. సూక్తులను, ఈసప్ కథలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
1920 ప్రారంభంలో అర్నెస్ట్ హెమింగ్వే రాసిన ఆరు పదాల కథ ‘For sale: baby shoes, never worn” (అమ్మకానికి ఉన్నాయి: అసలే తొడగని శిశువుల బూట్లు) ప్రసిద్ధి చెందింది. అతి సూక్ష్మతను సంతరించుకున్న ఈ కథను భవిష్యత్తులో అవతరించబోయే సూక్ష్మవచనానికి పునాదిగా ఎంచారు. తర్వాత 1959లో Augusto Monterroso రాసిన When he awoke, the dinosaur was still there (అతడు లేచేసరికి డైనోసార్ ఇంకా అక్కడే ఉంది) అనే అతి చిన్న కథ ప్రకంపనలు రేపింది. ఫ్రాంజ్ కాఫ్కా రాసిన కొన్ని చిన్న కథల శకలాలను కూడా సూక్ష్మ వచనానికి ఉదాహరణలుగా చూపిస్తారు. కాబట్టి ఈ ప్రక్రియను ”కనుగొన్నవారు” అంటూ ఇదమిత్థంగా ఎవరూ లేనప్పటికీ హెమింగ్వేను ఆద్యుడుగా పేర్కొంటారు. తర్వాత 1980, 1990లలో Flash Diction, Sudden Fiction అనే రూపాలు వెలువడ్డాయి. వీటి నిడివి 300 నుండి 1000 పదాల వరకు ఉండాలని నిశ్చయించారు.
1980లో Drabble అనే మరొక చిన్న కథా రూపం వచ్చింది. ఇందులో సరిగ్గా 100 పదాలు ఉండాలి. యాబై పదాల భిన్నరూపం కూడా ఉంది. మాంటీ పైథాన్ రాసిన Flying Circus అనే సైన్స్ ఫిక్షన్ ధారావాహిక అభిమాన సంఘాలు ఈ ప్రక్రియను ప్రాచుర్యం లోకి తెచ్చాయి. బర్మింగ్ హాం సైన్స్ ఫిక్షన్ సొసైటీ వారు 1980లో ఈ ప్రక్రియలో పోటీని నిర్వహించారు. బహుశా ఇదే మొదటి డ్రాబుల్స్ పోటీ అయివుండాలి. వినెట్ (Vignette) అనే మరో సూక్ష్మ వచన రూపం కూడా ఉంది. దీనికి ఇదమిత్థమైన నిడివి సూచించబడలేదు.
ఈ సూక్ష్మవచన రూపాలన్నిటిలో స్పష్టమైన ప్రారంభం, సంఘటన(లు), ముగింపు లాంటి కథా లక్షణాలు, ఇమేజరీ, ధ్వని (suggestion) అవసరమని చెప్పారు. విశేషణాలు మొదలైన అదనపు పదాలు లేకపోవడం, సంక్షిప్తీకరణ ఇందులోని ప్రత్యేకతలు. కాబట్టి దీర్ఘమైన వర్ణనలను మానుకోవలసి ఉంటుంది. అప్పుడు ప్రతి పదం ముఖ్యమైనదవుతుంది. ఈ కారణం చేత, పదాలను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్త అవసరమౌతుంది. అనూహ్యమైన మలుపులు అనివార్యం కాకపోయినా అవి సూక్ష్మ వచనానికి వన్నె తెస్తాయి. భావోద్వేగం, వ్యంగ్యం కూడా ఈ ప్రక్రియలో చోటు చేసుకోవచ్చు. కథలు మాత్రమే కాకుండా ఈ ప్రక్రియలో స్మతులు, వ్యక్తిగత అనుభవాలు చక్కగా ఒదుగుతాయి. సూక్ష్మ వచనం కవిత్వానికీ వచనానికీ మధ్యస్థంగా ఉండవలసి రావచ్చు. అంటే మరొక రకంగా ప్రోజ్ పోయెం రూపమన్న మాట. కానీ ఇది అనివార్యం కాదు. కార్డు కథలు అని మనం పిలుచుకుంచటున్న కథలు కూడా ఈ రకంలోకే వస్తాయి.
ఇరవయ్యొకటవ శతాబ్దంలో ఆన్లైన్ పత్రికలు, సామాజిక మాధ్యమాలు పుట్టి, పెరుగుతుండటంతో ఈ సూక్ష్మ వచన రూపాలకు వ్యాప్తి చేకూరింది. అంతర్జాతీయ స్థాయిలో ఆరు పదాల కవితల పోటీలు కొన్ని సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి.
ఈ drabbleను చదవండి. దీని రచయిత నేనే. చూపుడువేలి దుఃఖయాతన. ఫిట్స్ సమస్యతో బాధ పడుతున్న ఒక చూపుడువేలును ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఎన్ని వైద్యపరీక్షలు చేసినా వ్యాధి ఏమిటో కచ్చితంగా తెలియలేదు. కంగు తిన్న డాక్టర్లు రోగి మెడికల్ చరిత్రను లోతుగా తవ్వాలని నిశ్చయించుకుని ఆ దిశలో ప్రయత్నం చేశారు. ఈలోపు చూపుడువేలు మద్యపానాన్ని ఎకాయోకిన మానేసిన దీర్ఘకాలపు తాగుబోతు లాగా తీవ్రమైన అశాంతికి, అసహనానికి గురైంది. సంధిప్రేలాపన లోకి పోయింది.
డాక్టర్లు ప్రశ్నలను తీవ్రతరం చేశారు. దాంతో వారికి ఒక ఆధారం దొరికింది. ఉత్సాహంతో ”విత్ డ్రాయల్ సిండ్రోమ్” అని అరిచారు వాళ్లు విజయగర్వంతో. ‘కానీ దేన్నుండి విత్ డ్రాయల్?’ తెలియ లేదు. ఆఖరుకు సమాధానం దొరికింది. ”నువ్వు నీ ఫోన్లో స్క్రోల్ చేయడం మానేసినట్టున్నావు. ముందులాగానే ఫేస్ బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులను స్క్రోల్ చెరు” అని సలహా ఇచ్చారు డాక్టర్లు.
చూపుడువేలు ఆ సలహాను పాటించింది. భళా, చూపుడువేలుకు పూర్తిగా నయమైంది. దాన్ని అస్పత్రి నుండి డిస్చార్జ్ చేశారు.
విత్ డ్రాయల్ (withdrawal)ను ఒకే పదంగా పరిగణించాలి.
– ఎలనాగ
సూక్ష్మ వచనం
- Advertisement -
- Advertisement -



