Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి

మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ విప్‌ కెపి. వివేకానంద డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అక్రమ మైనింగ్‌కు పాల్పడినందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ విప్‌ కెపి వివేకానంద డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రాఘవ కన్‌స్ట్రక్షన్‌ మైనింగ్‌పై బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధారాలతో మాట్లాడగానే రాత్రికి రాత్రే మంత్రి పొంగులేటి కేరళ పారిపోయారని అన్నారు. అక్కడ ఎన్నికల ప్రచారమని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. రెవెన్యూ శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకొనిపోయిందన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ అక్రమ పనులు బీఆర్‌ఎస్‌ బయట పెట్టగానే అలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్టు పొంగులేటి బయటకు వచ్చాడని అన్నారు. ఆయనతోపాటుగా మంత్రివర్గం మొత్తం అవినీతిలో కూరుకొని పోయినట్టు మీడియా సమావేశంలో ఒప్పుకున్నారని చెప్పారు. పొంగులేటి బాంబులేటి కాదనీ, ఇప్పుడు బొంగులేటి అయ్యారని అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ పొంగులేటిది కాదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.

ఆయనేమో తన కుమారుడుదని అంటున్నారని వివరించారు. పొంగులేటి అక్రమాలను రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా కాకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్‌ చైర్మెన్‌గా మాట్లాడినట్టు ఉందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకుంటున్నది రాఘవ కన్‌స్ట్రక్షన్‌, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ అని ఆరోపించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్న పొంగులేటి రెవెన్యూ శాఖను తీసుకోవడమే తప్పు అని అన్నారు. నాదర్‌గుల్‌ భూములను కాపాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నాదర్‌గుల్‌ భూముల విషయం సుప్రీం కోర్టులో ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆ కేసులో పొంగులేటి భాగస్వామిగా ఉన్నారని చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి బిల్డర్లకు బాసటగా ఉంటారా? ప్రభుత్వ భూములకు రక్షణగా ఉంటారా?తేల్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు అభిలాష్‌రావు, కె కిషోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -