ప్రజలకు పొంచి ఉన్న ముప్పు
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామంలో కచేరి బస్టాండ్ సమీపంలో రోడ్డుపక్కన ఉన్న మిషన్ భగీరథ గేటు వాల్ ఛాంబర్ ప్రమాదకరంగా మారింది. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులు,పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ గేటు వాల్ ఛాంబర్‌కు హెచ్చరిక బోర్డులు,రిఫ్లెక్టర్లు లేకపోవడంతో చీకట్లో స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు.ఈ విషయాన్ని సంబంధిత మిషన్ భగీరథ అధికారులు,పంచాయతీ అధికారులు వెంటనే పరిశీలించి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని,అవసరమైతే గేటు వాల్‌ను మరమ్మతులు చేసి రక్షణ గోడ లేదా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.



