నవతెలంగాణ – హైదరాబాద్: భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కి ఎంపికైన చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా, అందులో మన తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8 కోట్ల టర్నోవర్ చేసినందు,కు సహజ సిద్ద రంగులను ఉపయోగించి జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్ తో పట్టుచీరను నేసిన గూడ పవన్ కు జాతీయ చేనేత అవార్డుకు ఎంపికయి చేనేత రంగంలో ఆదర్శంగా నిలిచారని మంత్రి తెలిపారు.
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనివ్వడం జరుగుతుందని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించి, 33 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.