‘గ్రానైట్’ వసూళ్లను దక్కించుకున్న ఎఎంఆర్
రూ.1130 కోట్లకు టెండర్
ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం పిపిపి పద్దతుల్లో పరుగులు పడుతోంది. మెడికల్ కళాశాలలను ప్రయివేటుకు అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, గనుల శాఖ నిర్వహించే కీలక బాధ్యతలను కూడా ప్రయివేటు కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా గ్రానైట్ గనులకు సంబంధిచిన రాయల్టీ వసూళ్లను ప్రయివేటుకు అప్పగించింది. ప్రస్తుతానికి గ్రానైట్‌కు సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్న ప్పటికీ , రాన్నున రోజుల ఇతర తవ్వకాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతిగడించిన ప్రకాశం జిల్లా చీమకుర్తితోపాటు బాపట్ల జిల్లాలోని బల్లికురవ ప్రాంత గ్రానైట్ క్వారీలనుంచి రాయల్టీ వసూలు చేసుకునే బాధ్యతను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది.
రాయల్టీ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించగా ఏఎంఆర్ సంస్థ రెండేళ్లకుగానూ రూ.1130 కోట్లతో టెండరు దక్కించుకుంది. ఇక వీరికి ఎంత ఆదాయం వస్తుందనేవారి వసూళ్లను బట్టి ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం పోగా మిగిలేదంతా వారి లాభం కిందనే ఉండనుంది. అక్టోబరు నుంచీ ఈ సంస్థ రాయల్టీ వసూళ్లను చేపట్టనుంది. ఇప్పటిదాకా గనుల లీజులు, తనిఖీలు, పర్యవేక్షణ, మొదలు రాయల్టీ వసూలు చేయడం వరకు అన్ని బాధ్యతలు మైనింగ్ శాఖ చూసేది. కీలకమైన రాయల్టీ వసూళ్లు ప్రయివేటుకు అప్పగించడంతో క్రమేణా ఇతర పనుల నుండి కూడా ఆ శాఖను తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాయల్టీ వసూలు చేయడం ద్వారా గ్రానైట్ ఉత్పత్తి, నాణ్యత తదితర విషయాలపై మైనింగ్ శాఖకు నియంత్రణ ఉండేదని, భవిష్యత్తులో అటువంటిదేమి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్ని క్వారీలు…?
చీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీగ్రానైట్ ఉంది. విదేశాలకు ఎగుమతి అవుతోంది.ఇక్కడ 42 క్వారీలున్నాయి.చిన్నాపెద్ద క్వారీలు కలిపి నెలకు 25 వేల క్యూటిక్‌మీటర్లకుపైగానే రాయి వస్తోంది. బల్లికురవ వద్ద కూడా 20కిపైగా ఉన్నాయి. 10 నుంచీ 15 వేల క్యూబిక్ మీటర్లు రాయి వస్తోంది. సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద మరో 10వేల క్యూబిక్‌మీటర్లురాయి తీస్తారు. అంతా కలిపి నెలకు 50వేల క్యూబిక్‌మీటర్లు రాయి వస్తోంది.రాయి సైజును బట్టి ప్రస్తుతం రాయల్టీ రూ.3 వేల నుంచీ రూ.6500 వరకూ ఉంటుంది. ఏటా రాయల్టీ రూపంలో రూ.450 కోట్లు వరకూ వసూలవుతోంది. ఇప్పుడు ఎఎంఆర్ సంస్థ 1130 కోట్లరూపాయలకు రెండు సంవత్సరాల కోసం టెండర్ దక్కించుకుంది. అంటే రెండు సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని ఆ సంస్థ వసూలు చేయాల్సిఉంది. దీరతో రాయల్టీ వసూళ్లకోసం ఆ సంస్థ ఎటువంటి విధానాలు అమలు చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్‌లోఅంతా ఈ సంస్థల చేతుల్లోకి వెళ్లినా వెళ్ళొచ్చనే చర్చ సాగుతోంది. అటు మైనింగు అధికారుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆంధోళనగానే ఉంది. ఏం జరుగుతుందోచూడాలనే భావనలో అధికారులు న్నారు. తమ పాత్ర రానున్న కాలంలో ఎలా ఉంటుందోకూడా తెలియదని ఓ మైనింగు అధికారి వ్యాఖ్యానించారు
నష్టదాయకంగా ఉంటే ఫ్యాక్టరీలు బంద్‌చేస్తాం-యజమానులు
రాష్ట్రప్రభుత్వం తీసుకువచ్చిన విధానం వల్ల తమకు నష్టదాయకంగా ఉంటే ఫ్యాక్టరీలను మూసేస్తామని చీమకుర్తి ప్రాంత గ్రానైట్ పాలిషింగు యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం హఠాత్తుగా ప్రవేటుకు అప్పగించడంపై శనివారం నాడు చీమకుర్తి సమీపంలోని రామతీర్ధంలో ఫ్యాక్టరీల యజమానులు భేటీ అయ్యారు. ప్రవేటు సంస్థ కార్యకలాపాలు తమకు నష్టం కలిగిస్తే రాయి కొనుగోళ్లతోపాటు ఫ్యాక్టరీలను కూడా మూసేస్తామని నిర్ణయించారు.ఎలా వసూళ్లు చేస్తారు? ఇపుడున్న దానికంటే ఎక్కువ వసూళ్లు ఉంటే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రవేటు సంస్థ కార్యకపాలాలు మొదలయ్యాక పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.