పిల్లల సంఖ్య తగ్గినా వ్యయం పెరుగుదల
పీఎం-పోషణ పథకంలో ఖర్చులు 57 శాతం ఎగబాకిన తీరు
ఇదీ గుజరాత్‌లోని ప్రభుత్వ పథకం దుస్థితి
అహ్మదాబాద్ : గుజరాత్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాల సంఖ్య గత మూడు సంవత్సరాల్లో తగ్గింది. అయితే అదే సమయంలో ఈ పథకంపై ప్రభుత్వ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే… గత మూడు సంవత్సరాల్లో గుజరాత్‌లో రోజూ అందించే మధ్యాహ్న భోజనాల సంఖ్య 1.76 లక్షలు తగ్గింది. 2022-23లో 42,21,257 భోజనాలు అందించగా.. 2023-24లో అది 41,80,492కి పడిపోయింది. 2024-25లో మరింత తగ్గి అది 40,44,689కి చేరింది. అయితే ఇదే సమయంలో ఈ పథకంపై ఖర్చు భారీగా పెరిగింది. 2022-23లో రూ.1035.82 కోట్లు ఖర్చు చేయగా.. 2023-24లో రూ.1155.98 కోట్లు, 2024-25లో రూ.1626.08 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం మూడేండ్లలో రూ.590.26 కోట్ల పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
ఈ పథకం కింద రాష్ట్రంలోని 32,266 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఈ వివరాలను గుజరాత్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి ప్రజ్ఞుమన్ వాజా వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలియజేశారు. అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణంగా ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల. వంట సామాగ్రి, వంట గదుల నిర్మాణం, నిల్వ సదుపాయాలపై ఖర్చులు పెరిగాయి. పీఎం-పోషణ పథక జాయింట్ కమిషనర్ నేహా గుప్తా ప్రకారం.. మధ్యాహ్న భోజనాల లబ్దిదారుల సంఖ్య తగ్గడానికి ఒక కారణం.. నగర, అర్బన్ ప్రాంతాల్లో పిల్లలు ఇంటి నుంచి టిఫిన్ తీసుకురావడం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఇప్పటికీ ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం (ప్రస్తుతం పీఎం-పోషణగా పిలుస్తున్నారు) ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత భోజన పథకం. ఇది విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపౌట్ తగ్గింపు, పేదరిక భారాన్ని తగ్గించడం, సామాజిక అసమానతలను తగ్గించడం లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఖర్చులో ఆహారం మాత్రమే కాకుండా పాత్రలు, కిచెన్, షెడ్లు, నిల్వ గదులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్తగా వంట సామాగ్రి, నిల్వ పాత్రలకు కూడా నిధులు కేటాయించారు. ఇంకా ప్రభుత్వ తరఫున భోజనం అందించే ఎన్జీఓలకు చేసే చెల్లింపులు కూడా పెరిగాయి 2022-23లో రూ.77.63 కోట్లు చెల్లించగా.. 2023-24లో రూ.92.32 కోట్లు, 2024-25లో రూ.144.88 కోట్లకు ఈ చెల్లింపులు ఎగబాకాయి. మొత్తం 3012 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సేవలను ఎన్జీఓలు లేదా ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. ఈ పాఠశాలల్లో 6,50,155 మంది విద్యార్థులు ఉన్నారు.



