వచ్చే ఏడాది జూన్ నుంచి అమలు
నర్సరీ నుంచి 4వ తరగతి వరకు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి
ప్రణాళికలు సిద్ధం చేయండి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాలు, అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం అందించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని కోరారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టిసారించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని చెప్పారు. ఆటస్థలం, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా పాఠశాలలుం డాలని అన్నారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. సరైన సౌకర్యాల్లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని కోరారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని చెప్పారు.