Sunday, January 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమానత్వం కోసం సమరశీల ఉద్యమాలు

సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలు

- Advertisement -

ప్రజాస్వామిక హక్కులను పొందలేకపోతున్న మహిళలు
మోడీ పాలనలో అభద్రతా భావం
ఐద్వా జాతీయ మహాసభల్లో సమస్యలపై కార్యాచరణ : మీడియా సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఐద్వా జాతీయ అధ్యక్షులు పికె శ్రీమతి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాజంలో మహిళలకు సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలను నిర్మిస్తామని ఐద్వా జాతీయ అధ్యక్షులు పికె శ్రీమతి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఐద్వా జాతీయ 14వ మహాసభల సందర్భంగా ఆర్టీసీ కళ్యాణమండపంలో శనివారం ఆమె మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలు, దళితులు, మైనార్టీలు, పేద వర్గాల్లో అభద్రతాభావం పెరిగిందని అన్నారు. ఆయా వర్గాల సమస్యలు-పరిష్కార మార్గాలపై ఐద్వా జాతీయ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు.

రైతులు, కూలీలు, కార్మికులు, పేదలు, మహిళల సమస్యల పరిష్కారం కోసం ఐద్వా బలమైన ఉద్యమాలు చేసిందన్నారు. భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కులను కూడా మహిళలు ఇప్పటికీ పొందలేకపోతున్నారని చెప్పారు. రాజ్యాంగం మార్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మత ఘర్షణలు, కార్మిక చట్టాల రద్దు, పేదరికం వంటి ప్రధాన సమస్యలపై ఐద్వా మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. కేరళలో తీవ్రమైన పేదరికాన్ని అక్కడి ప్రభుత్వం నిర్మూలించిందని గుర్తు చేశారు. కేరళ మాదిరిగా సుస్థిర అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ గడ్డపై బలమైన ప్రజా ఉద్యమాలు జరిగాయన్నారు. ఐద్వా వ్యవస్థాపక నాయకురాలు మల్లు స్వరాజ్యం ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులుగా సుదీర్ఘకాలం సేవలందించారని గుర్తుచేశారు. ఐద్వా జాతీయ మహాసభల ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో తొలిసారిగా జరుగుతున్న ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మోడీ మహిళా వ్యతిరేకి, పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలను చేయాల్సిన అవసరముందన్నారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కుల సాధనకు ఐద్వా మహాసభల్లో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -