Wednesday, May 7, 2025
Homeఎడిట్ పేజియుద్ధోన్మాదం: మిలిటరీ బడ్జెట్‌ పెంపు-పౌర సంక్షేమానికి కోత!

యుద్ధోన్మాదం: మిలిటరీ బడ్జెట్‌ పెంపు-పౌర సంక్షేమానికి కోత!

- Advertisement -

డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనులే కాదు యుద్ధోన్మాదంతో కూడా రెచ్చిపోతున్నాడు. ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానంటాడు, మరోవైపు గాజాలో మారణకాండకు మద్దతు, ఎమెన్‌పై ప్రత్యక్షంగా దాడులు జరిపిస్తాడు. ఇలాంటి దుర్మార్గాలకు మరింతగా పాల్పడేందుకు మిలిటరీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు పూనుకున్నాడు. 2026 సంవత్సర బడ్జెట్‌లో మిలిటరీకి 13శాతం పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని, అందుకు గాను విద్య, వైద్యం, పర్యావరణం, ప్రజాసాయం, అదనపు పోషకాహార సాయ పధకం(మన ఉచిత బియ్యం వంటిది), బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు అధ్యక్ష భవనం ఈనెల రెండవ తేదీన ఒక ముసాయిదా బడ్జెట్‌ను ఆవిష్కరించింది.ఈ కోతలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత సామర్ద్య శాఖ(డోజె) ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించి, ఉద్యోగాలకు కోత పెట్టి పొదుపు చర్యలంటూ అనేక సంస్థలకు నిధుల కోతకు పాల్పడింది. బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయి.విధిగా కేటాయింపులు జరపాల్సినవి, విచక్షణతో అమలు జరపాల్సినవి. రెండో రకం పథకాల మొత్తం వచ్చే ఏడాది 1.7లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, వర్తమాన బడ్జెట్‌తో పోలిస్తే 7.6శాతం కోత విధించినట్లని చెబుతున్నారు. ఇవి ప్రధానంగా సంక్షేమ పథకాలకు చెందినవే.
అమెరికా రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ మీద అధికారం పార్లమెంటుదే, అయితే నిబంధనల మేరకు అధ్యక్ష భవనం తన వాంఛలను తెలియచేస్తూ పార్లమెంటుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే వాటిని పార్లమెంటు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, సవరించవచ్చు. అవి అధ్యక్షుడికి నచ్చకపోతే 1974లో సవరించిన చట్ట ప్రకారం తనకున్న అధికారాల ద్వారా ఉత్తరువులు జారీ చేసి అమలు చేయవచ్చు. మిలిటరీ బడ్జెట్‌ పెంచినప్పటికీ అధికారపక్షం నుంచి విమర్శలు వచ్చాయి.అమెరికా బలం పెంచుకోవటం ద్వారా ప్రపంచంలో శాంతి సాధించాలని ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారం చేశాడని, సలహాదారులు దానికి అనుగుణంగా వ్యవహరించటంలేదని ఆరోపించారు. సాయుధ దళ సేవల సెనెట్‌ కమిటీ అధ్యక్షుడు వికర్‌ ఒక ప్రకటన చేస్తూ ఆసియాలో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించకుండా ఉండాలన్నా, రష్యా, ఇరాన్‌ దేశాలకు హమస్‌, హౌతీల వంటి సాయుధులకు మిలిటరీ మద్దతివ్వకుండా ఉండాలంటే అమెరికా మరింతగా మిలిటరీ రీత్యా బలపడాలని పేర్కొన్నాడు. బడ్జెట్‌ ప్రతిపాదనలు మిలిటరీ సామర్ధ్యాలను దెబ్బతీస్తాయని ఆరోపించాడు. సాయుధ దళ సేవల పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు మైక్‌ రోజర్స్‌ మరింతగా రెచ్చిపోతూ నాటో దేశాలు జీడీపీలో ఐదుశాతం రక్షణకు ఖర్చు పెట్టాలని ట్రంప్‌ చెబుతుంటే మనం చాలా తక్కువ ఖర్చుచేస్తే సత్తా ఎలా పెంచుతా మంటూ రంకెలు వేశాడు.మొత్తానికి లాలూచీ విమర్శలతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.
స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.7లక్షల కోట్ల డాలర్లని, దీనిలో మూడోవంతు అమెరికా ఖర్చు 997బిలియన్‌ డాలర్లని పేర్కొన్నది. హిట్లర్‌ వారసురాలైన జర్మనీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28శాతం పెంచి 88.5బి.డాలర్లు, మరో యుద్దోన్మాది జపాన్‌ 21శాతం పెంచి 55.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.మిలిటరీ ఖర్చులో ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ నాలుగుకు ఎగబాకింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 149 బి.డాలర్లు ఖర్చు చేస్తే ఎలాంటి దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనని నాటో దేశాలు పదిరెట్లు అదనంగా 1.5లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. మొత్తం ఖర్చు 2015లో ఉన్న 1.67లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 2024లో 2.7లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.యుద్ధోన్మాదం లేదా మిలిటరీ ఖర్చు పెరుగుదల తీరు ముప్పును సూచిస్తున్నది. ఐరోపా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్న జర్మనీ యుద్ధ సన్నాహాలకు గాను అంటే మిలిటరీ అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా రోడ్లు, వంతెనలు, ఆస్పత్రుల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు 1.13లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు పూనుకుంది, ఇది మొదటి ప్రపంచ యుద్ధం తొలి ఏడాదిలో జర్మనీ చేసిన ఖర్చులో 8.6శాతం కాగా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరం చేసిన ఖర్చుకు దగ్గరలో ఉందని పోలికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ యుద్ధ పరిశ్రమలు ముఖ్యంగా అమెరికా సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు దోహదం చేస్తున్నాయి. సిప్రి అంచనా ప్రకారం 2023లో ఆయుధ తయారీలో అగ్రభాగాన ఉన్న 100 కంపెనీలు 632 బిలియన్‌ డాలర్ల మేర విక్రయించగా ఒక్క అమెరికా ఉత్పత్తిదారులకే 317 బిలియన్‌ డాలర్లు దక్కాయి.
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలకు ఆయుధాలను విక్రయించిన జర్మన్‌ కంపెనీ రెయిమెటాల్‌ ఆయుధ అమ్మకాల వృద్ధి 2024లో 36శాతం ఉండగా వర్తమాన సంవత్సరంలో 25 నుంచి 30శాతం వరకు ఉండవచ్చని అంచనా. నాటో కూటమి దేశాల మిలిటరీ ఖర్చు జీడీపీలో 3.5శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఆమోదిస్తే 2030 నాటికి 400బిలియన్‌ యూరోల విలువ గల ఆర్డర్లు పెరుగుతాయని రెయిమెటాల్‌ చెప్పింది. వీటి కోసం అమెరికా సంస్థలతో ఐరోపా కంపెనీలు పోటీపడతాయని, ఆక్రమంలో విబేధాలు తలెత్తినా ఆశ్చర్యం ఉండదని చెప్పవచ్చు. ఈ తీరును చూసినపుడు ప్రపంచంలో తమ ఆర్థిక, భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించటానికి సామ్రాజ్యవాదులందరూ పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏ పరిణామాలు, ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాలి. 2014లో అమెరికా, జర్మనీ చేసిన కుట్రలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని పదవీచ్యుతుని గావించి తమ అనుకూల శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఆ కుట్రకు విరుగుడుగా గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియాను విలీనం చేసుకోవటమే గాక 2022లో మిలిటరీ చర్య ప్రారంభించి అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆప్రాంతాలను రష్యాకు అప్పగించి లేదా స్వతంత్ర ప్రాంతాలుగా ఉంచి యుద్ధాన్ని ముగిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన, వైఖరి ఐరోపాలో అసంతృప్తికి దారితీసింది, ఎత్తుగడా లేక నిజంగానే అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందా అని జర్మనీ పరిస్థితిని గమనిస్తున్నది. ఉక్రెయిన్‌కు చేసిన మిలిటరీ సాయాన్ని తీర్చే స్థితిలో లేదు గనుక అక్కడి విలువైన ఖనిజాలను అమెరికాకు రాసి ఇచ్చి ఒప్పందం చేసుకుంది. ఆర్థికరంగంలో తనకు సవాలు విసురుతున్న చైనాను దెబ్బతీసేందుకు వీలైతే తైవాన్‌ సమస్య ముసుగులో దాడికి తెగబడేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఈ పూర్వరంగంలో చైనా కూడా తన మిలిటరీ నవీకరణ, ఆయుధాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేయాల్సి వస్తున్నది. జో బైడెన్‌ అధికారానికి వచ్చిన రెండువారాల్లో జాతీయ రక్షణ వ్యూహం పేరుతో అమెరికా ఒక పత్రాన్ని విడుదల చేసింది. దాన్లో మిలిటరీ ఖర్చును భారీ మొత్తంలో పెంచాలని పేర్కొన్నది. ఎందుకటా, రానున్న దశాబ్దం నిర్ణయాత్మకమైనదని అమెరికాకు పెను సవాలుగా మారుతున్న చైనా, రష్యాలను ఓడించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో చమురు సంపదలున్న ప్రాంతం మీద తిరుగులేని ఆధిపత్యం సాధించాలన్న ఎత్తుగడ కారణంగానే గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండకు నిస్సిగ్గుగా అమెరికా మద్దతు ఇస్తున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌పై దాడులు చేస్తున్నది. అమెరికా, జర్మనీ బిలియన్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తున్నాయి. ఇరాన్‌ మీద దాడికి అవకాశం కోసం చూస్తున్నది, దాని దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి తటపటాయిస్తున్నది.
అమెరికా తన ప్రయోజనాలకే ఎప్పుడూ పెద్ద పీటవేస్తుందని ఐరోపాకు తెలిసినప్పటికీ గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దానితో జూనియర్‌ భాగస్వామిగా కలసి ప్రయాణిస్తున్నది. స్వతంత్ర పాత్ర పోషించేందుకు ఐరోపా సమాఖ్య, ఉమ్మడి కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది.రెండూ దాగుడుమూతలాడుతున్నాయి, మొత్తమ్మీద చూసినపుడు మిత్ర వైరుధ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్లు తాము చేయలేని పనిని చైనా చేయటాన్ని గమనిస్తున్నాయి. అయితే దానితో చేతులు కలిపే అవకాశం లేదు గనుక దాన్ని చూపి అమెరికాతో బేరమాడు తున్నాయి. అమెరికాకే అగ్రస్థానం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండాను ముందు పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రతిఘటిస్తామని చెప్పటం తాజా పన్నుల యుద్దంలో చూశాము.ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కు తగ్గినా అలాంటి కత్తి వేలాడుతూనే ఉంటుంది గనుక ఐరోపా తన రక్షణ తానే చూసుకొనేందుకు పూనుకోవటం ఖాయం. దాన్లో భాగమే జర్మనీ పెద్ద మొత్తంలో మిలిటరీ ఖర్చుకు పూనుకోవటం.ఇరవై ఏడు దేశాల ఐరోపా సమాఖ్య 800బిలియన్‌ యూరోల మిలిటరీ ఖర్చు అదనంగా చేసేందుకు నిర్ణయించింది, ఐరోపా జనాభాలో 24శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్పటికీ ఈ ఖర్చు చేయటాన్ని గమనించాలి.ధనిక దేశాల్లోని కులీనులందరూ తమ లాభాలకు ముప్పులేకుండా భారాలన్నింటినీ కార్మికవర్గం భరించే విధంగా విధానాలను రూపొందిస్తున్నారు. సామాజిక సంక్షేమ కోతలకు ఎలా పూనుకుంటారో ముందే చెప్పినట్లుగా దీనికి ఎదురయ్యే ప్రతిఘటనలను అణచివేసేందుకూ పూనుకుంటారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, ఐరోపాల స్నేహ బండారం త్వరలోనే బయటపడుతుంది.
చైనా మిలిటరీ బడ్జెట్‌ 258 బిలియన్‌ డాలర్లని వార్తలు వచ్చాయి. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెచ్చగొట్టుడు చర్యల కారణంగా ఇటీవలి కాలంలో దాని బడ్జెట్‌ గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో వంద ఆయుధాలు ఎగుమతి అవుతుంటే వాటిలో 42 అమెరికా, ఫ్రాన్సు, రష్యాల నుంచి పదకొండు చొప్పున, చైనా 5.8, జర్మనీ 5.6 ఎగుమతి చేస్తున్నాయి. ఇక దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ 9.8, సౌదీ అరేబియా 8.4,కతార్‌ 7.6, ఉక్రెయిన్‌ 4.9, పాకిస్తాన్‌ 4.3, చైనా 2.9 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. సిప్రి సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది దేశాల్లో12,121అణ్వాయుధాలు ఉన్నాయి.దేశాల వారిగా మోహరించినవి లేదా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచినవిగానీ దేశాల వారీ ఇలా ఉన్నాయి.బ్రాకెట్లలోని అంకెలు మోహరించినవి. రష్యా 5,580(1,710), అమెరికా 5,044(1,770), చైనా 500(24), ఫ్రాన్సు 290(280), బ్రిటన్‌ 225(120), భారత్‌ 172, పాకిస్తాన్‌ 170,ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 50 కలిగి ఉన్నాయి. మన దేశం దగ్గర అణ్వాయుధాలున్నా వాటిని ప్రయోగించే అవకాశం లేదు గనుక సాంప్రదాయ ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసు కోవటంతో ఆయుధ ఎగుమతి దేశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికెత్తి ఆయుధ ఆర్డర్లు పొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు!
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -