ఈపీఎస్-95 పెన్షనర్ల భారీ ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కనీస పెన్షన్ రూ.9 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్-95 పెన్షనర్లు భారీ ధర్నా చేపట్టారు. బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపిఎఫ్ పెన్షనర్స్ సంఘం (ఏఐసీసీఈపీఎఫ్‌పీఏ) ఆధ్వర్యంలో పెన్షనర్లు కదంతొక్కారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ దిగే మాట్లాడుతూ గత 11 ఏండ్లుగా సీపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ డీఏతో కలిపి రూ. 9 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014 అక్టోబర్ 1 తరువాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలన్నారు. 17.5 లక్షల పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుంటే, కేవలం 50 వేల మందికి మాత్రమే అమలు చేశారని విమర్శించారు. కొందరు పెన్షనర్లకు డిమాండ్ నోటీసులు వచ్చి సకాలంలో డబ్బులు చెల్లించలేని వారికి మరొక అవకాశం కల్పించాలని కోరారు. ఈపీఎస్ పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు పునరుద్ధరణ చేయాలని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని కోరారు. కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల వలే ఈపీఎస్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సామాజిక పెన్షన్ రూ. 4 వేలు చెల్లించాలని ఏపీ సీఎం చంద్రబాబును, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు కోరారు. ఈ ధర్నాకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తదితర ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్, ఏఐసీసీఈపీఎఫ్‌పీఏ నేతలు ప్రకాష్ కుమార్ ఎండే, భీమ్రావు డోంగ్రే, ఎం. జనార్ధన రెడ్డి, కె. కనకరాజు, సీబీటీ కమిటీ సభ్యులు కరుమలయన్, తెలంగాణ నుంచి రామారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి కె.సత్తిరాజు, కర్రీ బాబురావు, యుఎస్‌ఎన్ రెడ్డి, మేడిశెట్టి వెంకటరమణ, జార్జ్ బర్న్ బస్, కె. వెంకటరమణ, డి. సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
కనీస పెన్షన్ రూ.9 వేలు పెంచాలి
- Advertisement -
- Advertisement -



