– హుస్నాబాద్‌లో వినూత్నమైన ‘స్టీల్ బ్యాంక్’ ప్రారంభం
– గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రేపు కార్యక్రమానికి హాజరు
నవతెలంగాణ – చిగురుమామిడి: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన తండ్రి పేరిట స్థాపించిన పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన స్టీల్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయనున్నారు. రేపు (గురువారం) సాయంత్రం 4:00 గంటలకు కోహెడ మండల కేంద్రంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్టీల్ బ్యాంక్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హైమవతి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ స్టీల్ బ్యాంక్‌ల నిర్వహణ బాధ్యతను నియోజకవర్గంలోని 276 మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.
పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్లాస్టిక్‌కు బదులు స్టీల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ టిఫిన్ ప్లేట్లు, లంచ్ ప్లేట్స్, వాటర్ & టీగ్లాసులు, డిష్, బకెట్లు, చెంచాలు, వంటగిన్నెలు వంటి స్టీల్ సామాగ్రిని ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు. ఇది హుస్నాబాద్‌లో నియోజకవర్గంకు మొదటిసారిగా గవర్నర్ పర్యటన కావడంతో, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. మంత్రి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చిగురుమామిడి మండల ప్రజలు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, మంత్రి పోన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.