Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యలపై కదం తొక్కిన వలస ఆదివాసీలు

సమస్యలపై కదం తొక్కిన వలస ఆదివాసీలు

- Advertisement -

తహసీల్దార్‌ కార్యాలయం ముందు సంస్కృతి సంప్రదాయాలతో నిరసన
మౌలిక సదుపాయాలు కల్పించే వరకు సమరశీల పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య


నవతెలంగాణ-మణుగూరు
పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి.. ఫారెస్ట్‌ అధికారుల వేధింపులు ఆపాలి.. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.. వలస ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం వలస ఆదివాసీ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంకలో చంటి బిడ్డలను ఎత్తుకుని తల్లులు ర్యాలీలో పాల్గొన్నారు. డోలు కొమ్ములు, గజ్జల ఆట, పాటలతో గిరిజన సంప్రదాయాలు ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు తమ సంస్కృతి సంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీ గిరిజనుల ఓట్లు తప్ప మౌలిక సదుపాయాల కల్పన పట్టడం లేదని విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి రేషన్‌, ఆధార్‌ కార్డులు, ఓటు హక్కును సాధించుకున్నామని చెప్పారు. దుర్భర జీవితం గడుపుతున్న వలస ఆదివాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మణుగూరు మండలంలో రేగుల గండి, ఎన్నిక సర్వయ్య గుంపు, బుడుగుల ఇప్పల గుంపు, ఎస్టీ కాలనీ, పెద్దపెల్లి గ్రామాలలో పోడు సాగు చేసుకుంటున్న వలస ఆదివాసీలపై ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.

వరి పంటపై గడ్డి మందు స్ప్రే చేశారని, బుడుగుల గ్రామంలో ఫారెస్ట్‌ అధికారులు పత్తి పంటను పీకేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస ఆదివాసీలు భారతీయ పౌరులు కాదా? అని ప్రశ్నించారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా చదువుకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అంగన్వాడీ పాఠశాలలు కూడా లేవన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్‌ మాట్లాడుతూ.. తాము నిజమైన ఆదివాసులమని, కానీ ప్రభుత్వాలు తమకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు పిట్టల నాగమణి, బొల్లం రాజు, సీఐటీయూ మండల కన్వీనర్‌ కొడిశాల రాములు, గిరిజన సంఘం నాయకులు పాయ నరసింహారావు, కొండ్రు గౌరీ, గుండి భీమయ్య, కుంజా రాజు, కారం భీమయ్య, గుంజ రాజా, బండారు సారిక, గిరిజనులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -