చివరిసారిగా 2017లో నిర్ణయం
ఏడేండ్లుగా ఎలాంటి మార్పూ జరగని వైనం
దేశంలో దుర్భరంగా కార్మికుల పరిస్థితి
పట్టించుకోని మోడీ సర్కారు
కేంద్రం, రాష్ట్రాలది తలో దారి
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలో కనీస వేతనం అంశం ఆందోళనను కలిగిస్తున్నది. ఈ విషయంలో మోడీ సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. గత ఏడేండ్లుగా కనీస వేతనంలో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఫలితంగా దేశంలోని అత్యధిక జనాభాలో ఆదాయ సంక్షోభం తీవ్రతరం అవుతోంది. రోజువారీ వేతనాలపై ఆధారపడుతూ జీవితాలను నెట్టుకొస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనంలో గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు జరగలేదు.
2017లో కేంద్రం చివరిసారిగా కార్మికుల రోజువారీ కనీస వేతనాన్ని నిర్ణయించింది. పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచీని పరిగణనలోకి తీసుకొని ఈ వేతనాన్ని నిర్ణయిస్తారు. దీనికి కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కార్మికుల కనీస వేతనాలను సవరించి నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహా మాత్రమే ఇస్తుంది. తాను నిర్ణయించిన దాని కంటే తక్కువ స్థాయిలో వేతనాలను సవరించవద్దని కోరుతుంది. అంతకుమించి కేంద్రం చేసేదేమీ ఉండదు.
అమలుకు నోచుకోని లేబర్ కోడ్స్
2019 ఆగస్టులో వేతన కోడ్స్‌కు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ ఘనత తనదేనని ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఆ నాలుగు లేబర్ కోడ్స్‌లో ఏ ఒక్కటీ నేటి వరకూ అమలుకు నోచుకోలేదు. కార్మికుల కనీస వేతనాలను నిర్దిష్ట గడువులో సవరించకపోతే వారి సంక్షేమం ప్రమాదంలో పడుతుంది. వేతన కోడ్స్‌ను అమలు చేసి, జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన కనీస వేతనాన్ని నిర్ణయిస్తే లక్షలాది మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ చెప్పారు.
ఎవరి దారి వారిదే
కేంద్రం నిర్ణయించిన కనీస వేతనాలను అనేక రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు కనీస వేతనాలను నిర్ణయించుకుంటున్నారు. అవి కేంద్రం నిర్ణయించిన దాని కంటే తక్కువగానే ఉంటున్నాయి. ఉదాహరణకు రాజధాని ఢిల్లీలో నైపుణ్యం కొరవడిన సాధారణ కార్మికులకు రోజుకు రూ.710 వేతనాన్ని ఇస్తుండగా బీహార్‌లో కేవలం రూ.428 మాత్రమే చెల్లిస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాత్రం కార్మికులకు కేంద్రం నోటిఫై చేసిన కనీస వేతనం కంటే ఎక్కువగానే లభిస్తోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధికి సంబంధించి కనీస వేతన నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడడమే వేజ్ కోడ్ ఉద్దేశం. చిట్టచివరిసారిగా 2017లో కనీస వేతనాన్ని నిర్ణయించి అంతకుముందు ఉన్న దాని కంటే పది శాతం పెంచారు. 2015 జూన్‌లో దానిని 17 శాతం పెంచి రూ.160గా నిర్ణయించారు.