నవతెలంగాణ – గోవిందరావుపేట : మండల కేంద్రంలో మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోనీ బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి సీతక్క జన్మదినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ కేకును కట్ చేసి సీతక్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భముగా వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ ముందుగా మన ప్రియతమ నాయకురాలు, మనందరి ఆడబిడ్డ, అడవమ్మ ఒడిలో పెరిగిన అడివి బిడ్డ సీతక్క కి మరొక సారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సీతక్క నిఖార్సైన, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకురాలు అని, ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, మానవతా వాదిగా, ప్రశ్నించే గొంతుకగా మారి ప్రజల ఇబ్బందులను తొలగించడంలో తనకి సాటి ఎవరు లేరని అన్నారు. నిర్మలమైన, నిష్కల్మషమైన మనసుతో ప్రజలందరి హృదయాలను చూరగొన్న నిరాడంబరి సీతక్క ములుగు గడ్డ మీద ఉండడం నిజంగా మన అదృష్టం అని అన్నారు.
2018 ఎన్నికల్లో గెలవగానే మనకు ములుగు జిల్లా వచ్చిందని, సీతక్క పోరాట పటిమ వల్లనే మల్లంపల్లి మండలం అయింది అని, సీతక్క నేడు చొరవ తీసుకుని మరీ ములుగు గ్రామాన్ని మున్సిపల్ చేసిందని, ఏటూరునాగారం డివిజన్ చేసిందని, గిరిజన విశ్వవిద్యాలయ తరగతులను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది అని, సీతక్క ములుగు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరంన్నర కాలంలోనే ములుగు నియోజకవర్గంలో నాలుగు వందల కోట్ల చొప్పున అంతర్గత రోడ్లు, ములుగు జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్, ఏటూరునాగారం బస్ డిపోలకు శంకుస్థాపనలు వేయించిందని, అత్యంత ప్రతిష్టాత్మక మేడారం జాతరను ఒంటిచేత్తో సమర్థవంతంగా నడిపించిందని అన్నారు. అలాగే ములుగు నియోజకవర్గానికి ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత సీతక్క అని అన్నారు.
అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలతో తన కీర్తి, ప్రతిష్టలు ఖండాంతరాలు దాటించి, ములుగు నియోజకవర్గాన్ని ప్రపంచం నలుమూలల తెలిపిన ఐరన్ లేడీ సీతక్క అన్నారు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేత్రంలో, ప్రజా నాయకురాలిగా, ప్రజా సమస్యలు తొలగిస్తూ, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి సుధాకర్, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.