సూపర్ ఓవర్‌లో ఓడిన ఇండియా-ఎ
ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్‌కు బంగ్లాదేశ్-ఎ
దోహా: ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లోకి బంగ్లాదేశ్-ఎ జట్టు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇండియా-ఎ జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు అవకాశం దక్కినా.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇరుజట్లు 6వికెట్ల నష్టానికి 194పరుగులకే పరిమితమయ్యాయి. సూపర్ ఓవర్లో టీమిండియా-ఎ జట్టు తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి కెప్టెన్ జితేశ్ శర్మ బౌల్డ్ కాగా.. రెండో బంతికి అశుతోష్ క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను ఓపెనర్లు హబిబుర్(65), జిషన్(26)కి తోడు లోయర్ ఆర్డర్‌లో మెహరోబ్(48) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు నష్టపోయి 194పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. 195 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(44), వైభవ్ సూర్యవంశీ(38)లు శుభారంభమిచ్చారు.
జితేశ్ శర్మ(33), వధేరా(32)కి తోడు చివర్లో అశుతోష్(13) మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. అశుతోష్ శర్మ మూడో బంతిని సిక్సర్, ఆ తర్వాత బంతికి మిడాఫ్‌లో ఫీల్డర్ క్యాచ్ వదిలేయగా బౌండరీ వచ్చాయి. కానీ, ఐదో బంతికి పెద్ద షాట్ ఆడబోయిన అశుతోష్ క్లీన్ బౌల్డయ్యాడు. చివరి బంతికి హర్ష్ దూబే(3 నాటౌట్) మూడు రన్స్ తీయగా స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఫలితం కోసం మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లగా.. సూపర్ ఓవర్లో బంగ్లా పేసర్ రిప్పన్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత బంగ్లాజట్టు తొలి బంతికి ఒక వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత బంతిని సుయాశ్ శర్మ వైడ్ వేడయంతో బంగ్లా విజయం ఖాయమైంది. దీంతో ఆ జట్టు తొలిసారి ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. రెండో సెమీస్ పాకిస్తాన్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరగనుంది.



