నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) వంట ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఇన్‌చార్జీ కార్యదర్శి శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాలవాటికా, ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వంట ధర రూ.6.19 నుంచి రూ.6.78 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి వంట ధర రూ.9.29 నుంచి రూ.10.17 వరకు పెంచామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి చొప్పున నిధులను భర్తిస్తాయని వివరించారు. అంటే ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే వంట ధర రూ.6.78లో కేంద్రం రూ.4.07, రాష్ట్ర ప్రభుత్వం రూ.2.71 భరిస్తాయని తెలిపారు.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే వంట ధర రూ.10.17లో కేంద్రం రూ.6.1, రాష్ట్ర ప్రభుత్వం రూ.4.07 నిధులను కేటాయిస్తాయని వివరించారు. ఈ పెరుగుదల మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మొత్తం నిధులను భరించి మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నది. అయితే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు వంట ధరను రూ.11.79 నుంచి రూ.13.17 (గుడ్డు ధర కలిపి)కు పెంచామని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.44.91 కోట్లు విడుదల
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) నిధులు రూ.44.91 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్న భోజనం నిధులు, వంట ఖర్చు రూ.44.91 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వంట కార్మికుల గౌరవ వేతనం నెలకు రూ.వెయ్యి చొప్పున ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు విడుదల చేశామని వివరించారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతతి వరకు వంట ఖర్చు నిధులు రూ.34.91 కోట్లు, వంట కార్మికుల గౌరవ వేతనం రూ.వెయ్యి కోట్లు కలిపి మొత్తం రూ.44.91 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం వంట ధరల పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



