నవతెలంగాణ హైదరాబాద్: దేశంలో అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ తన ప్రధాన ఈఎస్జీ కార్యక్రమం ‘లేక్స్ ఆఫ్ హ్యాపినెస్’ కింద 10వ చెరువు అయిన మియాపూర్ గురునాథ్ చెరువుకు కొత్త శోభను కలిగించారు. ఈ చెరువు పునరుద్ధరణను విజయవంతంగా పూర్తి చేశారు. స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈఓ దలీప్ సేఘల్ మాట్లాడుతూ 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న నీటి వనరులను సామూహిక భాగస్వామ్యంతో పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలోపు 15 చెరువులను దత్తత తీసుకుని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 చెరువులు పునరుద్ధరించామన్నారు. వీటి వల్ల 100 కు పైగా గ్రామాలలో లక్ష మందికి పైగా ప్రజలు లాభం పొందారన్నారు. హైదరాబాద్ ఈ కార్యక్రమంలో ప్రధాన మైలురాయిగా నిలిచిందన్నారు. మియాపూర్‌లోని 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురునాథ్ చెరువు పూర్తిగా పునరుద్ధరించబడిందన్నారు. వినోదం,సామాజిక కార్యక్రమాల కోసం అధికారికంగా అప్పగించామన్నారు.
నీటి కొరత అనేది కేవలం పర్యావరణ సమస్య కాదని, అది మానవ సమస్య కూడా అన్నారు. ఒక చెరువు పునరుజ్జీవం పొందినప్పుడు, అక్కడ జీవం పునరుద్ధరించబడుతుందని తెలిపారు. ‘లేక్స్ ఆఫ్ హ్యాపినెస్’ ద్వారా కేవలం నీటినే కాదు, ప్రజలకు, ప్రకృతికి, భవిష్యత్ తరాలకు సంతోషం, ఆరోగ్యం, శ్రేయస్సు తిరిగి తీసుకువస్తున్నామని తెలిపారు. ‘లేక్స్ ఆఫ్ హ్యాపినెస్’ ప్రత్యేకత ఏమిటంటే, ఇది నెక్సస్ వ్యాపార పరిధిని దాటి ఉన్నాయన్నారు. పునరుద్ధరించిన అనేక చెరువులు నెక్సస్ మాల్స్ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉన్నాయన్నారు. అవి స్థానికులకు జీవనాధారమైన నీటి వనరులుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. చాలీస్గావ్‌లోని వర్షాభావ ప్రాంతాల రైతు భూముల నుంచి చెన్నై ఆలయాలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థల వరకు, బెంగళూరులోని వన్యప్రాణి మార్గాల వరకు విస్తరించి ఉన్నాయని తెలిపారు.
ప్రఖ్యాత నీటి సంరక్షణ కార్యకర్తలు ఆనంద్ మల్లిగవాడ్ (లేక్ మాన్ ఆఫ్ ఇండియా), గునవంత్ సోనవనే వంటి నిపుణులతో కలిసి, నెక్సస్ సంప్రదాయ పద్ధతుల ఆధారంగా ప్రకృతి-స్నేహపూర్వక పునరుద్ధరణ సాంకేతికాలు ఉపయోగిస్తోందన్నారు. ఇందులో సిమెంట్, స్టీల్ వాడకాన్ని నివారించడం, బదులుగా డీ-సిల్టింగ్ (చెరువు మట్టిని తొలగించడం), చెరువు లోతు పెంచడం, వృక్షాలు నాటడం, సహజ వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పునర్నిర్మించడం వంటి పద్ధతులపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంతో జల్గావ్, చాలీస్గావ్ వంటి వర్షాభావ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 1.5 రెట్లు పెరిగాయన్నారు. 20 ఎండిపోయిన బావులు తిరిగి నీటితో నిండాయన్నారు. వర్షాకాలం తరువాత వందల ఎకరాల వ్యవసాయ భూములు పునరుద్ధరించబడ్డాయని తెలిపారు. పునరుద్ధరించబడిన చెరువులలో జీవ వైవిధ్యం విస్తరిస్తూ, వలస పక్షులు తిరిగి రావడం, స్థానిక వృక్షజాలం పుష్పించడం జరిగిందన్నారు. ఇప్పుడు కుటుంబాలు సంవత్సరం పొడవునా తాగు నీటిని స్థానికంగానే పొందగలుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ జయేన్ నాయిక్ మాట్లాడుతూ పునరుద్ధరించిన ప్రతి చెరువు మళ్లీ తన సమాజానికి ఉపయోగకరంగా మారిందన్నారు. భూగర్భ జలాలను పునరుద్ధరించడం, పక్షులను ఆకర్షించడం, పంటల ఉత్పత్తిని మెరుగుపరచడం, ప్రజలను ప్రకృతితో మళ్లీ అనుసంధానం చేయడం వంటి అద్భుత ఫలితాలను ఇస్తుందన్నారు.



