– బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి : బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
బీసీ నాయకుడైన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్‌ను తొలగించి కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే 100 సీట్లు వస్తాయన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కోమటిరెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించి, కాంగ్రెస్ నుంచి బర్తరఫ్ చేయాలని, అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకడుతుందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో పలు బీసీ కుల సంఘాలు, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదని.. ఆయన ఒక పిచ్చిరెడ్డి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక తరగతికి ఇస్తే.. మళ్లీ 100 ఏండ్లు అయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. బీసీల శాశ్వత శత్రువుగా మంత్రి వెంకటరెడ్డి నిలిచిపోతారని, ఇక మీదట ఆయన ఏ పార్టీలో ఉన్నా బీసీలు చిత్తుగా ఓడిస్తారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు చెప్పినట్టు అసెంబ్లీలో కొంతమంది ఊగుతూ.. తూలుతూ వస్తున్నారని, అందరికీ బ్రీత్ అనాలసిస్ చేయాలని అన్నారు. బీసీ నాయకుల పట్ల అవమానకరంగా మాట్లాడిన మంత్రి వెంటనే బీసీ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే భువనగిరి నియోజకవర్గంలో 2 లక్షల మంది బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మెన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మెన్ కుందారం గణేష్ చారి, పలు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నుంచి బర్తరఫ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



