నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అబుధాబీపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ఒకరు భారతీయుడు ఉన్నట్లు వెల్లడైంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా అడ్డుకున్నప్పటికీ.. క్షిపణి శిథిలాలు మీద పడి వీరిద్దరూ చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన మరో వ్యక్తిని పాక్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అబుధాబీ క్షిపణి దాడి ఘటనలో మరో ముగ్గురు గాయపడగా.. వీరిలోనూ ఒకరు భారతీయుడు ఉన్నట్లు యూఏఈ మీడియా విభాగం వెల్లడించింది. మరో ఇద్దరు యూఏఈ, జోర్డాన్‌లకు చెందిన వారని పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి ఎలాంటి వదంతులను పౌరులు నమ్మవద్దని, అధికారుల నుంచి ధ్రువీకరించుకోవాలని సూచించింది. మరోవైపు, యూఏఈపై ఇరాన్ దాడులను జోర్డాన్ ఖండించింది. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగించే చర్యలేనని పేర్కొంది.



