డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి- గడ్డం వెంకటేష్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రం ఆస్పత్రిలో సమస్యలు అనేకం ఉన్నాయని స్థానిక శాసనసభ్యులు సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం ఆస్పత్రిని సర్వే నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన ప్రజల ఆరోగ్యాలను సరి చేసే ఆసుపత్రులు మాత్రం మారడం లేదని సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని వారు అన్నారు. స్థానిక శాసనసభ్యులు అనేకసార్లు ఆస్పత్రిని పర్యటించిన పర్యటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక పనులు చేయడం లేదని వారన్నారు.
రాత్రి సమయాలలో ఏదైనా ప్రమాదం జరిగినా వైద్యులు అందుబాటులో లేక హైదరాబాదు లాంటి మహానగరాలకు వైద్యం కోసం వెళ్లవలసిన దుస్థితి జిల్లాలో ఉందని వారు అన్నారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో బాత్రూములు సరిగ్గా లేక వచ్చిన పేషెంట్లు కనీసం భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. అదేవిధంగా మురికి కుంపలాగా ఆసుపత్రి ఆవరణ తయారయిందని, శుభ్రతపై కనీసం దృష్టి పెట్టే పరిస్థితి లేదని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయ్యి ఆస్పత్రి ముందే కాలువలాగా మారి దుర్వాసన వస్తున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని వారు గుర్తు చేశారు.
జిల్లా కేంద్రం ఆస్పత్రికి వెళితే కొత్త రోగాలు వస్తున్నాయి తప్ప వచ్చిన రోగం నయం అయ్యే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి, జిల్లా కేంద్రం ఆస్పత్రిని మరింత మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న కాలంలో దఫల వారి కార్యక్రమాలు ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. వీరితోపాటు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, ఎండి సాజిద్, ఎండి సోహెల్ లు పాల్గొన్నారు.



