మోడీ పాలనలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు
కేంద్ర నిధులకు ఆశపడే యూరియా కొరత
చంద్రబాబు, జగన్ బీజేపీ తొత్తులే : బహిరంగ సభలో ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్షులు కె.విజయరాఘవన్
నవతెలంగాణ- కడప ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు కె.విజయరాఘవన్ పిలుపునిచ్చారు. మూడ్రోజులపాటు జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు కడపలో సోమవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా తొలుత కడపలోని హరితా హోటల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఏడు రోడ్ల కూడలి మీదుగా పాత బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ భూపంపిణీ, ఉపాధి హామీ, జిల్లా సమగ్రాభివృద్ధిపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేశ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై కె.విజయరాఘవన్ మాట్లాడారు. ప్రధాని మోడీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని వివరించారు. మోడీ పదేండ్ల పాలనలో అదాని సంపద రూ.10 లక్షల కోట్లు, అంబాని ఆస్తులు 350 రెట్లు పెరిగాయని తెలిపారు. భూ సంస్కరణలను వెనక్కినెట్టి దళితుల, గిరిజనుల, పేదల భూములను కార్పొరేట్లకు కట్టబడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతోందని వివరించారు. 55 ఏండ్లుగా భూ సంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు భూ పంపిణీ చేసి దేశంలోనే కేరళ రాష్ట్రం మోడల్‌గా నిలిచిందన్నారు. ఉత్తరాది బీజేపీ రాష్ట్రాల్లోని బ్రాహ్మణుల కంటే కేరళలోని దళితులు మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారని తెలిపారు. మతతత్వ బీజేపీని టీడీపీ, జనసేన బలపరుస్తుండడం ఆందోళనకరమన్నారు. సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మికులు, పేదలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ దేశంలో మోడీ మోడల్, చంద్రబాబు మోడల్, కేరళ మోడల్ ఉన్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, గ్రామీణులకు ఏవి సరిపోతాయోననే అంశంపై చర్చ నడుస్తోందని తెలిపారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారమే గుజరాత్‌లో 18 శాతం పేదరికం ఉందని, కేరళలో ఒక్క శాతమూ లేదని చెబుతోందన్నారు. దీన్నిబట్టి మోడీ మోడల్ నిరుద్యోగాన్ని పెంచుతున్నట్టు తేలిందని వివరించారు. కేరళలో మహిళా కార్మికులకు రూ.1,000 చొప్పున వేతనం ఇస్తున్నారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఉపాధి హామీ చట్టం కింద పని చేసిన వేతనదారులకు కనీసం రూ.600 వేతనం ఇవ్వాలనే అంశంపై జాతీయ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ రూ.7.50 లక్షల చొప్పున ఐదు లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇచ్చిందన్నారు. ఏపీలో పి-4 పథకం కింద పేదలను ధనికులకు దత్తత ఇచ్చి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, బాధ్యత నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తోందని విమర్శించారు. అమెరికా మనదేశ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించడం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాటిపై ఎటువంటి సుంకాలూ చేయవద్దని ట్రంప్ ఆంక్షలు విధించడం, దీనిపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. మోడీ, ట్రంప్ విధానాలను తిప్పికొట్టగల సత్తా ఎర్రజెండాకే ఉందని తెలిపారు. రాజ్యసభ సభ్యులు వి.శివధాసన్ మాట్లాడుతూ చంద్రబాబు, వైఎస్.జగన్ ఇద్దరూ బీజేపీకి తొత్తులేనని విమర్శించారు. వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదలకు పోరాడుతు న్నామని తెలిపారు.
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ మాట్లాడుతూ 11 ఏండ్ల బీజేపీ పాలనలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. మహిళా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కన్వీనర్ లలితాబాలన్ మాట్లాడుతూ కేరళలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, ఏపీలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ హార్టికల్చర్ హబ్ అని, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అబద్దాలు చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కేంద్ర నిధులకు ఆశపడి రాష్ట్రానికి యూరియా కోటాను తగ్గించుకోవడం దారుణమని తెలిపారు. సోలార్ పరిశ్రమల పేరుతో పంట పొలాలను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు డబ్బుల్లేవు కానీ, గోదావరి-బనకచర్ల కడతామనడం ఏమిటని నిలదీశారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీ హయాంలో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి ప్రాంతాల పెత్తందారులు లక్ష ఎకరాలను ఆక్రమించు కున్నారని, తాము అధికారంలోకి వస్తే ఈ భూముల ను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు. కేరళ వెల్ఫేర్ బోర్డు తరహాలో వ్యవసాయ కార్మికులకు భూమి, పరిహారం చెల్లిస్తామన్న హామీ ఏమైందో చెప్పాలన్నారు. మోడీ హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా పవన్ కల్యాణ్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. వేదికపైకి అతిథులను వ్యకాస జిల్లా అధ్యక్షులు శివకుమార్ ఆహ్వానించారు. అనంతరం కడపలోని హరితా హోటల్‌లో జాతీయ సమావేశం ప్రారంభమైంది.
ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు

- Advertisement -
- Advertisement -