Wednesday, October 15, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మిల్లర్ల కొర్రీలు

మిల్లర్ల కొర్రీలు

- Advertisement -

– 10 శాతం డిపాజిట్‌ చేసేందుకు ససేమిరా
– మిల్లు ట్యాగింగ్‌ తంటా.. కేంద్రాల నిర్వాహకుల అవస్థలు
– తడిసి ముద్దవుతున్న ధాన్యం
– 15 రోజుల నుంచి కేంద్రాలకు చేరుకుంటున్న పంట
– పేరుకే 296 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
– ఒక్క గింజా కొనుగోలు చేయలేదు
– గోస పడుతున్న రైతులు

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం వరి కోతలు షురూ కావడంతో ధాన్యం చేతికొస్తోంది. ఆ పంటను రైతులు అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా అవి ఎక్కడా కనిపించడం లేదు. పేరుకే ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎక్కడా గింజ ధాన్యం కూడా కాంటా వేయలేదు. జీవో నెం.17 ప్రకారం పంట కొనుగోళ్లకు 10శాతం డిపాజిట్‌ చేసేందుకు మిల్లర్లు ససేమిరా అంటుండటం.. మిల్లుల ట్యాగింగ్‌ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పంట అమ్ముకోలేక ధాన్యం రాశులతో రైతులు గోస పడుతున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంట మొత్తం తడిసిముద్దవుతోంది.

నల్లగొండ జిల్లాలో 15 రోజుల కిందట నుంచే రైతులు పంటను కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కోసం దొడ్డు రకం, సన్న రకం వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 375 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలైందన్న పేరుతో అధికారులు అట్టహాసంగా నల్లగొండలో 296 కేంద్రాలను ప్రారంభించారు. సూర్యాపేటలో 296 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

పేరుకే ప్రారంభం
ఈ సీజన్‌లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6 లక్షలా 30 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 296 కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. కండ్ల ముందట ధాన్యం వర్షార్పణం అవుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటివరకు మిల్లుల ట్యాగింగ్‌ కాకపోవడంతో నిర్వాహకులు కేంద్రాల్లో ఖాళీగా కూర్చుని పోతున్నారు. మిల్లుల ట్యాగింగ్‌ పూర్తయితేనే ధాన్యాన్ని మిల్లు పాయింట్‌లో దిగుమతి చేసుకోవాల్సిన ఉంటది. ట్యాగింగ్‌ కాకపోవడంతో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేయడానికి ఇంకా అనుమతులు రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని అదునుగా చూసి ప్రయివేటు వ్యాపారులు ధాన్యాన్ని కొంటామని చెప్పి తక్కువ రేటు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు.

మిల్లర్ల కొర్రీ
ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపించడం.. అక్కడి నుంచి సీఎంఆర్‌ బియ్యంగా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ముందస్తుగా కేటాయించిన సీఎంఆర్‌ బియ్యానికి సరిపడా 10 శాతం డబ్బులు డిపాజిట్‌ చేయాలని జీవో నెంబర్‌ 17 విడుదల చేసింది. అయితే, డబ్బులు ముందస్తుగా చెల్లించడం కుదరదని మిల్లర్లు ఇప్పటికే జిల్లా పౌరసరఫరాల అధికారికి వినతిపత్రం సమర్పించినట్టు తెలిసింది. జీవో నెంబర్‌ 17 ప్రకారం ముందస్తుగా 10శాతం బ్యాంకు డిపాజిట్‌ చేసేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. దాంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకావడంలేదు.

ట్యాగింగ్‌ కాకపోవడం..
రైౖతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు పదిహేను రోజులుగా తీసుకొచ్చి ఆరబెడుతున్నా.. అధికారులు మాత్రం ఇంకా మిల్లు ట్యాగింగ్‌ చేయలేదు. కేంద్రాలు ప్రారంభమై వారం రోజులు గడిచినప్పటికీ ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. రైతుల ధాన్యం వర్షాలకు తడిసి ముద్ద అవుతుండటంతో నిర్వాహకులు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు.

15 రోజులుగా గోస పడుతున్నాం
ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రూ. 500 రూపాయల బోనస్‌ వస్తుందన్న ఆశతో మిల్లులకు పోలేదు. తమ మూడెకరాల పంటలో సగభాగం నల్లగొండ పట్టణంలోని అర్జాలబావి కొనుగోలు కేంద్రానికి 15 రోజుల కిందట తీసుకొచ్చాం. ఇంకా కాంటాలు వేయకపోవడంతో రోజూ కురుస్తున్న వర్షానికి ధాన్యం తడుస్తోంది. తడవకుండా జాగ్రత్తపడటానికి గోస పడుతున్నాం. వెంటనే కొనుగోళ్లు మొదలెట్టాలి. – మహిళా రైతు భాగ్య, ఖాజీరామరం

కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. ప్రకృతి వైపరీత్యాలకు రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తున్నా కాంటా వేయకపోవడం సరికాదు. వెంటనే ధాన్యాన్ని తూకం వేయాలి. – రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -