కాంగ్రెస్ ‘ముస్లిం డిక్లరేషన్’ ఉత్తదే..
నవతెలంగాణ – పరకాల
తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని పరకాల మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు ఫాతిమా హమీద్ స్పష్టం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అమలు చేసిన పథకాలు మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆమె కొనియాడారు.త ప్రభుత్వ హయాంలో మైనారిటీల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం. వందలాది మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, విదేశీ విద్యానిధి ద్వారా ఉన్నత చదువులకు కెసిఆర్ మద్దతుగా నిలిచారన్నారు.మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజన్‌లకు ప్రతి నెల గౌరవ వేతనం అందించిన ఘనత కేసీఆర్‌దేనంటూ కొనియాడారు.
అంతేకాకుండా కెసిఆర్ 50 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన హోం శాఖను అప్పగించి సముచిత గౌరవం కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ముస్లిం డిక్లరేషన్’ హామీలను తుంగలో తొక్కిందని ఫాతిమా హమీద్ విమర్శించారు. మైనారిటీల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీని ద్వారా అర్థమవుతోందని, ఆ పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకులాగే చూస్తోందని మండిపడ్డారు.మైనారిటీల సంక్షేమం కోసం దాదాపు రూ. 12 వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్. నేటికీ మైనారిటీలు కేసీఆర్ వెంటే ఉన్నారంటు ఫాతిమా హమీద్ తెలిపారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీలందరూ ఏకతాటిపైకి వచ్చి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. మైనారిటీల ఆత్మగౌరవం కాపాడాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు.



