అక్టోబర్‌లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులపాటు ఆందోళన
ఉద్యోగ, కార్మిక, కర్షక ఐక్య సంఘటన నిర్మించాలి : బహిరంగ సభలో ఎఆర్ సింధు పిలుపు
విజయవంతంగా ముగిసిన ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 11వ మహాసభ
నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ
ఒంగోలు : సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, అక్టోబర్‌లో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులపాటు ఆందోళన నిర్వహించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యోగ, కార్మిక, కర్షక ఐక్య సంఘటన నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలో భాగంగా ఒంగోలులోని కొత్త మార్కెట్ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తనకు తాను విశ్వగురువుగా ప్రకటించుకున్న మోడీ… దేశం వికసిత్ భారత్‌గా వెలిగిపోతోందని, ఆయన అడుగుల్లో నడిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం స్వర్ణాంధ్రగా వికసిస్తోందని గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.
దేశంలో పోషకాహారం అందని 80 శాతం ప్రజల గురించి, 50 శాతం బాలల గురించి, రక్తహీనతకు గురవుతున్న 70 శాతం మహిళల గురించి, ఏటా మరణిస్తున్న 75 లక్షల మంది బాలల గురించి, పౌష్టికాహార లోపంతో ప్రతిరోజూ మరణిస్తోన్న 70 వేల పసికందుల గురించి వీరి జవాబు చెప్పాలని నిలదీశారు. కేవలం గౌరవ వేతనం పొందుతూ దేశ వ్యాప్తంగా పేదలకు పోషకాహారం అందిస్తూ సామాజిక బాధ్యతగా సేవ చేస్తోన్న అంగన్‌వాడీలకు కనీస వేతనంతోపాటు తగిన గౌరవం దక్కాలంటే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కనీస వేతనం సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికీ పోషకాహారం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌లో, మిడ్ డే మీల్స్‌లో, రేషన్‌లో కోత విధిస్తుండడం శోచనీయమన్నారు. ఎస్మా వంటి నిర్భంధాలు ఎదిరించి ఎన్నో విజయాలు సాధించిన ఉద్యమ స్ఫూర్తితో అంగన్‌వాడీలు, స్కీమ్ వర్కర్లు తమ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కార్మిక వర్గం ఏదైనా సాధించగలదు : సిహెచ్ నర్సింగరావు
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కార్మిక వర్గం తలచుకుంటే ఏమైనా సాధించగలదని అన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన, అంగన్‌వాడీల సమ్మె దీనిని రుజువు చేసిందని వివరించారు. కార్మికుల ఐక్యపోరాటం వల్లే ఒక్క శాతం కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయలేకపోయారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను ఎదిరించేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ కనీస వేతనం సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు.
బహిరంగ సభకు అధ్యక్షత వహించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.బేబి రాణి మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ తాను ముఖ్యమంత్రి సోదరిగా ప్రకటించుకుని అంగన్‌వాడీలను వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు. దీనికి ముందు నెల్లూరు బస్టాండ్, ప్రకాశం భవన్, చర్చి సెంటర్, పాత మార్కెట్, అద్దంకి బస్టాండ్, మీదుగా సభాస్థలి (కామ్రేడ్ నీలిమా మైత్రినగర్ వేదిక)కు ర్యాలీగా చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రజానాట్యమండలి కార్యకర్తలు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. విజయవంతంగా యూనియన్ రాష్ట్ర 11వ మహాసభ ముగిసింది.
నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ
ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ తిరిగి ఎన్నికయ్యారు. గత రెండు రోజులుగా ఒంగోలులో జరిగిన సంఘం రాష్ట్ర మహాసభలో ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి 89 మంది ఎన్నికయ్యారు. 33 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కోశాధికారిగా బి లకీëదేవి, ఉపాధ్యక్షులుగా ఎస్ వాణిశ్రీ, ఎం ఉమామహేశ్వరి, ఎన్‌సిహెచ్ సుప్రజ (ఎన్‌టిఆర్ జిల్లా), పి భారతి (ఏలూరు), మల్లేశ్వరి (కృష్ణా జిల్లా), జి మల్లేశ్వరి (పల్నాడు), కె వెంకటమ్మ (కర్నూలు), కార్యదర్శులుగా ఎం నాగశేషు (అనకాపల్లి), ఇ చంద్రావతి (కాకినాడ), వి శ్రీదేవి (శ్రీసత్యసాయి జిల్లా), కల్యాణి (పశ్చిమగోదావరి,) ఎ రమాదేవి (కృష్ణా జిల్లా), వి భాగ్యలక్ష్మి (అల్లూరి సీతారామరాజు జిల్లా), కె కృష్ణవేణి, నూకరత్నం (డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ) పి రేఖ ఎలిజబెత్ (బాపట్ల), కె బేబీరాణి (తూర్పుగోదావరి), జె రమాదేవి (అనంతపురం), ఎవిఎన్ కుమారి (గుంటూరు), వై సుజాత (నెల్లూరు), బి నిర్మల (రంపచోడవరం), జ్యోతి (పార్వతీపురం మన్యం జిల్లా)తోపాటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు ఆఫీస్ బేరర్లుగా ఎన్నికయ్యారు.